అమ్మకు ఘన నివాళి.. మెరీనా తీరంలో ఉద్రిక్తత 

Jayalalitha 5th Death Anniversary In Tamilnadu - Sakshi

సాక్షి, చెన్నై(తమిళనాడు): దివంగత ముఖ్యమంత్రి అమ్మ జయలలిత ఐదో వర్ధంతిని రాష్ట్ర వ్యాప్తంగా ఆదివారం ఘనంగా నిర్వహించారు. వాడవాడల్లో అన్నాడీఎంకే, అమ్మ మక్కల్‌ మున్నేట్ర కళగం నేతలు పోటాపోటీగా కార్యక్రమాలు నిర్వహించారు.

అమ్మ సమాధి సాక్షిగా కుట్రలను భగ్నం చేస్తామని అన్నాడీఎంకే సమన్వయ కమిటీ పెద్దలు పన్నీరు సెల్వం, పళని స్వామి ప్రతిజ్ఞ చేశారు. గెలుపే లక్ష్యంగా అందరం ఏకం అవుదామని చిన్నమ్మ శశికళ పిలుపునిచ్చారు. ఇరు వర్గాలు అమ్మ సమాధి సాక్షిగా బల ప్రదర్శనకు దిగడంతో మెరీనా తీరంలో ఉద్రిక్తత నెలకొంది.

 

పోటాపోటీ.. 
అన్నాడీఎంకే నేతలు వాడవాడల్లో జయలలిత విగ్రహాలు, చిత్రపటాలకు నివాళులర్పించారు. పలుచోట్ల సేవా కార్యక్రమాలు నిర్వహించారు. తామేమి తక్కువ తిన్నామా..? అన్నట్టుగా అమ్మ మక్కల్‌ మున్నేట్ర కళగం వర్గాలు పోటాపోటీగా కార్యక్రమాలు నిర్వహించాయి.  

సమాధి వద్ద నివాళులు 
మెరీనా తీరంలోని అమ్మ సమాధి వద్దకు నేతలు క్యూకట్టారు. అన్నాడీఎంకే సమన్వయ కమిటీ కన్వీనర్‌ పన్నీరు సెల్వం, కో కన్వీనర్‌ పళనిస్వామి, ప్రిసీడియం(తాత్కాలిక) చైర్మన్‌ తమిళ్‌ మగన్‌ హుస్సేన్‌ నేతృత్వంలో పార్టీ ఎమ్మెల్యేలు, ప్రతినిధులు పెద్దఎత్తున తరలివచ్చారు. నల్ల చొక్కాలు ధరించిన నేతలు అమ్మ సమాధి వద్ద పుష్పాంజలి ఘటించారు. అమ్మ సేవలను గుర్తు చేస్తూ ఆమె ఆశయ సాధన లక్ష్యంగా అందరి చేత పన్నీరు సెల్వం ప్రతిజ్ఞ చేయించారు.

అన్నాడీఎంకేను కైవశం చేసుకునేందుకు పగటి కలలు కంటున్న వారి కుట్రలను భగ్నం చేస్తామని అమ్మ సమాధి సాక్షిగా ప్రతిజ్ఞ  చేశారు. అమ్మకు నివాళులర్పించినానంతరం ఎంజీఆర్‌ సమా«ధి వద్దకు నేతలు వెళ్లడం సహజం. అయితే ఈసారి ఎంజీఆర్‌ను మరిచారు. అటు వైపుగా వెళ్లకుండానే నేతలు వెళ్లిపోవడం గమనార్హం

బల ప్రదర్శనకు వేదికగా.. 
మెరీనా తీరంలోని అమ్మ సమాధి సాక్షిగా వర్ధంతి కార్యక్రమాన్ని అన్నాడీఎంకే, అమ్మమక్కల్‌ మున్నేట్ర కళగం వర్గాలు బల ప్రదర్శనకు వేదికగా చేసుకున్నాయి. దీంతో మెరీనా తీరంలో ఉద్రిక్తత నెలకొంది. పన్నీరు, పళని నివాళులర్పించి వెళ్తున్న సమయంలో ఏఎంఎంకే నేతలు అడ్డుకోవడం ఉద్రిక్తతకు దారి తీశాయి. పళని స్వామి వాహనంపై గుర్తుతెలియని వ్యక్తులు చెప్పులు, రాళ్లు విసరడంతో పోలీసులు రంగప్రవేశం చేశారు.

ఇరు వర్గాలు పోటాపోటీ నినాదాలతో హోరెత్తించారు. దినకరన్‌ మద్దతుతో కొందరు దాడులకు ప్రయత్నించారని అన్నాడీఎంకే నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దినకరన్‌ ఓపెన్‌ టాప్‌ వాహనంలో ప్రచారానికి వెళ్తున్నట్టుగా మద్దతుదారులతో తరలిరావడం గమనార్హం.

కన్నీటితో చిన్నమ్మ ప్రతిజ్ఞ 
జయలలిత నెచ్చెలి శశికళ సమాధి వద్దకు చేరుకుని అంజలి ఘటించారు. ఆమె వెన్నంటి మద్దతుదారులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. గెలుపే లక్ష్యంగా ప్రత్యర్థులను ఓడించడం కోసం అందరం ఏకం అవుదామని అమ్మ సమాధి వద్ద ప్రతిజ్ఞ చేస్తూ అన్నాడీఎంకే వర్గాలకు పరోక్షంగా చిన్నమ్మ పిలుపునిచ్చారు.

ఈ సమయంలో ఆమె ఉద్వేగానికి గురై కన్నీటి నివాళులర్పించారు. అనంతరం అమ్మ మక్కల్‌మున్నేట్ర కళగం నేత దినకరన్‌ సమాధి వద్దకు చేరుకుని అంజలి ఘటించారు.   

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top