సాక్షి,చెన్నై: పీఎంకేలో గత ఏడాదిన్నర కాలంగా తండ్రీకొడుకుల మధ్య సాగుతున్న అధికార పోరాటానికి ఎట్టకేలకు తెరపడింది. పార్టీ వ్యవస్థాపకుడు డాక్టర్ రామదాస్, ఆయన కుమారుడు , పార్టీ అధ్యక్షుడు అన్బుమణి రామదాస్ ల మధ్య వివాదం కారణంగా గత శాసనసభ ఎన్నికల్లో ఇరువర్గాలు విడివిడిగా పనిచేశాయి. అయితే, రామదాస్ వివాహ వార్షికోత్సవం సందర్భంగా ఈ కుటుంబ కలహాలు సమసిపోయాయి. అయితే, ఈ పరిణామాలతో రాందాసు కుమార్తె శ్రీగాంధితో పాటుగా ముఖ్య నేతలలో తీవ్ర అసంతృప్తి అన్నది బయలు దేరింది.
కుటుంబ సభ్యుల సమక్షంలో భావోద్వేగ కలయిక:
గత ఎన్నికల్లో రామదాస్ తీవ్ర విమర్శలు చేసినప్పటికీ, అన్బుమణి భార్య సౌమ్య అన్బుమణితో సహా నలుగురు పీఎంకే ఎమ్మెల్యేలు విజయం సాధించారు. ఆ తర్వాత పారీ్టపై అన్బుమణి పట్టు బిగిసింది. ఈ నేపథ్యంలో తండ్రీకొడుకులను కలపడానికి కుటుంబ పెద్దలు, ముఖ్య నేతలు రాయబారం నడిపారు. రామదాస్ – సరస్వతి దంపతుల 61వ వివాహ వార్షికోత్సవాన్ని ఇందుకు వేదికగా ఎంచుకున్నారు. బుధవారం తైలాపురం తోటలోని రామదాస్ నివాసానికి అన్బుమణి, ఆయన భార్య సౌమ్య, కుమార్తెలు సంయుక్త, సంగమిత్ర, సంజుత్ర, అల్లుళ్లు, మనవళ్లతో కలిసి వచ్చారు.
రామదాస్ వర్గీయులు వారికి హారతి ఇచ్చి స్వాగతం పలికారు. ఏడాదిన్నరగా కొడుకును దూరం పెట్టిన రామదాస్, అన్బుమణిని చూడగానే కన్నీళ్లతో ఆలింగనం చేసుకున్నారు. అనంతరం కుటుంబం అంతా కలిసి మధ్యాహ్న భోజనం చేశారు.దీనిపై అన్బుమణి మాట్లాడుతూ, అమ్మ, నాన్నల 61వ పెళ్లిరోజు సందర్భంగా కుటుంబ సమేతంగా వచ్చి ఆశీస్సులు తీసుకున్నాం. ఇకపై అంతా మంచిదే జరుగుతుందన్నారు. ఇంత వరకు అంతా బాగానే సాగినా అసలు ట్విస్టు తాజాగా బయలు దేరింది.
తెరపైకి కొత్త వివాదం: సోదరి శ్రీగాంధి అసంతృప్తి
తండ్రీకొడుకులు ఒకటవ్వడం పార్టీ శ్రేణుల్లో ఆనందం నింపినప్పటికీ, కుటుంబంలో మాత్రం మరో వివాదం నివురు గప్పిన నిప్పులా మారింది. రామదాస్‌ను అన్బుమణి కలిసిన సమయంలో ఆయన చిన్న చెల్లెలు కవిత ఉన్నారు. కానీ, పెద్ద కుమార్తె, పీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్ (కార్యనిర్వాహక అధ్యక్షురాలు) శ్రీగాంధి, ఆమె కుమారుడు ముకుందన్ ఈ వేడుకను బహిష్కరించారు. గతంలో కొడుకుపై కోపంతో అన్బుమణిని పక్కన పెట్టిన రామదాస్, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవిని పెద్ద కుమార్తె శ్రీగాంధికి అప్పగించారు. అయితే ఆమె ను బలవంతంగా ఈ పదవిలో కూర్చోబెట్టారని టాక్. ప్రస్తుతం రాజకీయాల్లోకి వచ్చిన శ్రీగాంధి ఎలాగైనా ఎంపీ లేదా ఎమ్మెల్యే కావాలన్న పట్టుదలతో ఉన్నట్టు సంకేతాలు వెలువడ్డాయి.
తనను రాజకీయాల్లోకి బలవంతంగా తీసుకొచ్చి , ఇప్పు డు తండ్రీకొడుకులు రాజీ పడటంతో ఆమె తీవ్ర అసంతృప్తితో ఉన్నట్టు మద్దతు వర్గాలు పేర్కొంటున్నాయి. పార్టీపై మళ్లీ అన్బుమణి పూర్తి పట్టు సాధించిన పక్షంలో తన రాజకీయ భవిష్యత్తు , అధికార కలలు కల్లలుగానే మిగిలిపోతాయని శ్రీగాంధి తీవ్ర ఆందోళనలో ఉన్నట్లు ఆమె సన్నిహిత వర్గాలు పేర్కొంటున్నాయి. అదే సమయంలో శ్రీగాంధి పీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్ పదవిలో కొనసాగుతుండటం వల్ల, తండ్రీకొడుకులు ఒకటైనా పార్టీలో అంతర్గత వివాదాలు కొనసాగుతూనే ఉంటుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.


