
న్యూఢిల్లీ: పెహల్గాంలో ఉగ్రదాడి, ఆపై చోటు చేసుకున్న పరిస్థితులకు తాను కారణం కాదని, అది జమ్మూ-కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా వైఫల్యమేనని ఆ రాష్ట్ర సీఎం ఒమర్ అబ్దుల్లా తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. అసలు పెహల్గామ్ ఉగ్రదాడికి లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా కారణమన్నారు.
కాగా, జమ్ముకశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా సోమవారం ఉదయం గోడ దూకి మహారాజా హరిసింగ్‌కు చెందిన డోగ్రా బలగాలు కాల్చిచంపిన వీరుల స్మారకంగా ఉన్న శ్మశానం గోడ దూకి లోపలికి వెళ్లి అక్కడ అమరవీరుల స్థూపాలకు నివాళులు అర్పించారు,. డోగ్రా బలగాలకు వ్యతిరేకంగా పోరాటం చేసి 1931, జూలై 13వ తేదీన పలువురు అమరులయ్యారు. ఈ క్రమంలోనే వారికి కశ్మీర్‌లోని శ్మశాన వాటికలో స్మారక చిహ్నాలు ఏర్పాటు చేశారు.
దీన్ని ఆ రాష్ట్ర పోలీసులు అడ్డుకునే యత్నం చేశారు. ఆదివారం(జూలై 13) సీఎం అబ్దుల్లాను ఇంటి నుంచి కదలకుండా ఒక బంకర్ ఏర్పాటు చేశారు. అయితే అది సోమవారం తీసేశారు. నేడు(జూలై 14) ఒమర్ అబ్దుల్లా ఒంటరిగా కారులో వెళ్లి ఆ అమరులకు నివాళులు అర్పించే యత్నం చేశారు. అక్కడ అబ్దుల్లాను పోలీసులు అడ్డుకునే యత్నం చేయడంతో గోడ దూకి వెళ్లి నివాళులర్పించి వచ్చారు.
దీనిపై అబ్దుల్లా మాట్లాడుతూ.. రాష్ట్రంలో లెఫ్టినెంట్ గవర్నర్ పాలన నడుస్తోందంటూ మండిపడ్డారు. కేంద్ర నియమించిన లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా చెప్పినట్లే ఇక్కడ నడుస్తోందన్నారు. అనాలోచిత నిర్ణయాలతో ఆగం చేస్తున్నారని మండిపడ్డారు. జమ్మూ కశ్మీర్‌లో పెహల్గాం ఉగ్రదాదాడికి, తర్వాత ఆపరేషన్ సింధూర్ వరకూ భారత్ వెళ్లడానికి ఎల్జీ మనోజ్ సిన్హా వైఫల్యమే కారణమన్నారు. జమ్మూ కశ్మీర్ రాష్ట్ర హోదాను తిరిగి పునరుద్ధరించాలని ఆయన డిమాండ్ చేశారు.