breaking news
PMK chief Ramdas
-
విధ్వంసంతో రిజర్వేషన్లు సాధ్యమేనా?
సాక్షి, న్యూఢిల్లీ : తమిళనాడులో కులాల డేటాను సేకరించడానికి అనుసరించాల్సిన పద్ధతులను సూచించేందుకు త్వరలోనే ఓ కమిషన్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పళనిస్వామి సోమవారం ప్రకటించిన విషయం తెల్సిందే. విద్య, ప్రభుత్వ ఉద్యోగాల్లో వెన్నియార్ సామాజిక వర్గానికి 20 శాతం రిజర్వేషన్లు కల్పించాలంటూ మాజీ కేంద్ర మంత్రి అంబుమణి రాందాస్ నాయకత్వంలో పట్టాలి మక్కల్ కాట్చి ప్రతినిధి బృందం కలసి వెళ్లాక పళనిస్వామి ఈ ప్రకటన చేశారు. ప్రస్తుతం వెన్నియార్ సామాజిక వర్గం తమిళనాడులో ఎక్కువ వెనక బడిన వర్గాల (ఎంబసీ) జాబితాలోన కొనసాగుతోంది. ఓటర్లలో కూడా వారిది చాలా బలమైన వర్గం. 2021, ఏప్రిల్, మే నెలల్లో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో వెన్నియార్ వర్గం తమకు ప్రభుత్వ ఉద్యోగాల్లో, విద్యా సంస్థల్లో 20 శాతం రిజర్వేషన్లు కావాలంటూ డిమాండ్ తీసుకొచ్చింది. తమిళనాడులో ఇప్పటికే 69 శాతం రిజర్వేషన్లు కొనసాగుతున్నాయి. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో పట్టాలి మక్కల్ కాట్చి (పీఎంకే), ఏఐఏడిఎంకే, బీజేపీలతో కలసి పోటీ చేయాలనుకుంటోంది. 2019లో ఏఐఏడీఎంకేతో కలసి పొత్తు పెట్టుకోవడం వల్లనే రామదాస్ రాజ్యసభకు ఎన్నికయ్యారు. (కొత్త పార్టీ: రజనీకాంత్ కీలక ప్రకటన) వెన్నియార్ సామాజిక వర్గానికి ప్రత్యేకంగా రిజర్వేషన్లు కోరుతూ రాష్ట్రవ్యాప్తంగా పీఎంకే ఆందోళన ప్రారంభించిన రోజునే కులాల డేటా సేకరణకు కమిషన్‌ను ఏర్పాటు చేస్తానంటూ పళనిస్వామి ప్రకటించారు. తమ డిమాండ్‌ను రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించేంత తీవ్రంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేయాలంటూ పార్టీ కార్యకర్తలకు పార్టీ వ్యవస్థాపక నాయకుడు రామదాస్ పిలుపునివ్వడంతో ఆందోళన విధ్వంసం చోటు చేసుకుంది. చెన్నై నగరంలోకి ఎక్స్‌ప్రెస్ రైలు రాకుండా శివారులోనే దానిపై ఆందోళనకారులు రాళ్లతో దాడి చేశారు. ప్రధాన రహదారులన్నింటిని మూసివేశారు. దీంతో పీఎంకేను నిషేధించాలంటూ సోషల్ మీడియాలో డిమాండ్లు వెల్లువెత్తాయి. మద్రాస్ హైకోర్టు జోక్యం చేసుకొని విధ్వంసానికి బాధ్యులను చేస్తూ రామదాస్‌తోపాటు ఆయన కుమారుడు అంబుమణి రామదాస్‌లపై కేసులు నమోదు చేయాలంటూ ఆదేశాలు జారీ చేసింది. (బీజేపీతో మైత్రి కొనసాగుతుంది: అన్నాడీఎంకే) ఆందోళనల్లో విధ్వంసం సష్టించడం పీఎంకేకు కొత్త కాదు. వెనకబడిన వర్గాల (బీసీ) జాబితా నుంచి ఎక్కువ వెనకబడిన వర్గాల (ఎంబీసీ) జాబితాను వేరు చేయాలంటూ 1987లో పీఎంకే ఆందోళనలో విధ్వంసకాండకు పాల్పడగా 21 మంది మరణించారు. ఆ నేపథ్యంలోనే 1989లో అప్పటి డీఎంకే ప్రభుత్వం 20 శాతం రిజర్వేషన్లతో ఎంబీసీ కోటాను ఏర్పాటు చేసింది. ప్రస్తుతానికి పీఎంకే ఆందోళనలను ఆపేందుకే కులాల డేటా సేకరణకు కమిషన్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి పళనిస్వామి ప్రకటించారు. దీనవల్ల విపరీత పరిణామాలు చోటుచేసుకొనే ప్రమాదం ఉంది. (నాన్న పార్టీ.. నాకు సంబంధం లేదు: విజయ్ ) తమిళనాడు కమిషన్ వేసినా కులాల డేటాకు సర్వే నిర్వహించక పోవచ్చు. ఒకవేళ నిర్వహించినా దాన్ని విడుదల చేయకపోవచ్చు. కులాల ప్రాతిపదికన కాకుండా దేశంలో సామాజికంగా, ఆర్థికంగా వెనకబాటు ప్రాతిపదికన 2011లో కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన సర్వేనే ఇంతవరకు ఏ ప్రభుత్వం కూడా విడుదల చేసేందుకు సాహసించలేదు. కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వ కూడా 2015లో ప్రజల సామాజిక, ఆర్థిక వెనకబాటుతనం మీద చేసిన సర్వేను ఇంతవరకు విడుదల చేయలేదు. ఇందుకు కారణం ఎఫ్‌సీ, బీసీ, ఓసీ, ఎంబీసీల డేటాకు సంబంధించి ఇప్పటి వరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉజ్జాయింపుగా చెబుతున్న లెక్కలకు, ఆయా సామాజిక వర్గాలు చెబుతున్న లెక్కలకు, సర్వే లెక్కలు భిన్నంగా ఉండడమే. సర్వే వివరాలను బయటకు వెల్లడించడం వల్ల ప్రభుత్వాలకు, పార్టీలకు మధ్య గొడవలే కాకుండా, సమాజంలో కూడా అశాంతి పరిస్థితులు ఏర్పడుతాయన్న భయమే ప్రధాన కారణం. తమిళనాడులో సర్వే నిర్వహిస్తే రాష్ట్ర జనాభాలో వెన్నియార్ సామాజిక వర్గం వారు 20 శాతం కూడా లేరని తెలిస్తే గొడవలు జరగుతాయి. ఎంబీసీ జాబితా నుంచి వారిని వేరు చేసి, ప్రస్తుతం డిమాండ్ చేస్తున్నట్లు వారికి ప్రత్యేక క్యాటగిరీ కింద 20 శాతం రిజర్వేషన్లు కేటాయించిన ఇతర సామాజిక వర్గాలు ఆందోళనలకు దిగుతాయి. అప్పుడు రాష్ట్రంలో రిజర్వేషన్లు కూడా 89 శాతం చేరుకుంటాయి. రిజర్వేషన్లు 50 శాతం కోటాను మించకూడదంటూ సుప్రీం కోర్టు మార్గదర్శకాలు సూచించిన విషయ తెల్సిందే. -
పీఎంకే అధినేత రాందాస్ కొత్త స్వరం
పీఎంకే అధినేత రాందాస్ కొత్త స్వరం అందుకున్నారు. ఆంధ్రప్రదేశ్ సరిహద్దుల్లో తమిళులు అధికంగా నివసించే మండలాలను తమిళనాడులో కలపాలనే డిమాండ్‌ను తెరపైకి తెచ్చారు. ఈ దిశగా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేనున్నట్లు ప్రకటించారు. చెన్నై, సాక్షి ప్రతినిధి: తమిళనాట పీఎంకే బలోపేతమే లక్ష్యంగా రాందాస్ సాగుతున్నారు. రాజకీయంగా బలమైన వన్నియర్ సామాజిక వర్గాన్ని చేరదీయడం