ఏపీలో ఆ పండగేదో వీళ్లకు మాత్రమే! మరి జనాలకు..? | KSR Comment: No Pandaga For AP People Expect These Three | Sakshi
Sakshi News home page

ఏపీలో ఆ పండగేదో వీళ్లకు మాత్రమే! మరి జనాలకు..?

Jun 5 2025 12:51 PM | Updated on Jun 5 2025 3:29 PM

KSR Comment: No Pandaga For AP People Expect These Three

ఏడాదికాలంగా ఏపీ ప్రజలకు టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం వెన్నుపోటు పొడించిందని వైఎస్సార్‌సీపీ నిరసన కార్యక్రమాలు చేపడితే.. కూటమి నేతలు , ఎల్లో మీడియా మాత్రం రాష్ట్రంలో ప్రజలు పండగ చేసుకోవాలని అంటున్నారు. ఎవరు సత్యం చెబుతున్నారు? ఎవరు అసత్యం చెబుతున్నారు?. ఈ ఏడాదికాలంగా జరిగిన వివిధ పరిణామాలను పరిశీలిస్తే.. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ప్రజలను మోసం చేసింది వాస్తవం అని ఆధారసహితంగా కనిపిస్తోంది. అదే టైంలో ప్రజలకు పండగ కాదు కాని.. చంద్రబాబు, ఆయన కొడుకు లోకేష్, పవన్‌ కల్యాణ్‌లకు మాత్రం పండగే అని ఒప్పుకోవాలి. 

ఈ ముగ్గురితో పాటు టీడీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర కూటమి నేతల అక్రమ సంపాదనకు రహదారి వేసిందని కూడా అంగీకరించాలి. అందువల్ల వీరికి కూడా పండగే అని చెప్పుకోవాలి. ఏ మాటకు ఆ మాట.. ఎల్లోమీడియా  పంట కూడా బ్రహ్మాండంగా పండుతోంది. వారి సంపాదనకు తిరుగులేదు కనుక వారికే పండగే!.  కూటమి నేతలుకాని, ఎల్లో మీడియా ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటివి నిర్దిష్టంగా ఫలానా కారణాల వల్ల ప్రజలు పండగ జరుపుకుంటారని చెప్పలేకపోతున్నారు. అందుకే గత ప్రభుత్వంపైనే విమర్శలు చేస్తూ ప్రజలను మభ్యపెట్టే యత్నం చేస్తున్నారు. ముందుగా ఏ రకంగా ప్రజలకు చంద్రబాబు ప్రభుత్వం వెన్నుపోటు పొడించిందో విశ్లేషిద్దాం.

ఏపీలో తాము అధికారంలోకి వస్తే సూపర్ సిక్స్ తో పాటు భారీ ఎన్నికల ప్రణాళికను అమలు చేస్తామని చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్‌లు ప్రకటించారు. ఆ ప్రకారం తాము అమలు చేశామని వీరు ఎక్కడైనా చెప్పగలరా?. వృద్దాప్య పెన్షన్ వెయ్యి రూపాయలు పెంచిన మాట మాత్రం వాస్తవం. కానీ అదే సమయంలో లక్షల పెన్షన్‌లు  కోత పెట్టింది నిజమే కదా!. 

ఉచిత గ్యాస్ సిలిండర్లు ఏడాదికి మూడు ఇస్తామని చెప్పి ఒక్కటి మాత్రం ఇచ్చారు. అది కూడా అందరికి అందలేదన్నది నిజం. ఈ రెండూ తప్ప ఫలానా ఘన కార్యాలు సాధించామని కూటమి నేతలు కాని, ఎల్లో మీడియా కాని చెప్పలేకపోతోంది. అందుకే సోషల్ మీడియాలో కూటమి వాగ్దానాలపై వ్యంగ్య పాటలు, వ్యాఖ్యలు భారీగా కనిపిస్తున్నాయి.

సూపర్ సిక్స్ లో బాగంగా యువతకు నిరుద్యోగ భృతి కింద మూడువేల రూపాయల చొప్పున ఇస్తామని అన్నారు. ఇచ్చారా?లేదు. పైగా ఉన్న ఉద్యోగాలు ఊడపీకారు. జగన్ టైంలో ఏర్పర్చిన వలంటీర్ల వ్యవస్థను తాము కొనసాగిస్తామని.. పైగా పదివేల రూపాయల గౌరవ వేతనం ఇస్తామని చెప్పారా?లేదా?. అధికారంలోకి వచ్చాక.. ఏవో దొంగ కారణాలు చూపుతూ ఆ వ్యవస్థకు మంగళం పాడారా?లేదా?. దాంతో రెండున్నర లక్షల మందికి గౌరవ వేతనం రాకుండా పోయింది. ఇది యువతకు వెన్నుపోటు పొడిచినట్లే కదా!. 

జగన్ తీసుకు వచ్చిన సంక్షేమ కార్యక్రమాలు,వ్యవస్థలు అన్నిటిని కొనసాగిస్తామని చంద్రబాబు,పవన్ లు పదే,పదే ప్రకటించారు. కాని పవర్ వచ్చిన వెంటనే ప్రజలకు  ఇళ్లవద్దే అందే సేవలను దాదాపు రద్దు చేశారు. చివరికి రేషన్ బియ్యం తదితర సరుకులు అందించే వాహనాలను కూడా ఎత్తివేశారు. ఫలితంగా సుమారు ఇరవైవేల మంది వాహన నిర్వాహకులు, వారి కుటుంబాలు వీధినపడ్డాయి. రేషన్ కోసం ప్రజలు ముఖ్యంగా పేదలు కిలోమీటర్ల దూరం వెళ్లి రేషన్ షాపుల వద్ద  పడిగాపులు పడి ఉండాల్సి వస్తోంది. ఇది వెన్నుపోటు కాదా!. 

అమ్మ ఒడి కింద పదిహేనువేల రూపాయల చొప్పున  జగన్ ఇస్తుంటే.. చంద్రబాబు ఏమని అన్నారు. జగన్ ఒక్క విద్యార్దికే ఇస్తున్నారు..అది అన్యాయం.తాము వస్తే ప్రతి విద్యార్ధికి పదిహేనువేల చొప్పున ఇంటిలో ఎంత మంది ఉంటే అందరికి  ఇస్తామని అన్నారు. జనం అమాయకంగా నమ్మారు.  కాని అధికారం వచ్చి ఏడాది అయినా దాని అతీగతి లేదు. ఈ జూన్ లో ఇస్తామని ఇప్పుడు చెబుతున్నారు. కాని ఇప్పటికే ఒక ఏడాది ఎగవేశారు  కదా?ఇది వెన్నుపోటే కదా!. 

ప్రతి మహిళకు నెలకు రూ.1,500 చొప్పున డబ్బులు ఇస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. కాని ప్రస్తుతం ఆ ఊసే ఎత్తడం లేదు.ఇది వెన్నుపోటే కదా!అలాగే  మహిళలకు ఉచిత బస్, రైతులకు అన్నదాత సుఖీభవ కింద ఇరవైవేల రూపాయలు ఇస్తామని చెప్పారు. అదీ జరగలేదు. దీనిని వెన్నుపోటు కాదని అనగలరా?. విద్యార్ధులకు ఫీజ్ రీయింబర్స్ మెంట్ సకాలంలో చెల్లించి వారి సర్టిఫికెట్లకు ఇబ్బంది లేకుండా చేస్తామని ఇచ్చిన హామీ ఎంతవరకు అమలు చేశారు?. ఉచిత ఇసుక విధానం అని చెప్పి డబ్బులు వసూలు చేస్తున్నారా? లేదా?. ఇసుకను కూటమి నేతలకు ఆదాయవనరుగా మార్చడం ప్రజలకు వెన్నుపోటా ?కాదా?. 

పండగ కానుకలు వస్తాయని, బీసీలకు ఏభై ఏళ్లకే పెన్షన్ అని, పెళ్ళి కానుక కింద లక్ష రూపాయలు ఇస్తామని, ఇలా ఒకటేమిటి!  చేతికి ఎముక లేని చందంగా చంద్రబాబు పధకాలు అమలు చేస్తారేమోలే అని భావించిన ప్రజలకు అవేవి చేయకపోవడం వెన్నుపోటు అవ్వదా?. అసలే చంద్రబాబు నాయుడికి వెన్నుపోటులో సిద్దహస్తుడు అనే పేరు ఉంది. తన మామ ఎన్టీఆర్‌ను పదవీచ్యుతుడిని చేసినప్పటి నుంచి ఆయన ప్రత్యర్ధులు ఈ విషయాన్ని తరచూ చెబుతుంటారు. 2014-2024లలో ఆయనకు పవన్ కల్యాణ్‌ కూడా తోడయ్యారు. ఇద్దరు కలిసి హామీల విషయంలో చేసిన వెన్నుపోటు ఒక రకం అయితే.. ప్రభుత్వాన్ని నడపడంలో, వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు.. నేతలపై కేసులు పెడుతూ రెడ్ బుక్ అంటూ లోకేష్ ఆధ్వర్యంలో జరుగుతున్న అరాచకం మరో ఎత్తుగా ఉంది. 

జగన్ రూ. 14 లక్షల కోట్ల అప్పు చేశారని అంటూ పచ్చి అబద్దాలు చెబుతూ.. అయినా తాము అన్ని హామీలు అమలు చేస్తామని, సంపద సృష్టించడం తెలుసునని ప్రచారం చేసుకున్నారు చంద్రబాబు. తీరా ముఖ్యమంత్రి అయ్యాక సంపద ఎలా సృష్టించాలో చెవిలో  చెప్పండని ప్రజలనే అడగడం వెన్నుపోటే అవుతుంది కదా!. ఏకంగా ఏడాదిలో లక్షన్నర కోట్ల అప్పు చేసి రికార్డు సృష్టించడం ప్రజలను  మోసం చేసినట్లు కాదా?. తిరుమల లడ్డూలో జంతుకొవ్వు కలిసిందంటూ పచ్చి అబద్దాన్ని చెప్పడం ద్వారా దేవదేవుడిని కూడా  వెన్నుపోటు పొడవడానికి వెరవలేదే!. ఇలా ఒకటేమిటి?.. అమరావతి పేరుతో లక్ష ఎకరాలు సమీకరించి, లక్షల కోట్లు ఆ గ్రామాలలోనే  ఖర్చు  పెట్టడానికి తయారవుతున్న తీరు చూస్తే  ఇతర ప్రాంతాల ప్రజలను వెన్నుపోటు పొడవడానికి ఏ మాత్రం వెనుకాడడం లేదని అర్దం అవుతుంది కదా!. దీనికన్నా ప్రభుత్వానికి అవసరమైన పదివేల ఎకరాలో, అంతకు కాస్త ఎక్కువో  భూమిని మార్కెట్ రేటు  ప్రకారం కొనుగోలు చేసి ఉంటే లక్షల కోట్లు ఆదా అయ్యేవి కదా అనేదానికి సమాధానం దొరకదు. 

ఉర్సా వంటి ఊరుపేరులేని కంపెనీలకు విశాఖలో విలువైన భూములు కట్టబెట్టడం ఆ ప్రాంతానికి వెన్నుపోటు అవుతుందా? కాదా?. ఆర్థికంగా బలంగా ఉన్న టీసీఎస్‌ కంపెనీ తనకు లీజుకు భూమి ఇవ్వాలని అడిగితే 99 పైసలకే  భూమి అమ్మేస్తామని ఉదారంగా చెప్పడం ప్రజలకు వెన్నుపోటు కాదా!. ఇలా చెప్పుకుంటూ పోతే  చాలానే ఉన్నాయి. పోలీసులు కొందరు ఇష్టారాజ్యంగా పెడుతున్న కేసులు బహిరంగంగా చట్టంతో సంబంధం లేకుండా నిందితులను దారుణంగా హింసిస్తున్న వైనం ఇవన్ని వెన్నుపోటుకు బోనస్‌ అనే చెప్పాలి. ఈ నేపథ్యంలోనే జగన్ రాష్ట్రంలో  ఎక్కడకు వెళ్లినా ప్రజలు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. ఆయన ప్రభుత్వం తమకు చేసిన మేలును గుర్తు చేసుకుంటున్నారు. 

ఇక ఏ రకంగా కూటమి నేతలకు పండగ అని చూస్తే..  ప్రభుత్వం వచ్చీ రాగానే లక్షల టన్నుల ఇసుకను ఊదేసి కోట్ల రూపాయలు అక్రమంగా సంపాదించగలిగారు. అది ఏ స్థాయిలో ఉందంటే శ్రీకాకుళం జిల్లాలో ఒక టీడీపీ కార్యకర్తే జాయింట్ కలెక్టర్ వద్దకు వెళ్లి ఎమ్మెల్యే  కూన రవికుమార్ అనుచరుల దందాను అరికట్టాలని కోరుతున్నానని, అలా చేయడానికి లంచం ఇవ్వడానికి కూడా సిద్దమని చెప్పి ,లక్షన్నర రూపాయల ఇవ్వడానికి సిద్దపడ్డారు!. దీనిని ఏమని అనుకోవాలి?. ఈ పాలన ఎంత అధ్వాన్నంగా ఉందో తెలుస్తోంది. 

మద్యం మాఫియా ఎలా విజృభిస్తోందో, లిక్కర్ షాపులలో కూటమి ఎమ్మెల్యేలకు వాటాలు, ఊరూరా బెల్ట్ షాపులు నిర్వహిస్తున్న కూటమి కార్యకర్తలకు పండగే కావొచ్చు. చంద్రబాబు, లోకేష్, పవన్‌లు  తమ పదవులను ప్రజాసేవకు కాకుండా తమ  ప్రత్యేక విమానాలు,  హెలికాఫ్టర్ల దర్జాలకు వాడుకుంటున్నారన్న అభిప్రాయం ఉంది. అది వారికి పండగే కదా?. పిఠాపురంలో దళితుల బహిష్కరణ జరిగితే కనీసం పలకరించకుండా సనాతని వేషం కట్టి  ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న పవన్‌కు  పండగే  కదా?. పైళ్లను భారీగా పెండింగ్ లో పెట్టి, షూటింగ్ లలో కాలం గడుపుతున్న  ఆయనను ప్రశ్నించేదెవ్వరు. అందుకే ఆయనకు  ఇది పండగే. అమరావతి నిర్మాణాల వ్యయం రెట్టింపు చేసి కాంట్రాక్టర్‌లకు  పందెం చేస్తున్నందున వారికి పండగే. టీడీపీ కార్యకర్తల పెండింగ్  అక్రమ బిల్లుల పేరుతో వందల కోట్లను ఇస్తూ పండగ చేసుకోండని చెబుతున్నారు. చంద్రబాబు, పవన్‌ల కన్నా తానే పవర్ ఫుల్ అని రెడ్ బుక్ పాలన చేస్తున్న  లోకేష్ కి వీరిద్దరి కన్నా పెద్ద పండగగానే ఈ ఏడాది సాగిందని ఒప్పుకోవాలి. ఏతా వాతా చూస్తే ప్రజలకు వెన్నుపోటు, కూటమి నేతల అక్రమార్జనకు పండగే అని చెప్పొచ్చు. 

:::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్‌ జర్నలిస్ట్‌, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.

Advertisement
 
Advertisement
Advertisement