శుక్రవారం మీడియాతో మాట్లాడుతున్న సీఎం రేవంత్‌రెడ్డి. చిత్రంలో మంత్రులు అడ్లూరి, పొన్నం, అజహరుద్దీన్
హైదరాబాద్ అభివృద్ధిని అడ్డుకుంటోంది ఆ ఇద్దరే: సీఎం రేవంత్
బీఆర్‌ఎస్ హయాంలో చేసిన ఒక్క అభివృద్ధి పని చూపండి?
వారు కట్టిన సచివాలయం, కమాండ్ కంట్రోల్ సెంటర్, ప్రగతిభవన్‌లతో ఒక్కరికైనా ఉద్యోగం వచి్చందా?
హైదరాబాద్‌కు డ్రగ్స్ వచ్చేలా చేసిందే కేటీఆర్..
వారి బాగోతాలు బయటపడతాయనే హైడ్రా, ఈగల్‌ను అడ్డుకుంటున్నారు
కాళేశ్వరంపై సీబీఐ ఎఫ్‌ఐఆర్ కూడా ఎందుకు నమోదు చేయడం లేదు?
జూబ్లీహిల్స్‌లో ఒక్క ఓటు ఇవ్వండి.. నగరాన్ని అభివృద్ధి చేసి చూపిస్తా
జూబ్లీహిల్స్ ఓటర్లకు సీఎం పిలుపు
సాక్షి, హైదరాబాద్: ‘జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ గెలవడానికి ఒక్క ఓటు ఇవ్వండి.. హైదరాబాద్‌ను ఎలా అభివృద్ధి చేస్తానో చేసి చూపిస్తా.. నగర అభివృద్ధిని బ్యాడ్ బ్రదర్స్ (కేటీఆర్, కిషన్‌రెడ్డి) అడుగడుగునా అడ్డుకుంటున్నారు. 2004–14 మధ్య కాంగ్రెస్ ప్రభుత్వంలో, 2014–2023 మధ్య బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధిని జూబ్లీహిల్స్ ప్రజలు బేరీజు వేసుకుని ఓటు వేయండి’అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ఓఆర్‌ఆర్, విమానాశ్రయం, నగరానికి కృష్ణా–గోదావరి తాగునీరు, నాలెడ్జి సెంటర్, ఐటీ, ఫార్మా.. ఇలా అన్నీ కాంగ్రెస్ పాలనలోనే వచ్చాయని తెలిపారు.
గత రెండేళ్ల తమ పాలనలో 70 వేల మందికి ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చామని, రూ.3 లక్షల కోట్ల పెట్టుబడులు సాధించామని చెప్పారు. మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్, అజహరుద్దీన్, ఎంపీ అనిల్‌కుమార్ యాదవ్‌తో కలిసి సీఎం శుక్రవారం మీడియాతో మాట్లాడారు. ప్రతిపక్ష నాయకుల ఇళ్లముందు సీసీటీవీలు పెట్టి చూడడానికి, ఫోన్‌ట్యాపింగ్ కోసం బీఆర్‌ఎస్ హయాంలో కమాండ్ కంట్రోల్ సెంటర్ నిర్మించారని సీఎం రేవంత్‌రెడ్డి విమర్శించారు.
బీఆర్‌ఎస్ పాలనలో ప్రజలుకు ఏం ఒరిగింది?
బీఆర్‌ఎస్ పదేళ్ల పాలనలో ప్రజలకు ఒరిగిందేమీ లేదని సీఎం విమర్శించారు. ‘కుమారుడు సీఎం కావటం కోసం వాస్తు బాగాలేదని సచివాలయాన్ని కూల్చారు. విలాసవంతమైన జీవితం కోసం బుల్లెట్ ప్రూఫ్ అద్దాలతో బాత్‌రూమ్ కట్టించుకున్నారు. రూ.లక్ష కోట్లతో నిర్మించిన కాళేశ్వరం కూలిపోయింది. ఒక్క ఎకరాకూ నీళ్లు ఇవ్వలేదు. ఈ నాలుగింటితో ప్రజలకు ఏమైనా ఒరిగిందా? లక్షల మందికి ఐటీ కొలువులు రావడానికి ఐటీఐఆర్‌ను మన్మోహన్ సర్కారు ఇస్తే.. దానిని రద్దు చేసింది మోదీ, కేసీఆర్.
