పవన్‌ను సైడ్‌ చేసి మరీ క్రెడిట్‌ చోరీ | KSR Comment: How Pawan Sided Jagan Targeted By TDP Over Bhogapuram | Sakshi
Sakshi News home page

పవన్‌ను సైడ్‌ చేసి మరీ క్రెడిట్‌ చోరీ

Jan 16 2026 11:04 AM | Updated on Jan 16 2026 12:23 PM

KSR Comment: How Pawan Sided Jagan Targeted By TDP Over Bhogapuram

ఒక భవనానికి ‘సిటీ’ అని పేరు పెడితే ఆ నగరమంతా పేరు పెట్టిన వ్యక్తి నిర్మించినట్లేనా? శంకుస్థాపన చేసి తరువాత దానిని పట్టించుకోకపోయినా, పూర్తి చేయకపోయినా క్రెడిట్ మాత్రం పొందగలుగుతారా? ఇతరుల విషయమేమో తెలియదు కానీ.. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తెలుగుదేశం పార్టీ   విషయంలో మాత్రం ఒప్పుకోవాలేమో. లేదంటే మీడియా బలంతో విరుచుకుపడుతుంటారు. 

భోగాపురం విమానాశ్రయం విషయంలో చంద్రబాబు ప్రభుత్వం చిక్కుముళ్లు వేసి దిగిపోతే జగన్ ఆ ముళ్లన్నీ విప్పి కార్యరూపం దాల్చేలా చేయగలిగారు. అప్పట్లో జగన్ చెప్పినట్లే 2026 కల్లా ఇది పూర్తి కావడం విశేషం. కాకపోతే చంద్రబాబు ప్రభుత్వానికి దానిని ప్రారంభించే అవకాశం వచ్చింది. అంత మాత్రాన జగన్‌ పాత్ర ఏమీ లేదన్న భావన కల్పించే ప్రయత్నం అభ్యంతరకరం. ఇందులో  మేజర్ క్రెడిట్ అంతా జగన్‌దే అనే అభిప్రాయం ఉంది. కరోనా రెండేళ్లు లేకుండా ఉంటే జగనే ప్రారంభించి ఉండేవారేమో!. 

హైటెక్‌ సిటీ విషయంలోనూ ఇంతే. దానికా పేరు, పరిసర ప్రాంతాలకు సైబరాబాద్‌ అన్న నామకరణం జరిగింది మొదలు.. అంతా బాబే చేశాడన్న ప్రచారం జరిగిపోయింది.. జరుగుతూనే ఉంది. రెండు దశాబ్దాల క్రితం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ సీఎంగా చంద్రబాబు ఉన్నారు. ఆ తరువాత చాలా అభివృద్ది జరిగింది. వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో జరిగినన్ని పనులు మరే ప్రభుత్వంలోను జరిగి ఉండకపోవచ్చు. ఔటర్‌ రింగ్ రోడ్డు, పీవీ నరసింహరావు ఎక్స్‌ప్రెస్ హైవే, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, హైదరాబాద్‌ నగరంలో రోడ్లు, పలు వంతెనల నిర్మాణం వైఎస్‌ హయాంలోనే జరిగాయి. ఆ  తర్వాత కేసీఆర్‌ సీఎంగా ఉండగా నగరంలో పలు ప్రాంతాల్లో ఫ్లైఓవర్లు, అండర్‌పాస్‌లు, నిర్మాణమైన సంగతి తెలిసిందే. ప్రస్తుత సీఎం కూడా ఫ్యూచర్ సిటీ పేరుతో అభివృద్ధి పనులు భారీ ఎత్తున చేపట్టారు. ఇది నిరంతర ప్రక్రియ. కానీ.. 

తెలుగుదేశం పార్టీ మాత్రం తనకు ముందర, తన తర్వాత జరిగిన అభివృద్దిని సైతం తమ కృషిగానే ప్రచారం చేసుకోగలదు. హైదరాబాద్‌లో నిజంగానే అంత అభివృద్ది జరిగి ఉంటే, విభజిత ఏపీలో కూడా ఎందుకు  అభివృద్ది జరగలేదన్న దానికి జవాబు ఇవ్వరు. గత వైసీపీ ప్రభుత్వం తీసుకువచ్చిన అనేక వ్యవస్థలను తామే తెచ్చామన్న భావన కల్పించేందుకు చంద్రబాబు ప్రభుత్వం వాటి పేర్లు మారుస్తోంది. 

జగన్ టైమ్‌లో విశాఖను కార్యనిర్వాహక రాజధానిగా ప్రకటించి దేశంలోనే ప్రముఖ నగరంగా అభివృద్ది చేయాలని తలపెడితే అడ్డు పడింది తెలుగుదేశం పార్టీనే కదా!. ఇదే జరిగి ఉంటే ఇప్పుడు అమరావతి కోసం మరీ లక్ష కోట్ల వ్యయం చేయాల్సిన అవసరం ఉండేది కాదు. పైగా నగరం వేగంగా అభివృద్ది చెందేది. తద్వారా కొత్త విమానాశ్రయానికి ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరిగేది. విశాఖలోని ప్రస్తుత విమానాశ్రయం రక్షణ శాఖది. దాన్ని పౌరసేవలకూ వాడుతున్నారు. ఎప్పటికైనా కొత్త ఎయిర్ పోర్టు ఏర్పాటు చేసుకోవలసిందే. ఈ క్రమంలో ఈ ప్రతిపాదన వచ్చింది. 

చంద్రబాబు ప్రభుత్వం 15 వేల ఎకరాల భూమి సేకరించాలని ప్రతిపాదించడంతో పెద్ద వివాదమైంది. రైతులు తీవ్రంగా వ్యతిరేకించారు. పైగా పరిహారంపై కూడా నిరసనలు వ్యక్తమయ్యాయి. కోర్టులో కేసులు వేశారు. అప్పట్లో విపక్ష నేతగా వైఎస్ జగన్ రైతులకు మద్దతిచ్చారు. టీడీపీ నేతల భూదందాను బహిర్గతం చేశారు. ఈ ఆందోళనల ఫలితంగా చంద్రబాబు ప్రభుత్వం దిగివచ్చింది. ఐదువేల ఎకరాలు చాలన్న నిర్ణయానికి వచ్చింది. ఆ రోజుల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్  భోగాపురం ఎయిర్ పోర్టు భూసేకరణ తీరుపై మండిపడ్డారు. తెలుగుదేశంపై అవినీతి ఆరోపణలు చేశారు. తెలుగుదేశం నేతలు, టీడీపీ మీడియా పవన్ విమర్శల గురించి మాట్లాడకుండా,  ఈ ఎయిర్ పోర్టును జగన్‌ వ్యతిరేకించినట్లు అబద్దపు ప్రచారం చేస్తోంది. టీడీపీ సోషల్ మీడియా కూడా చంద్రబాబే మొత్తం ఎయిర్ పోర్టు నిర్మాణం చేసినట్లు బిల్డప్ ఇచ్చే ప్రయత్నం చేసింది. దానికి తగ్గట్లే కేంద్ర పౌర విమానయాన మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు కూడా ట్రయల్ రన్ సందర్భంగా మాట్లాడుతూ ఇదంతా చంద్రబాబు విజన్ అని చెప్పారు. కానీ.. 

జగన్ మాత్రం పద్దతిగా కామెంట్ చేస్తూ ఎయిర్ పోర్టు  యాజమాన్యం అయిన జీఎంఆర్‌ సంస్థను అభినందించారు. ఏపీ అభివృద్దిలో ఇది ఒక మైలురాయి అని వ్యాఖ్యానించారు. తమ పాలనలో వేగంగా అనుమతులు పొందే యత్నం చేశామని పేర్కొన్నారు. భూములు ఇచ్చిన రైతులకు పునరావాసం, భూ సేకరణ కోసం రూ.960 కోట్లు ఖర్చు చేసిందని ఆయన గుర్తు చేసుకున్నారు. టీడీపీ దీనిని కూడా సహించలేకపోయింది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు భూములు ఇవ్వద్దని రెచ్చగొట్టారని తప్పుడు ఆరోపణ చేసింది. కాంట్రాక్ట్ సంస్థ జీఎంఆర్‌ను బెదిరించారని కూడా ఈ మీడియా రాసింది. అదే నిజమైతే జీఎంఆర్‌ అధినేత గ్రంధి మల్లిఖార్జునరావు భోగాపురం ఎయిర్ పోర్టుకు జగన్ శంకుస్థాపన చేసిన సందర్భంలో ఆయనే మళ్లీ ప్రారంభోత్సవం చేయాలని ఎలా కోరారు?. శంషాబాద్ ఎయిర్‌పోర్టును వైఎస్‌ రాజశేఖరరెడ్డి శంకుస్థాపన చేశారని, పూర్తి అయ్యాక ఆయనే ప్రారంభోత్సవం చేశారని స్వయంగా మల్లిఖార్జునరావు ఆ సభలో తెలిపారు. ఇప్పుడు సంబంధిత వీడియో వైరల్ అవుతోంది. 

అంతేకాదు.. జగన్ ఆ రోజుల్లో రైతుల తరపున  నిలబడి అన్నివేల ఎకరాల భూమి అవసరం లేదని, న్యూయార్క్  తదితర చోట్ల ఎంత భూమి ఎయిర్ పోర్టు నిర్మాణానికి వాడారో తెలిపారు. బాగా రద్దీ ఉండే అనేక ఎయిర్ పోర్టులు వెయ్యి నుంచి రెండువేల ఎకరాలలో ఉన్న మాట వాస్తవమే కదా! జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత భూ సేకరణను 2500 ఎకరాలకు పరిమితం చేసి రైతులలో ఆందోళన తగ్గించారు. భూములు కోల్పోయినవారికి ఎకరాకి రూ.12.5 లక్షల బదులు రూ.28 నుంచి రూ.36 లక్షల వరకు చెల్లించారు. చంద్రబాబు అనుమతులతో సంబంధం లేకుండా 2019 ఎన్నికలకు ముందు  శంకుస్థాపన చేస్తే జగన్ ముఖ్యమంత్రిగా కేంద్రం నుంచి అన్ని అనుమతులు సాధించి, చంద్రబాబు టైమ్‌లో ఉన్న చిక్కు ముళ్లను  విప్పి, కేసుల పరిష్కారం చేసి, రైతులకు కూడా అసంతృప్తి లేకుండా చేసి నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. 

చంద్రబాబు గతంలో కూడా కుప్పం, నెల్లూరు  జిల్లాలోను విమానాశ్రయాలకు శంకుస్థాపన చేశారు. కుప్పంలో అయితే ఎనిమిది నెలల్లో పూర్తి చేసేస్తామని ప్రకటించారు. ఈ టర్మ్‌లో అప్పుడే 18 నెలలు పూర్తి అయినా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా అది ఉండిపోయింది. అంతేకాదు. కొందరు విజయవాడ మెట్రో 2019కల్లా పూర్తి చేస్తామని చంద్రబాబు హడావుడి చేశారు. కాని అది అడుగు కూడా ముందుకు పడలేదు. చంద్రబాబు పూర్తి చేయలేకపోయిన కనకదుర్గ గుడి వద్ద ఫ్లై ఓవర్‌ను జగన్ ప్రభుత్వం పూర్తి చేయించింది. అలాగే కృష్ణా వరద రాకుండా కృష్ణలంక ప్రాంతంలో భారీ రిటైనింగ్ వాల్ ను జగన్ ప్రభుత్వమే నిర్మించింది. 

చంద్రబాబు ట్రాక్ రికార్డు అత్యధిక సందర్భాల్లో.. శంకు స్థాపనలు,ప్రచారాలకే పరిమితం.  వైఎస్ రాజశేఖరరెడ్డి, జగన్‌లు  తాము చేపట్టిన  ప్రాజెక్టులను పూర్తి అయ్యే దిశగా అడుగులు వేశారు. అందులో భోగాపురం ఎయిర్ పోర్టు ఒకటి. కనుక దీని క్రెడిట్ లో సింహభాగం జగన్‌కే దక్కుతుందని చెప్పొచ్చు.

::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్‌ జర్నలిస్ట్‌, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement