సాక్షి, హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో నేతల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి స్ట్రాంగ్ కౌంటరిచ్చారు. తెలంగాణ అభివృద్ధి విషయంలో నాకు రేవంత్ రెడ్డి సర్టిఫికెట్ అవసరం లేదంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ వెన్నుపోటు పొడిచిందని ఆరోపించారు.
బీజేపీ ఆఫీసులో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ..‘ఎన్నికల హామీల గురించి సీఎం రేవంత్‌రెడ్డి ఒక్కమాట మాట్లాడరు. హామీలు ఏం అమలు చేశారో సీఎం రేవంత్‌రెడ్డి చెప్పరు. సీఎం రేవంత్ నాపై చేసిన వ్యాఖ్యలను నిరూపించాలి. ఆయన నాపై వ్యక్తిగత విమర్శలు చేసినా నేను భయపడను. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ప్రజలకు రేవంత్ ఏం చేశారో చెప్పాలి. రేవంత్ రెడ్డి మాటలను తెలంగాణ ప్రజలు విశ్వసించడం లేదు. తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ వెన్నుపోటు పొడిచింది.
ఆరు గ్యారెంటీల గురించి కాంగ్రెస్ ఎందుకు మాట్లాడటం లేదు. జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ ఓటమి తథ్యం. వాస్తవాలకు విరుద్ధంగా రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు ఉన్నాయి. నన్ను విమర్శించే నైతిక హక్కు సీఎం రేవంత్ రెడ్డికి లేదు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ ఒక్కటే. ఫోన్ ట్యాపింగ్, విద్యుత్, ధాన్యం కొనుగోళ్ల కేసు ఏమైంది?. ఫార్మా కంపెనీలు, పారిశ్రామికవేత్తలను బెదిరించి వేల కోట్లు వసూలు చేశారు. తెలంగాణ అభివృద్ధి విషయంలో నాకు రేవంత్ రెడ్డి, కేసీఆర్ సర్టిఫికెట్ నాకు అవసరం లేదు. నేను ఏం చేశాను అనేది ప్రజలకు తెలుసు’ అంటూ వ్యాఖ్యలు చేశారు.
వారిద్దరూ బ్యాడ్ బ్రదర్స్..
కాంగ్రెస్, బీఆర్‌ఎస్ అవినీతి, కుటుంబ పార్టీలు. బీజేపీ కుటుంబ పార్టీ కాదు. చిన్న అవినీతి ఆరోపణలు లేకుండా కేంద్రంలో పని చేస్తున్నాం. గత అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో ఫేక్ వీడియోలు తయారు చేసి గెలిచిన కాంగ్రెస్, బీఆర్‌ఎస్. ఇప్పుడు జూబ్లీహిల్స్ సైతం అదే విధంగా గెలవాలని చూస్తున్నారు. కేసీఆర్ కుటుంబం నుంచి లక్ష కోట్లు కక్కిస్తామని ఊరూరా ప్రచారం చేశారు. లక్ష రూపాయలైన కక్కించరా?. ఢిల్లీ స్థాయిలో బీఆర్‌ఎస్, కాంగ్రెస్‌కు ఒప్పందం కుదిరింది నిజం కాదా?.
బీఆర్‌ఎస్ నేతలపై అవినీతి ఆరోపణలు చేశారు. మరి కనీసం ఒక్కరి మీద అయిన కేసులు ఎందుకు పెట్టలేదు?. ఖర్చు లేనిది కాబట్టి ఆరోపణలు చేస్తే చూస్తూ ఊరుకోం. హైదరాబాద్‌కు కేంద్రం చేసిన అభివృద్ధిపై వివరాలు ఇచ్చాను. మీరు టైమ్ ఇస్తే హైదరాబాద్ అభివృద్ధిపై చర్చకు సిద్ధం. రాహుల్-కేసీఆర్ బ్రదర్స్. కేసీఆర్‌ను కాపాడుతోంది రాహుల్ గాంధీ కాదా?. కాకుంటే కేసీఆర్ మీద ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు?. రేవంత్ ది ఫేక్, ఫ్రాడ్, ఫాల్స్ ఫెయిల్యూర్ గవర్నమెంట్. రేవంత్ తెలంగాణకు పట్టిన శాపం. తెర వెనుక రాజకీయాలు చేయడంలో రేవంత్ దిట్ట అని ఘాటు విమర్శలు చేశారు.
ఇది కూడా చదవండి: కిషన్ రెడ్డి, కేటీఆర్ బ్యాడ్ బ్రదర్స్: రేవంత్ రెడ్డి