లక్ష్యంగా పావులు కదిపారు. ఈ క్రమంలో ఆయన అనేక కేసుల్లో ఇరుక్కున్నారు. ముఖ్యంగా మరక్కానం అల్లర్ల కేసులు వెంటాడుతున్నాయి. అరెస్టులు, విధ్వంసం వల్ల ప్రభుత్వానికి ఏర్పడిన కోట్లాది రూపాయల నష్టాన్ని పీఎంకే నుంచి ముక్కుపిండి వసూలు చేయడానికి ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలో రాందాస్ ఇష్టారాజ్యంగా సంచరించే వీలు లేకుండా నిషేధాజ్ఞలు అమలుచేసే పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌ను విభజిస్తూ తెలంగాణ ఏర్పాటుకు అనుకూలంగా కేంద్రం ఇటీవల నిర్ణయం ప్రకటించింది. అదే సమయంలో రాందా స్ కొత్త స్వరం అందుకున్నారు. తమిళనాడులో కలపాలి తమిళనాడు-ఆంధ్రప్రదేశ్ సరిహద్దుల్లో నివసించే తమిళుల హక్కులు కాపాడడం అనే మరో అజెండాను రాందాస్ సిద్ధం చేసుకున్నారు. తమిళులు ఆంధ్రప్రదేశ్‌లో ద్వితీయశ్రేణి పౌరులుగా పరిగణించబడుతున్నారనే వాదనను ఆయన లేవనెత్తారు. ఈ మేరకు రాందాస్ శనివారం చెన్నైలో ఓ ప్రకటన విడుదల చేశారు. 1956లో భాషా ప్రయుక్త రాష్ట్రాలుగా విభజన జరిగినప్పుడు అధికంగా నష్టపోయింది తమిళనాడు మాత్రమేనని తెలిపారు. మొత్తం 70 వేల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ రాష్ట్రాల్లో కలిసిపోయిందని పేర్కొన్నారు. ఇందులో ఆంధ్రప్రదేశ్ వాటా 32 వేల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలోని ఎనిమిది మండలాలు (300 గ్రామాలు)గా తెలిపారు. ఇది తమిళ ప్రజలకు ఆ రోజుల్లో జరిగిన పెద్ద ద్రోహంగా అభివర్ణించారు. విద్య, ఉద్యోగం విషయాల్లో స్థానికేతరులుగా పరిగణించడం వల్ల తమిళులు నష్టపోతున్నారని తెలిపారు. అలాగే క్షేత్రస్థాయి మొదలుకుని ఎమ్మె ల్యే, ఎంపీలుగా పోటీచేసే రాజకీయ హక్కును కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో నివసించే తమిళులు తమ ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేసుకోవాలంటే 700 కిలోమీటర్ల దూరంలోని హైదరాబాద్‌కు వెళ్లాల్సి ఉందని తెలిపారు. ఈ ఎనిమిది మండలాలను తమిళనాడులో కలిపితే కేవలం 50 కిలోమీటర్ల దూరంలో ఉండే ముఖ్యమంత్రికి విన్నవించుకోవచ్చని ఆయన వివరించారు. ఇటువంటి అనేక ప్రయోజనాల దృష్ట్యా చిత్తూరు, పుత్తూరు, సత్యవేడు, తిరుపతి, శ్రీకాళహస్తి మరో మూడు మండలాలను తమిళనాడులో కలపాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. భాషాప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు సమయంలో తమిళనాడుకు ఏర్పడిన నష్టాన్ని ఈ ఎనిమిది మండలాలను కలపడం ద్వారా భర్తీ చేయవచ్చని పేర్కొన్నారు. ఈ మేరకు తమ పార్టీ కేంద్రంపై ఒత్తిడి తేనున్నట్లు తెలిపారు.