వాళ్ల పదేళ్ల పాలనలో మెట్రో విస్తరణకు ఎందుకు ప్రయత్నించలేదు? ఎల్‌అండ్‌టీ కంపెనీని కమీషన్ల కోసం బ్లాక్ మెయిల్ చేసిందే కేసీఆర్, కేటీఆర్. హైదరాబాద్‌ను గంజాయి, డ్రగ్స్‌కు అడ్డాగా మార్చిందే కేటీఆర్. ఆయన బావమరిది ఇచి్చన పార్టీలో కొకైన్ సేవించి దొరికిన విషయం నిజం కాదా? పాఠశాలల వద్ద గంజాయి చాక్లెట్లు విచ్చలవిడిగా దొరికేలా చేసిందే కేటీఆర్. చెరువులను, ప్రభుత్వ స్థలాలను హైడ్రా కాపాడుతుంటే.. తమ ఆక్రమణలు ఎక్కడ బయటపడతాయోనన్న భయంతో అసలు దానిని లేకుండా చేయడానికి యత్నిస్తున్నారు. ‘ఈగల్’డ్రగ్స్ దందాపై ఉక్కుపాదం మోపుతుంటే దానిని కూడా అడ్డుకుంటున్నారు.
రూ.16 వేల కోట్ల మిగులు, రూ.69 వేల కోట్ల అప్పుతో కేసీఆర్‌కు రాష్ట్రాన్ని అప్పగిస్తే.. 10 ఏళ్లలో ఆయన రూ.8.11 లక్షల కోట్ల అప్పుచేసి మాకు అప్పగించారు. కేసీఆర్ హయాంలో రూ.20 లక్షల కోట్ల బడ్జెట్‌ను దేని కోసం ఖర్చు చేశారో చెప్పాలి. హైదరాబాద్ నగర ప్రజల కోసం పరితపించిన పీ జనార్ధన్‌రెడ్డి, శశిధర్‌రెడ్డిని హైదరాబాద్ బ్రదర్స్ అనేవారు. ఇప్పుడు హైదరాబాద్ అభివృద్ధిని అడ్డుకుంటున్న కేటీఆర్, కిషన్‌రెడ్డిని బ్యాడ్ బ్రదర్స్ అంటున్నారు. ఫార్ములా ఈ కార్ రేసులో కేటీఆర్‌పై చార్జిïÙట్ వేయడానికి, అరెస్టు చేయడానికి గవర్నర్ అనుమతినివ్వడం లేదు. కాళేశ్వరంపై సీబీఐ ఇప్పటివరకు కనీసం ఎఫ్‌ఐఆర్ ఎందుకు నమోదు చేయలేదు? కాళేశ్వరం మొత్తంపై విచారణ చేయమనండి.. ఎవరు వద్దన్నారు?’అని సీఎం ప్రశ్నించారు.
ఓఆర్‌ఆర్‌ను పల్లీ, బఠానీళ్లా అమ్మేశారు..
ఔటర్ రింగ్ రోడ్డును పల్లీ, బఠానీల మాదిరిగా రూ.7.5 వేల కోట్లకు అమ్మేశారని సీఎం రేవంత్‌రెడ్డి ఆరోపించారు. ‘మెట్రో విస్తరణ, గోదావరి జలాల తరలింపు, ఎలివేటెడ్ కారిడార్లు, ఫ్యూచర్ సిటీ, ఆర్‌ఆర్‌ఆర్ రాకుండా అడ్డుపడుతున్నారు. మేము వరంగల్, ఆదిలాబాద్‌కు ఎయిర్‌పోర్టులు మంజూరు చేయించాం. బేగంపేట ఎయిర్‌పోర్టు కింద నుంచి అండర్‌పాస్ నిర్మించనున్నాం. కొత్తగూడెం విమానాశ్రయం కోసం ప్రయతి్నస్తున్నాం. 2034 వరకు మాకు అవకాశమిస్తే.. 2047 నాటికి రాష్ట్రాన్ని దేశంలో మొదటి స్థానంలో నిలిపేలా ప్రణాళిక వేస్తున్నాం. డ్రైపోర్టు, గ్రీన్‌ఫీల్డ్ హైవే, శ్రీశైలం ఎలివేటెడ్ కారిడార్‌కు అనుమతులు తెచ్చాం.
బీఆర్‌ఎస్ పాలనలో తెచ్చిన నిరుద్యోగులకు ఉపాధి కల్పించే ఒక్క ప్రాజెక్టునైనా చూపండి? నగరాభివృద్ధిపై బ్యాడ్ బ్రదర్స్‌తో చర్చించడానికి నేను ఎక్కడైనా సిద్ధమే. మూసీ ప్రాజెక్టుకు ఎందుకు అడ్డుపడుతున్నారు? కిషన్‌రెడ్డి ఎందుకు కేటీఆర్‌కు లొంగిపోయారు? 645 చెరువులకుగాను 44 చెరువుల్లో బీఆర్‌ఎస్ నేతలు ఆక్రమణలకు పాల్పడి నిర్మాణాలు కట్టి అమ్మేశారు. 127 చెరువులను పాక్షికంగా ఆక్రమించారు. హైడ్రాతో ఎక్కడైనా పేదలకు అన్యాయం జరిగితే ఆదుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. నగరంలో భారీ వర్షాలు పడినా ఈసారి ఎక్కడా ముంపు సమస్య రాకుండా చేశాం. భారీగా సంపాదించుకుని చెల్లెలు ఎక్కడ వాటా అడుగుతుందోనని బయటకు పంపించిన వ్యక్తి కేటీఆర్’అని సీఎం విమర్శించారు.
ప్రతి ఎన్నిక ప్రతిష్టాత్మకమే..
సాధారణ ఎన్నికైనా.. ఉప ఎన్నికైనా తమకు ప్రతీది ప్రతిష్ఠాత్మకమేనని సీఎం అన్నారు. ‘ప్రతి ఎన్నికల్లోనూ నా ఎన్నిక మాదిరేగానే పోరాడుతా.. ఏ ఎన్నికైనా నా ప్రభుత్వ పనితీరుకు నిదర్శనంగానే చూస్తా. హుజూరాబాద్, నాగార్జునసాగర్, మునుగోడు.. ఎన్నిక ఏదైనా సరే.. దానికి బాధ్యత వహిస్తా. నవీన్ యాదవ్‌ను రౌడీ అంటున్నారు. ఎవరు రౌడీ? దీపావళి పండుగ రోజు గంజాయి కొట్టేవాడు రౌడీ అవుతాడా.. పేదోళ్లకు అండగా నిలబడేవాడు రౌడీ అవుతాడా? అజహరుద్దీన్‌కు మంత్రి పదవి ఇస్తే మీ ఏడుపు ఏంది? నేను సచివాలయానికి రావట్లేదని హరీశ్‌రావు మాట్లాడుతున్నారు.
సచివాలయంలో చేయాల్సినవి అక్కడ చేస్తున్నాం. కమాండ్ కంట్రోల్ సెంటర్ మా తాతదా? క్యాంపు ఆఫీస్ లా ఉపయోగిస్తున్నా. రోజుకు 18 గంటలు పనిచేస్తున్నా’అని సీఎం తెలిపారు. బీఆర్‌ఎస్‌ను ఓడించి, బీజేపీకి డిపాజిట్ రాకుండా చేయాలని జూబ్లీహిల్స్ ఓటర్లకు పిలుపునిచ్చారు. 75 శాతం మంది హిందువులు బీజేపీకి ఓటు వేయాలని బండి సంజయ్ అంటున్నారని, వారికి డిపాజిట్ దక్కపోతే హిందువులంతా బీజేపీకి వ్యతిరేకమని ఆయన అంగీకరిస్తారా? అని ప్రశ్నించారు. 8 ఎంపీ సీట్లలో గెలిపించినందుకు జూబ్లీహిల్స్‌లో బీఆర్‌ఎస్‌ను గెలిపించడానికి కిషన్‌రెడ్డి ప్రయతి్నస్తున్నారని ఆరోపించారు.
బీఆర్‌ఎస్‌ను కబళించడానికి హరీశ్‌రావు ఒక్క అడుగు దూరంలో ఉన్నారని సీఎం అన్నారు. మాగంటి గోపీనాథ్ మరణంపై బండి సంజయ్ పోలీసులకు ఫిర్యాదు చేస్తే తప్పకుండా చట్టం తనపని తాను చేసుకు పోతుందని తెలిపారు. మసీదులకు వెళ్లినప్పుడు ముస్లిం సంప్రదాయాలను పాటించాలని, ప్రధాని మోదీ సైతం టోపీలు పెట్టుకున్నారని, చాలా మంది బీజేపీ నేతలు టోపీలు పెట్టుకున్నారని సీఎం చెప్పారు.


