మేం తెలంగాణ ప్రజల ఏ టీమ్‌ | KTR comments over congress and bjp | Sakshi
Sakshi News home page

మేం తెలంగాణ ప్రజల ఏ టీమ్‌

Oct 5 2023 2:18 AM | Updated on Oct 5 2023 2:18 AM

KTR comments over congress and bjp - Sakshi

  నిర్మల్‌/ సాక్షి, కామారెడ్డి: ‘మేం ఢిల్లీ బానిసలం కాదు. ఎవని అయ్యకు భయపడం. బీఆర్‌ఎస్‌ కాంగ్రెస్‌ బీ టీమ్‌ అని బీజేపీవోడు అంటాడు. బీజేపీ బీ టీమ్‌ అని కాంగ్రెసోడు అంటాడు. మేం ఎవరికీ బీ టీమ్‌ కాదు. మేము తెలంగాణ ప్రజల ఏ టీమ్‌. తెలంగాణ ప్రజలకు మాత్రమే జవాబుదారీ. తెలంగాణ గల్లీల్లో ఉండే ప్రజలు ఏమనుకుంటారో అదే మాకు ముఖ్యం. మీరు ఢిల్లీకి భయపడతరు. మేము ఢిల్లీకి సలాం కొట్టం.. గుజరాత్‌కు గులాంలయ్యే ఖర్మ మాకు పట్టలేదు. ఢిల్లీ నుంచి వచ్చి ఇచ్చిపోయే కితాబులు మాకు అవసరం లేదు.

ఢిల్లీ నుంచి గాలి మోటార్లో వచ్చిన ఒక పెద్దమనిషి గాలిమాటలు మాట్లాడి బయటపడ్డాడు. కాంగ్రెస్‌కు గతంలో ఎన్ని చాన్సులిచ్చినా ఏం చేయలేదు. చచ్చిన పీనుగు లెక్కున్న కాంగ్రెస్‌ దింపుడు కల్లం ఆశతో ఆరు హామీలను తీసుకువచ్చింది..’ అని రాష్ట్ర మంత్రి, బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీ రామారావు ధ్వజమెత్తారు. ‘ఈ పదేళ్లలో మేము ఏం చేశామో, మళ్లీ మాకే ఎందుకు ఓటేయాలో ఆలోచించాలని కోరుతున్నాం.

వాస్తవానికి కాంగ్రెస్, బీజేపీలే కొన్ని చోట్ల ఒక్కటవుతున్నాయి. కర్ణాటక నుంచి కాంగ్రెస్‌కు, అదానీ నుంచి బీజేపీకి రూ.కోట్లు అందుతు న్నాయి. ఓటుకు ఐదు వేలు అయినా ఇస్తారు. వాళ్లి చ్చే పైసలు తీసుకుని కారు గుర్తుకు ఓటెయ్యండి..’ అని విజ్ఞప్తి చేశారు. బుధవారం నిర్మల్, కామారెడ్డి జిల్లాల్లో మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, స్పీకర్‌ పోచారం తో కలిసి పలు అభివృద్ధి పనులను మంత్రి ప్రారంభించారు. అనంతరం నిర్మల్‌ జిల్లా కేంద్రంలో ప్రగతి నివేదన సభలో, బాన్సువాడలో నిర్వహించిన బహిరంగ సభలో కేటీఆర్‌ మాట్లాడారు. 

సముద్రంలా ఎస్సారెస్పీ
‘ఒకప్పుడు ఎస్సారెస్పీ ఎండిపోయి ఆగమైతుండేది. ఇప్పుడు కేసీఆర్‌ అపర భగీరథుడిలా రివర్స్‌ పంపింగ్‌ ద్వారా ఎస్సారెస్పీని నింపుతున్నారు. ప్రాజెక్టు బ్యాక్‌ వాటర్‌లో నుంచి ఇప్పుడు శ్రీలక్ష్మీనర్సింహస్వామి ఎత్తిపోతలు ద్వారా 50 వేల ఎకరాలకు నీరందిస్తున్నాం. పైన హెలికాప్టర్‌ నుంచి చూస్తుంటే ఎస్సారెస్పీ సముద్రంలాగా కనిపిస్తోంది’ అని మంత్రి అన్నారు.

కరెంటు తీగలు పట్టుకోండి తెలుస్తది..
‘2014కు ముందు తాగునీటి కోసం ఎన్నో ఇబ్బందులు ఉండేవి. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. కరెంటు  మాకు కనబడతలేదని కాంగ్రెస్, బీజేపీ నాయకులు అంటున్నారు. వారికి బస్సులు ఏర్పాటు చేస్తాం. ఏ ఊరికి వెళ్తారో వెళ్లండి. వరుసగా నిలబడి గట్టిగా కరెంట్‌ తీగలను పట్టుకోండి. కరెంట్‌ వస్తుందో లేదో అప్పుడు తెలిసిపోతది..’ అంటూ కేటీఆర్‌ ధ్వజమెత్తారు. కాగా దిలావర్‌పూర్‌ మండలం గుండంపల్లిలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌ వద్ద కేటీఆర్‌ గోబ్యాక్‌ అంటూ నినదించిన డీసీసీ అధ్యక్షుడు కూచాడి శ్రీహరిరావును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు తమ సమస్యలను పరిష్కరించాలంటూ వచ్చిన పలువురు ఆశా వర్కర్లతో కేటీఆర్‌ మాట్లాడారు.

బీజేపీ, కాంగ్రెస్‌ల మాటలు నమ్మొద్దు
‘బీజేపీ, కాంగ్రెస్‌లు ప్రజలను విడగొట్టి ఓట్లు దండుకోవాలని చూస్తున్నాయి. గత ఎన్నికల్లో జన్‌ధన్‌ ఖాతా ఖోలో.. ధన్‌ధన్‌ పంద్రాలాక్‌ లే లో అన్న మోదీ నల్లధనం ఏదంటే తెల్లమొఖం వేస్తున్నాడు. నిజామాబాద్‌కు వచ్చి ఏమేమో మాట్లాడాడు. పసుపు బోర్డు మోదీ దింపుడు కళ్లం ఆశ. గ్యాస్, పెట్రోల్‌ ధరలు పెంచిన నరేంద్రమోదీ ఎట్లా దేవుడైతడో బండి సంజయ్‌ చెప్పాలి. అరవై ఏళ్లు పాలించిన కాంగ్రెస్‌ రైతు లకు చేసిందేమీ లేదు. రేవంత్‌రెడ్డి అప్పుడు ఓటుకు కోట్లు కేసులో దొరికిన దొంగ అయితే, ఇప్పుడు సీటుకు నోట్లు అడుగుతున్నాడు. గత పదేళ్లలో చేసిన పనులు చూసి కేసీఆర్‌కు ముఖ్యమంత్రిగా మరో అవకాశం ఇవ్వాలని కోరుతున్నాం..’ అని కేటీఆర్‌ చెప్పారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement