సీఎం స్థాయిలో ఉండి ఇంత దిగజారుడు వ్యాఖ్యలా?: మార్గాని భరత్‌ | Margani Bharat Fires On Chandrababu Dramas | Sakshi
Sakshi News home page

సీఎం స్థాయిలో ఉండి ఇంత దిగజారుడు వ్యాఖ్యలా?: మార్గాని భరత్‌

May 31 2025 7:55 PM | Updated on May 31 2025 8:34 PM

Margani Bharat Fires On Chandrababu Dramas

సాక్షి, తూర్పుగోదావరి: ఎన్నికల్లో గెలుపు కోసం అడ్డగోలు హామీలిచ్చి, ఏడాది గడుస్తున్నా ఏ ఒక్కటీ అమలు చేయకుండా, ఎప్పటికప్పుడు డైవర్షన్‌ పాలిటిక్స్‌తో నెట్టుకొస్తున్న సీఎం చంద్రబాబు, పెన్షన్‌ పంపిణీ పేరుతో డ్రామా చేస్తున్నారని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ ఎంపీ మార్గాని భరత్‌ ఆక్షేపించారు. శనివారం ఆయన రాజమహేంద్రవరంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఏ ఒక్క మాటకు కట్టుబడక, చెప్పుకోవడానికి ఏమీ లేక.. వేదిక ఏదైనా జగన్‌ను నిందించడమే పనిగా చంద్రబాబు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. మార్గాని భరత్‌ ఇంకా ఏమన్నారంటే..

మహానాడు మొత్తం ఆత్మస్తుతి, పరనిందలే:
మహానాడు పేరుతో ప్రతి సంవత్సరం ఎన్టీఆర్‌ ఆత్మని క్షోభకు గురిచేస్తున్నారు. చంద్రబాబుని ఎన్టీఆర్‌ ఔరంగజేబు, రావణాసురుడుతో పోల్చితే ఏఐ టెక్నాలజీ వాడుకుని పొగిడించుకోవడం సిగ్గుచేటు. వారి దిగజారుడుతనానికి నిదర్శనం. నందమూరి కుటుంబ సభ్యులెవర్నీ మహానాడుకి పిలవకుండా ఎన్టీఆర్‌ పేరును వాడుకుంటున్నారు. ప్రజలు ఇదంతా తెలియని అమాయకులని తండ్రీకొడుకులు భావిస్తే అంతకన్నా అవివేకం ఉండదు.

మూడు రోజుల మహానాడు మొత్తం ఆత్మస్తుతి, పరనింద తప్ప, ప్రజలకు ఏడాదిలో ఏం చేశామో చెప్పుకోలేని దుస్థితిలో తెలుగుదేశం పార్టీ ఉంది. ఏడాది గడిచినా సూపర్‌ సిక్స్‌లో ఒక్క హామీని కూడా నెరవేర్చింది లేకపోయినా 30 ఏళ్లు మనమే ఉంటామని చెప్పడం చూసి ప్రజలు నవ్వుకుంటున్నారు. టీడీపీ నాయకులకు ప్రజల గడప వద్దకు వెళ్లే ధైర్యం కూడా లేదు. మహానాడుకి జనం కరువైపోతే డ్వాక్రా మహిళలు రాకపోతే పథకాలు కట్‌ చేస్తామని బెదిరించారు.

ఆ నిర్ణయాన్ని సమర్థించుకోలేక..:
ప్రతినెలా రూ.4 వేల పింఛన్‌ పంపిణీ కార్యక్రమం పేరుతో చంద్రబాబు లక్షలకు లక్షలు ఖర్చు చేస్తున్నాడు. వేదిక మీదకు నలుగురు పేదవారిని పిలిచి వారికి మైకులు పెట్టి డ్రామా నడుపుతున్నాడు. ఏడాదిగా కనీసం ఒక్క కొత్త పింఛన్‌ కూడా పంపిణీ చేయకుండా ఇలాగే కాలక్షేపం చేశాడు. అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలో పింఛన్‌ పంపిణీ కార్యక్రమానికి హాజరైన సీఎం చంద్రబాబు, ఎండీయూ వాహనాలు నడుపుకునే పేద ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల మీద దారుణమైన ఆరోపణలు చేశాడు. నెలకు రూ.10 వేల వేతనం తీసుకునే రేషన్‌ వాహనాల డ్రైవర్లు లంచాలు ఇవ్వడానికి తన వద్దకే వచ్చినట్టు చంద్రబాబు దారుణమైన అభాండాలు వేయడం సిగ్గుచేటు. సీఎం స్థానంలో ఉన్న వ్యక్తి దిగజారి ఆరోపణలు చేయడం బాధాకరం.

పేదలపై చంద్రబాబు వ్యాఖ్యలు దారుణం:
వేల కోట్ల విలువైన బియ్యం కాకినాడ పోర్టుకి వెళ్తున్నాయని సీఎం చంద్రబాబు ఆరోపిస్తున్నారు. సీఎంగా ఉన్న వ్యక్తి చేయాల్సిన ఆరోపణలు ఇవేనా? బియ్యం అక్రమంగా తరలిపోతుంటే చంద్రబాబు ఏం చేస్తున్నట్టు? అధికారంలోకి వచ్చి ఏడాదవుతున్నా అలాంటి అక్రమార్కులను ఎందుకు పట్టుకోలేకపోయారు? రేషన్‌ వాహనాలు ఎత్తేయాలని తీసుకున్న దిక్కుమాలిన నిర్ణయాన్ని సమర్థించుకోలేక అమాయకుల మీద దారుణమైన ఆరోపణలు చేస్తున్నాడు. వెనుకబడిన వర్గాల వారిని, నిరుపేదలను కొవ్వెక్కిపోయారని మాట్లాడటం దారుణమైన విషయం.

అది అహంకార నిర్ణయం:
వెనుకబడిన వర్గాల మీద ఇంత చులకనభావం పనికిరాదు. 18 నెలల కాలపరిమితి ఉన్నా ఎండీయూ ఆపరేటర్లను తొలగించారు. ప్రభుత్వం తీసుకున్న ఈ అహంకారపూరిత నిర్ణయంతో వారు తీసుకున్న వాహనాలకు నెలనెలా కిస్తీలు కట్టడానికి కూడా ఇబ్బంది పడుతున్నారు. ఎండీయూ ఆపరేటర్లను ఆర్థిక నేరస్తులని, టెర్రరిస్టులుగా చెప్పడం ఎంత దారుణం? చంద్రబాబు తన వ్యాఖ్యలను తక్షణం వెనక్కి తీసుకోవాలి. ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఎండీయూ ఆపరేటర్లు న్యాయస్ధానాన్ని ఆశ్రయించడం జరిగింది. ఎండీయూ ఆపరేటర్లకి వైయస్సార్సీపీ కూడా అండగా ఉంటుంది.

పింఛన్‌ డోర్‌ డెలివరీ ఇవ్వలేనివారు, రేషన్‌ ఇస్తారా?:
కూటమి ప్రభుత్వం వచ్చాక పింఛన్లే డోర్‌ డెలవరీ చేయలేకపోతున్నారు. అలాంటిది వికలాంగులు, వృద్ధులకు ఇంటికే రేషన్‌ సరుకులు తీసుకొచ్చి ఇస్తామంటే నమ్మడానికి  ప్రజలెవరూ సిద్ధంగా లేరు. ఒకపక్క కొత్తగా 6 వేల రేషన్‌ షాపులు మంజూరు చేస్తామని చెప్పుకుంటూ, చంద్రబాబు తన ప్రసంగంలో మాత్రం రేషన్‌కి బదులు డీబీటీ ద్వారా డబ్బులిస్తామని చెబుతున్నాడు. ఈ రేషన్‌ షాపులను ఒక్కోటి రూ.5 లక్షలకు వేలంపాట ద్వారా అమ్మడానికి ఇప్పటికే ఎమ్మెల్యేలు సిద్ధమైపోయారు. అదే జరిగితే ఈ ప్రభుత్వాన్ని వదిలే ప్రసక్తే లేదు. మరోవైపు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుంటే చంద్రబాబు ఓర్చుకోలేకపోతున్నారని మాజీ ఎంపీ మార్గాని భరత్‌ గుర్తు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement