బీసీ రిజర్వేషన్లు.. నులకమంచం కబుర్లతో బాబు కాలక్షేపం! | KSR Comments On Chandrababu And Yellow Media Cheap Politics | Sakshi
Sakshi News home page

బీసీ రిజర్వేషన్లు.. నులకమంచం కబుర్లతో బాబు కాలక్షేపం!

Oct 12 2026 11:41 AM | Updated on Oct 12 2026 12:10 PM

KSR Comments On Chandrababu And Yellow Media Cheap Politics

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పే  నులకమంచం కబుర్లు భలేగా ఉంటాయి. స్థానిక ఎన్నికలలో బీసీలకు అధికారికంగా 34 శాతం రిజర్వేషన్లు ఇస్తానంటూ గారడీలు చేసి, చివరికి ఆ వర్గాలను బురిడి కొట్టించారు. ఆ బురిడి వ్యవహారం సుప్రింకోర్టు తీర్పుతో బట్టబయలు అయింది. ప్రజలలో పరువు పోయిందని తెలిసినా ఆయన మాత్రం తన నులకమంచం కబుర్లు ఆపరు. అదే ఆయన విశిష్టత. చెప్పిన అబద్దాన్ని పదే,పదే చెబుతుంటారు. కొండపి వద్ద నర్సింగోలు అనే గ్రామంలో  జరిగిన సభలో బీసీల రిజర్వేషన్లు, తదితర అంశాల గురించి ప్రసంగం చేసి అన్నిటికి  వైఎస్సార్‌సీపీపైనే నిందలు మోపి , ఆ తర్వాత నులక మంచం మీద గ్రామస్తులు కొందరితో కలిసి కూర్చుని ముఖాముఖి జరిపి వెళ్లారు.

ఆ కార్యక్రమానికి సంబంధించిన కధనాలను ఎల్లో మీడియాలో చదివిన తర్వాత అర్ధం అయ్యేదేమిటంటే, ఏదో ఒక చిన్న  ప్రోగ్రాం పెట్టుకుని సుదీర్ఘ ఉపన్యాసం ఇచ్చి, ఆ తర్వాత నులకమంచం కబుర్లు చెప్పడం అలవాటు చేసుకున్నారనిపిస్తుంది. చెట్టు కింద,అరుగు మీద, నులక మంచంపైన కూర్చుని  గ్రామీణులు కబుర్లు చెప్పుకుంటారు. వాటిలో ఎక్కువగా కాలక్షేపం కబుర్లే ఉంటాయి. చంద్రబాబు ఈ పర్యటనలో చేసిన  ప్రసంగం కూడా అదే మాదిరి అనిపిస్తుంది. స్థానిక ఎన్నికల ప్రచారం కోసం ప్రజాధనాన్ని లక్షల కొద్ది వెచ్చిస్తూ తిరగడం ఒక ఎత్తు అయితే,  ఆయా చోట్లకు వెళ్లి అసత్యాలు చెబుతూ ప్రజలను నమ్మించాలని అనుకోవడం మరో ఎత్తుగా ఉంటుంది. 

బీసీ రిజర్వేషన్ లపై  ఒక జివో ఇచ్చేసి  అంతా అయిపోయిందని నమ్మించాలని చూశారు. ఆ వెంటనే తన పార్టీ వందిమాగధులు ఆయన చిత్రపటాలకు   క్షీరాభిషేకాలు చేసేశారు.ఆహో,ఓహో అంటూ భజన చేసేవారికి తక్కువేమీ ఉండదు కదా!ఎల్లో మీడియా శభాష్ ..శెభాష్ అంటూ జాకీలు పెట్టి లేపడం కొత్తేమీ కాదు.  కాని టీడీపీ ఎమ్మెల్యేలకు తెలుసు..ముఖ్యమంత్రి,మంత్రులందరికి తెలుసు..చివరికి ఎల్లో మీడియాకు కూడా తెలుసు..ఆ జిఓ చెల్లదని, ఏభై శాతం మించి రిజర్వేషన్లు ఉండరాదని సుప్రింకోర్టు తీర్పులు  ఉన్నాయని,   తాము ప్రజలను మోసం చేస్తున్నామని వారికి తెలుసు. అయినా ఏ మాత్రం సిగ్గుపడకుండా ఆ పనికానిచ్చేయడమే తెలుగుదేశం గొప్పదనం గా మారింది.

ఇదీ చదవండి: రిషికొండే గుదిబండా?.. అమరావతి సంగతేంటి!

ఎవరైనా ఈ రిజర్వేషన్లు చెల్లవని హైకోర్టుకు వెళతారని కూడా తెలుసు.అందుకే  వైఎస్సార్‌సీపీ వారు కోర్టుకు వెళ్లి అడ్డుకుంటారని ప్రచారం చేశారు. ఎవరో ఒక లాయర్ ఈ జిఓపై హైకోర్టుకు వెళ్లడం , దానిని కొట్టివేయడం జరిగింది. అంతటితో అయినా ఈ డ్రామా ఆపారా అంటే అదీ చేయలేదు. సుప్రింకోర్టు కు అప్పీల్ కు వెళ్లారు.తాము ఇచ్చిన తీర్పు ప్రకారమే  కదా హైకోర్టు నిర్ణయం   వెల్లడించింది.. మళ్లీ అప్పీల్ ఏమిటని రెండు నిమిషాలు కూడా తీసుకోకుండా ఏపీ ప్రభుత్వ పిటిషన్ ను సుప్రింకోర్టు తోసిపుచ్చింది. సుప్రిం తీర్పు తర్వాత కొత్త అంకానికి చంద్రబాబు ప్రభుత్వం తెరతీసినట్లనిపిస్తుంది. పాత ఓటర్ల జాబితా ప్రకారమే ఎన్నికలు జరపాలని తలపెట్టినట్లు వార్తలు వస్తున్నాయి. అక్టోబర్ 16 న కొత్త ఓటర్ల జాబితా రావల్సి ఉందట .కాని దానికి ఒకటి,రెండు రోజుల ముందే నోటిఫికేషన్ ఇస్తారని ఎల్లో మీడియా తెలిపింది.. తద్వారా పాత ఓటర్ల జాబితా ప్రకారమే ఎన్నికలు జరుపుతారట. 

ఈ రకంగా దేశంలో ప్రస్తుతం జరుగుతున్న ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ  వ్యతిరేక ఉద్యమానికి టీడీపీ,  జనసేన, బీజేపీ కూటమి మద్దతు ఇస్తున్నాయా అన్న అనుమానం వస్తుంది. ఎందుకంటే సర్ లో అక్రమాలు జరగలేదని అనుకున్నా, లేదా గత ఎన్నికలలో ఏభై లక్షల ఓట్ల స్కామ్ జరగలేదని చెప్పాలనుకున్నా ,కొత్త ఓటర్ల జాబితా ప్రకారం అక్టోబర్ 16 తర్వాత ఎన్నికల నోటిఫికేషన్ ఇవ్వాలి కదా!అలా చేయడం లేదంటే ఏమనుకోవాలి!కేంద్రంలో అధికారంలో  ఉన్న బీజేపీ ఏపీలో మాత్రం ఈ పరిస్థితిని ఎలా సమర్ధిస్తుంది?సుప్రింకోర్టులో వేరొక బెంచ్ దీనికి సంబంధించిన కేసులో బట్టిప్రోలు పంచాయతీ చేసినట్లు అనిపిస్తుంది. కొత్త జాబితా వచ్చేలోగా ఎన్నికల నోటిఫికేషన్ విడుదల అయితే పాత జాబితా ప్రకారమే పోలింగ్ జరపవచ్చని, లేకుంటే కొత్త జాబితాను అనుసరించాలని తీర్పు ఇచ్చింది.

నిజానికి వారం రోజుల్లో కొత్త ఓటర్ల జాబితా వస్తున్నప్పుడు ఇంతలో పోయేదేముందని కోర్టువారు అడిగి ఉంటే సహేతుకంగా ఉండేదనిపిస్తుంది. ఈ మొత్తం ప్రక్రియలో చేసిందంతా చేసి,ఇప్పుడు నెపం అంతా  వైఎస్సార్‌సీపీపైన నెట్టేసి రాజకీయ ప్రయోజనం పొందాలన్న చంద్రబాబు కుయుక్తులు   చూస్తుంటే ఈ ఎన్నికలలో భారీగా ప్రజా వ్యతిరేకత వ్యక్తం అవుతుందేమో అన్న భయం కనిపిస్తుంది.అక్కడికి అదికారుల ద్వారా  వైఎస్సార్‌సీపీ పోటీదారులకు అవసరమైన కుల,ఆదాయ,నివాస,న్యూ డ్యూ తదితర అవసరమైన సర్టిఫికెట్లు సకాలంలో ఇవ్వనివ్వకుండా అడ్డుకుంటున్నారట. తమ వీర విధేయులైన పోలీసు అధికారులను ప్రయోగించి గట్టి పోటీ ఇచ్చే ప్రత్యర్ధులను భయపెట్టే పని ఎటూ చేస్తారు. పులివెందుల జడ్పిటిసి ఉప ఎన్నికలో పోలీసు అదికారులతో ఎంత దారుణమైన అక్రమాలు చేయించారో అంతా గమనించారు.అయినా చంద్రబాబు ప్రస్తుతం  భయపడుతున్నారంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అన్న భావన కలుగుతుంది. 

బీసీలకు పార్టీపరంగా స్థానిక సంస్థలలో  34 శాతం మించి సీట్లు ఇస్తామని చంద్రబాబు,లోకేష్ లు ఇప్పుడు చెబుతున్నారు.గతంలో జగన్ పార్టీపరంగా సీట్లను, వివిధ పదవులను  39 నుంచి అరవై శాతం వరకు బీసీలకు ఇచ్చారు.జనరల్ సీట్లలో కూడా బీసీలకు పదవులు ఇచ్చారు. ఒక వైపు జనసేన, మరో వైపు బీజేపీ నుంచి వచ్చే ఒత్తిడిని తట్టుకుని ఆ స్థాయిలో బీసీలకు టిక్కెట్లు ఇవ్వడం టీడీపీకి కష్టం అవుతుంది. అందుకే  వైఎస్సార్‌సీపీపై వీలైనంత బురద చల్లడానికి చంద్రబాబు యత్నిస్తున్నారు .గతంలో తాము బీసీ రిజర్వేషన్లు 34 శాతం చేశామని, దానిని  వైఎస్సార్‌సీపీ 24 శాతం చేసిందని ఒక పచ్చి అబద్దాన్ని జనానికి చంద్రబాబు చెప్పే యత్నం చేశారు.జగన్ 34 శాతం రిజర్వేషన్లు ఇస్తే, బిర్రు ప్రతాపరెడ్డి అనే టీడీపీ నేతతో హైకోర్టులో పిటిషన్ వేయించింది టీడీపీనే అన్న సంగతి జనానికి తెలియదని ఆయన నమ్మకం. 

ఇప్పుడు ఆయనేదో రిజర్వేషన్లు పెంచితే  వైఎస్సార్‌సీపీ కోర్టుకు వెళ్లి అడ్డుపడిందని అసత్యాన్ని వల్లె వేశారు.అంతే తప్ప,రాజ్యాంగం ప్రకారం 50శాతం మించి రిజర్వేషన్లు చెల్లవని, అందువల్ల 24 శాతానికి అటు,ఇటూగా  చేయవలసి వస్తోందని చెప్పే నిజాయితీ,ధైర్యం  చంద్రబాబులో కొరవడడం దురదృష్టకరం. స్థానిక ఎన్నికలంటే గొడ్డలి పార్టీకి వెన్నులో వణుకు పుడుతోందని, ఎన్నికలలో ఓటమి తర్వాత ఆ పార్టీ కార్యకర్తలు బయటకు రారని భయపడుతున్నారని చంద్రబాబు అంటున్నారు. అందరికన్నా ముందుగా జగన్ ప్రతిచోట పోటీ పెట్టాలని తన పార్టీ క్యాడర్ కు పిలుపు ఇస్తే ఆయన భయపడ్డట్లా?లేక బీసీలను  మాయమాటలతో మభ్య పెట్టి వెన్నుపోటు పార్టీగా ఎప్పటికప్పుడు రుజువు చేసుకుంటున్న టీడీపీ భయపడుతున్నట్లా అని  వైఎస్సార్‌సీపీ ప్రశ్నిస్తోంది. సర్‌ను ఒకవైపు వ్యతిరేకిస్తూ , మరో  వైపు అది పూర్తి అయ్యాక ఎన్నికలు పెట్టాలని కోర్టుకు వెళ్లడం రెండు నాలుకల ధోరణి అని చంద్రబాబు అంటున్నారు. సర్‌లో జరిగిన అక్రమాలను ఎప్పటికప్పుడు  వైఎస్సార్‌సీపీ ఎండగట్టింది. 

ఫిర్యాదులు చేసింది.కాని సర్ పూర్తి అవుతున్న తరుణంలో ఎందుకు పాత ఓటర్ల జాబితాతో స్థానిక ఎన్నికలు జరపాలని చంద్రబాబు తహతహలాడుతున్నట్లో చెప్పాలి కదా!అది డబుల్ గేమ్ కాదా!అంటే 2024 ఎన్నికలలో ఏభై లక్షల దొంగ ఓట్లను గప్ చిప్ గా కూటమికి అనుకూలంగా వేయించుకున్నారన్న ఆరోపణలను అంగీకరిస్తున్నట్లే అవుతుంది కదా!మూడుపార్టీల కూటమి లేనిదే గెలవలేనన్న  భయం చంద్రబాబుది  .తాను సింగిల్ గా పోటీకి రెడీ అంటూ ఇప్పటికే అభ్యర్ధుల ప్రకటనను ఆరంబించిన ధైర్యం జగన్ ది.ఈ రెండిటిని దేనితో పోల్చాలి.అందుకే చంద్రబాబువి నులక మంచం కబుర్లుగా కనిపిస్తాయని ఎవరైనా అంటే ఆశ్చర్యం ఏముంటుంది!

- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్‌ జర్నలిస్ట్‌, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement