పట్నా: బిహార్ ఘోర ఎన్నికల ఘోర పరాభవంపై రాష్ట్రీయ జనతా దళ్ (RJD) పార్టీ స్పందించింది. రాజకీయ ప్రయాణంలో ఓటమి అనేది ఒక భాగమేనని.. అలాగే ప్రజాసేవ అనేది నిరంతర ప్రక్రియగా అభివర్ణించింది.
‘‘ప్రజాసేవ అనేది అంతం లేని ప్రయాణం. ఇందులో ఆటుపోట్లు.. ఎత్తుపల్లాలు సహజం. విజయం దక్కిందని అహంకారం ఉండదు. అలాగే.. ఓటమితో కుంగిపోం. రాష్ట్రీయ జనతా దళ్ అనేది పేదల పార్టీ. అధికారంలో ఉన్నా.. ప్రతిపక్షంలో ఉన్నా.. పేదల మధ్య వారి గొంతును ఎప్పటికీ వినిపిస్తూనే ఉంటుంది’’ అని ఆ పార్టీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్, ఆయన తనయుడు తేజస్వి యాదవ్ పేరిట సోషల్ మీడియాలో ఆ పార్టీ ఓ పోస్ట్ చేసింది.
जनसेवा एक अनवरत प्रक्रिया है, एक अंतहीन यात्रा है!
इसमें उतार चढ़ाव आना तय है। हार में विषाद नहीं, जीत में अहंकार नहीं!
राष्ट्रीय जनता दल गरीबों की पार्टी है, गरीबों के बीच उनकी आवाज़ बुलंद करते रहेगी!@yadavtejashwi @laluprasadrjd— Rashtriya Janata Dal (@RJDforIndia) November 15, 2025
బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో 202 సీట్లతో ఎన్డీయే కూటమి ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరలించగా.. మిత్రపక్షం జేడీయూ రెండో స్థానంలో నిలిచింది. చిరాగ్ పాశ్వాన్ లోక్ జనశక్తి (రామ్ విలాస్) పార్టీ 19 స్థానాలు నెగ్గి.. అత్యధిక స్ట్రయిక్ రేట్ సాధించిన పార్టీగా నిలిచింది.
ఇక.. ప్రతిపక్ష మహాఘట్ బంధన్ కూటమిలోని ఆర్జేడీ (RJD) 143 స్థానాల్లో పోటీ చేసి కేవలం 25 సీట్లు సాధించింది. గత ఎన్నికల్లో 75 స్థానాలతో అతిపెద్ద పార్టీగా అవతరించిన ఆర్జేడీ.. ఈ ఎన్నికల్లో 25 స్థానాలకు పడిపోవడం గమనార్హం. 2010 తర్వాత ఆ పార్టీకి ఘోర పరాభవం ఇదే. మిత్రపక్షం కాంగ్రెస్ సైతం 61 స్థానాల్లో పోటీ చేసి ఆరు స్థానాలను మాత్రమే కైవసం చేసుకుంది(గత ఎన్నికల్లో 19 స్థానాలు నెగ్గింది). మహా కూటమిలో గేమ్ చేంజర్ అవుతుందని భావించిన వీఐపీ పార్టీ 0 స్థానాలతో ఏమాత్రం ప్రభావం చూపలేకపోయింది. సీపీఐ, సీపీఎం వామపక్షాలు 3 స్థానాలు దక్కించుకున్నాయి. మొత్తంగా విపక్ష కూటమి 34 స్థానాలను మాత్రమే పరిమితమైంది.


