విధ్వంసంతో రిజర్వేషన్లు సాధ్యమేనా?

Tamilnadu: Survay Plan Is Political Game! - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : తమిళనాడులో కులాల డేటాను సేకరించడానికి అనుసరించాల్సిన పద్ధతులను సూచించేందుకు త్వరలోనే ఓ కమిషన్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పళనిస్వామి సోమవారం ప్రకటించిన విషయం తెల్సిందే. విద్య, ప్రభుత్వ ఉద్యోగాల్లో వెన్నియార్‌ సామాజిక వర్గానికి 20 శాతం రిజర్వేషన్లు కల్పించాలంటూ మాజీ కేంద్ర మంత్రి అంబుమణి రాందాస్‌ నాయకత్వంలో పట్టాలి మక్కల్‌ కాట్చి ప్రతినిధి బృందం కలసి వెళ్లాక పళనిస్వామి ఈ ప్రకటన చేశారు. 

ప్రస్తుతం వెన్నియార్‌ సామాజిక వర్గం తమిళనాడులో ఎక్కువ వెనక బడిన వర్గాల (ఎంబసీ) జాబితాలోన కొనసాగుతోంది. ఓటర్లలో కూడా వారిది చాలా బలమైన వర్గం. 2021, ఏప్రిల్, మే నెలల్లో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో వెన్నియార్‌ వర్గం తమకు ప్రభుత్వ ఉద్యోగాల్లో, విద్యా సంస్థల్లో 20 శాతం రిజర్వేషన్లు కావాలంటూ డిమాండ్‌ తీసుకొచ్చింది. తమిళనాడులో ఇప్పటికే 69 శాతం రిజర్వేషన్లు కొనసాగుతున్నాయి. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో పట్టాలి మక్కల్‌ కాట్చి (పీఎంకే), ఏఐఏడిఎంకే, బీజేపీలతో కలసి పోటీ చేయాలనుకుంటోంది. 2019లో ఏఐఏడీఎంకేతో కలసి పొత్తు పెట్టుకోవడం వల్లనే రామదాస్‌ రాజ్యసభకు ఎన్నికయ్యారు. (కొత్త పార్టీ: రజనీకాంత్‌ కీలక ప్రకటన)

వెన్నియార్‌ సామాజిక వర్గానికి ప్రత్యేకంగా రిజర్వేషన్లు కోరుతూ రాష్ట్రవ్యాప్తంగా పీఎంకే ఆందోళన ప్రారంభించిన రోజునే కులాల డేటా సేకరణకు కమిషన్‌ను ఏర్పాటు చేస్తానంటూ పళనిస్వామి ప్రకటించారు. తమ డిమాండ్‌ను రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించేంత తీవ్రంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేయాలంటూ పార్టీ కార్యకర్తలకు పార్టీ వ్యవస్థాపక నాయకుడు రామదాస్‌ పిలుపునివ్వడంతో ఆందోళన విధ్వంసం చోటు చేసుకుంది. చెన్నై నగరంలోకి ఎక్స్‌ప్రెస్‌ రైలు రాకుండా శివారులోనే దానిపై ఆందోళనకారులు రాళ్లతో దాడి చేశారు.  ప్రధాన రహదారులన్నింటిని మూసివేశారు. దీంతో పీఎంకేను నిషేధించాలంటూ సోషల్‌ మీడియాలో డిమాండ్లు వెల్లువెత్తాయి. మద్రాస్‌ హైకోర్టు జోక్యం చేసుకొని విధ్వంసానికి బాధ్యులను చేస్తూ  రామదాస్‌తోపాటు ఆయన కుమారుడు అంబుమణి రామదాస్‌లపై కేసులు నమోదు చేయాలంటూ ఆదేశాలు జారీ  చేసింది. (బీజేపీతో మైత్రి కొనసాగుతుంది: అన్నాడీఎంకే)

ఆందోళనల్లో విధ్వంసం సష్టించడం పీఎంకేకు కొత్త కాదు. వెనకబడిన వర్గాల (బీసీ) జాబితా నుంచి ఎక్కువ వెనకబడిన వర్గాల (ఎంబీసీ) జాబితాను వేరు చేయాలంటూ 1987లో పీఎంకే ఆందోళనలో విధ్వంసకాండకు పాల్పడగా 21 మంది మరణించారు. ఆ నేపథ్యంలోనే 1989లో అప్పటి డీఎంకే ప్రభుత్వం 20 శాతం రిజర్వేషన్లతో ఎంబీసీ కోటాను ఏర్పాటు చేసింది. ప్రస్తుతానికి పీఎంకే ఆందోళనలను ఆపేందుకే కులాల డేటా సేకరణకు కమిషన్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి పళనిస్వామి ప్రకటించారు. దీనవల్ల విపరీత పరిణామాలు చోటుచేసుకొనే ప్రమాదం ఉంది. (నాన్న పార్టీ.. నాకు సంబంధం లేదు: విజయ్‌ )

తమిళనాడు కమిషన్‌ వేసినా కులాల డేటాకు సర్వే నిర్వహించక పోవచ్చు. ఒకవేళ నిర్వహించినా దాన్ని విడుదల చేయకపోవచ్చు. కులాల ప్రాతిపదికన కాకుండా దేశంలో సామాజికంగా, ఆర్థికంగా వెనకబాటు ప్రాతిపదికన 2011లో కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన సర్వేనే ఇంతవరకు ఏ ప్రభుత్వం కూడా విడుదల చేసేందుకు సాహసించలేదు. కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వ కూడా 2015లో ప్రజల సామాజిక, ఆర్థిక వెనకబాటుతనం మీద చేసిన సర్వేను ఇంతవరకు విడుదల చేయలేదు. ఇందుకు కారణం ఎఫ్‌సీ, బీసీ, ఓసీ, ఎంబీసీల డేటాకు సంబంధించి ఇప్పటి వరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉజ్జాయింపుగా చెబుతున్న లెక్కలకు, ఆయా సామాజిక వర్గాలు చెబుతున్న లెక్కలకు, సర్వే లెక్కలు భిన్నంగా ఉండడమే. సర్వే వివరాలను బయటకు వెల్లడించడం వల్ల ప్రభుత్వాలకు, పార్టీలకు మధ్య గొడవలే కాకుండా, సమాజంలో కూడా అశాంతి పరిస్థితులు ఏర్పడుతాయన్న భయమే ప్రధాన కారణం. 

తమిళనాడులో సర్వే నిర్వహిస్తే రాష్ట్ర జనాభాలో వెన్నియార్‌ సామాజిక వర్గం వారు 20 శాతం కూడా లేరని తెలిస్తే గొడవలు జరగుతాయి. ఎంబీసీ జాబితా నుంచి వారిని వేరు చేసి, ప్రస్తుతం డిమాండ్‌ చేస్తున్నట్లు వారికి ప్రత్యేక క్యాటగిరీ కింద 20 శాతం రిజర్వేషన్లు కేటాయించిన ఇతర సామాజిక వర్గాలు ఆందోళనలకు దిగుతాయి. అప్పుడు రాష్ట్రంలో రిజర్వేషన్లు కూడా 89 శాతం చేరుకుంటాయి. రిజర్వేషన్లు 50 శాతం కోటాను మించకూడదంటూ సుప్రీం కోర్టు మార్గదర్శకాలు సూచించిన విషయ తెల్సిందే. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top