
సాక్షి, హైదరాబాద్: ఏటా రెండు వేల టీఎంసీల గోదావరి జలాలు వృథాగా సముద్రంలో కలుస్తాయని, అలా కలిసే జలాలనే వాడుకొమ్మని తమ ప్రభుత్వ హయాంలో ఏపీకి అవకాశం ఇచ్చామని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్‌రావు చెప్పారు. దీనివల్ల కృష్ణా జలాలను ఎక్కువగా వాడుకోవడానికి తెలంగాణకు అవకాశం దొరుకుతుందన్నది తమ ఉద్దేశమని తెలిపారు. కృష్ణా ప్రాజెక్టులను కేంద్రానికి అప్పగించబోమని అసెంబ్లీలో తీర్మానం చేయడం తెలంగాణ ప్రజల విజయమన్నారు. సోమవారం అసెంబ్లీలో ఈ అంశంపై జరిగిన చర్చలో హరీశ్‌రావు మాట్లాడారు. వివరాలు ఆయన మాటల్లోనే..
‘‘మేం నల్లగొండలో సభ పెట్టుకోవడం చూసే ఈ తీర్మానం చేశారు. చర్చ సందర్భంగా ప్రభుత్వం అసత్యాలు మాట్లాడింది. ట్రిబ్యునల్ పరిధిలో ఉన్న ఈ అంశాన్ని మేం కృష్ణాబోర్డుకు అప్పగించడం సాధ్యమేకాదు. కాంగ్రెస్ సర్కారు మాటలు అవాస్తవమని ప్రస్తుత అధికారి రాహుల్ బొజ్జా కేంద్రానికి రాసిన లేఖే నిదర్శనం. ఆపరేషన్ ప్రొటోకాల్ లేకుండా ఒప్పుకోబోమని మేం అధికారంలో ఉండగా చెప్పాం. రెండో అపెక్స్ సమావేశంలో నీటి వాటాను వ్యతిరేకిస్తూ లేఖ రాశాం. గత కాంగ్రెస్ ప్రభుత్వాల వల్లే కృష్ణా జలాల్లో తెలంగాణకు 299 టీఎంసీలు, ఆంధ్రాకు 512 టీఎంసీలు వాటాగా ఉన్నాయి. మేం ఏపీ, తెలంగాణ చెరో సగం అనే డిమాండ్ తెచ్చాం. దీనిపై అనేకసార్లు లేఖలు రాశాం.
కేసీఆర్ లేకుంటే తెలంగాణ లేదు..
జలాల విషయంలో కేసీఆర్‌ను విమర్శించడం సరికాదు. కేసీఆర్ లేకుంటే తెలంగాణ రాష్ట్రం లేదు. సీఎం రేవంత్‌రెడ్డికి ఆ సీటు ఉండేది కాదు. సోనియాను దేవత, బలిదేవత అన్నదెవరో ప్రజలకు తెలుసు. ప్రాజెక్టులను బోర్డుకు అప్పగించబోమన్న తీర్మానాన్ని బలపరుస్తున్నాం. అయితే ప్రాజెక్టులను అప్పగించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నించినందుకు క్షమాపణ చెప్పాలి.
ఉత్తమ్‌వన్నీ అవాస్తవాలే..
ప్రాజెక్టుల విషయంలో మంత్రి ఉత్తమ్ మాటలన్నీ ఉత్తవే. పదేళ్ల కేసీఆర్ పాలనలో ప్రాజెక్టులను అప్పగించలేదు. మీరు రెండు నెలల్లో అప్పగించారు. పైగా నాటి ప్రభుత్వం ఒప్పుకుందని అవాస్తవాలు చెప్తున్నారు.
అవాస్తవం 1: అపెక్స్ కమిటీ మీటింగ్‌లో కృష్ణాబోర్డుకు అప్పగించామన్నారు. అతి తప్పు. ఎందుకంటే మ్యాటర్ సబ్ జ్యుడిస్ (కోర్టు పరిధిలో)గా ఉంది.
అవాస్తవం 2: కేంద్ర ప్రభుత్వం జారీచేసిన నోటిఫికేషన్‌ను బీఆర్‌ఎస్ సర్కారు సవాల్ చేయలేదన్నారు. ఇది అవాస్తవం. ఐఏఎస్ అధికారి రాహుల్ బొజ్జా.. 15.07.2021 నాటి గెజిట్‌లో మార్పులు చేయాలని కేంద్రానికి రాసిన లేఖ దీనికి సాక్ష్యం.
అవాస్తవం 3: కృష్ణాబోర్డు 16వ Üసమావేశంలో ప్రాజెక్టుల అప్పగింతకు బీఆర్‌ఎస్ సర్కారు ఒప్పుకొందన్నారు. ఇది అవాస్తవం.. ఆపరేషన్ ప్రోటోకాల్ లేకుండా ప్రాజెక్టుల అప్పగింతకు మేం ఒప్పుకోబోమని స్పష్టంగా చెప్పాం.
అవాస్తవం 4: రెండో అపెక్స్ కౌన్సిల్‌లో నీటివాటాను అంగీకరించామన్నారు. అవాస్తవం. మేం వ్యతిరేకించాం. ఈ అంశంపై 27 లేఖలు కూడా రాశాం.
ఒప్పుకున్నది మీరే..
ఈ ఏడాది జనవరిలో జరిగిన మీటింగ్ మినిట్స్ ప్రకారం.. ‘‘ఏపీ, తెలంగాణ చర్చల తర్వాత శ్రీశైలం, నాగార్జునసాగర్‌లను ఏడు రోజుల్లో అప్పగిస్తామనే ప్లాన్‌తో మీ ముందుకు వస్తాం. నెల రోజుల్లో ప్రాజెక్టులను అప్పగిస్తాం. సాగర్ డ్యాం వద్దకు వెళ్లాలంటే కృష్ణాబోర్డు అనుమతి కావాలి. బోర్డుకు ఇరు రాష్ట్రాలు డబ్బులు ఇస్తాయి..’’ అని కాంగ్రెస్ సర్కారు పేర్కొంది. దీనిపై పత్రికల్లో వార్తలు కూడా వచ్చాయి. అప్పుడెందుకు నోరు మెదపలేదు. నేను ప్రెస్‌మీట్ పెట్టి నిలదీశాకే.. మీరు కేంద్రానికి లేఖ రాశారు. మళ్లీ ఫిబ్రవరి 1న జరిగిన మీటింగ్‌లో ప్రాజెక్టులను బోర్డుకు అప్పగిస్తామని చెప్పారు. మ్యాన్ పవర్ అవసరం గురించి చర్చించారు. ఉద్యోగులకు జీతాలు చెల్లించేందుకు అంగీకరించారు. అంటే.. కాంగ్రెస్ సర్కారే ఒప్పుకున్నట్టు స్పష్టంగా తెలుస్తోంది. ఈ రెండు మీటింగ్‌లలో తెలియకుండా ఒప్పుకొన్నామని శాసనసభకు క్షమాపణ చెప్పండి.
పోరాడండి.. సహకరిస్తాం
మొన్న బడ్జెట్ ప్రవేశపెట్టారు. దాని మీద చర్చ లేదు. కృష్ణా ప్రాజెక్టులపై రెండు రోజులైనా చర్చపెడదామన్నారు. ఇప్పుడు మైకులు ఇవ్వడం లేదు. 2014 జూలై 14న కృష్ణా జలాలను పునఃపంపిణీ చేయాలని కేంద్రాన్ని కేసీఆర్ అడిగారు. నదీ జలాల చట్టం ప్రకారం ఏడాది గడిచాక.. ట్రిబ్యునల్ వేయాలంటూ సుప్రీంకోర్టుకు వెళ్లాం. తర్వాత కేసు వాపస్ తీసుకుని, సెక్షన్ 3 కింద ఫిర్యాదు చేసినా ఫలితం లేదు. మేం 9 ఏళ్లు కష్టపడితే ట్రిబ్యునల్ వచ్చింది. మీరు పోరాటం చేయండి. మేం సహకరిస్తాం. ట్రిబ్యునల్‌కు సమయం పెడదాం. 6 నెలల్లో ప్రాజెక్టుల వారీగా నీళ్లు కేటాయించాలని అడుగుదాం.
పోతిరెడ్డిపాడుపై అప్పుడు మాట్లాడలేదేం?
మేం సముద్రంలో కలిసే గోదావరి జలాలను వినియోగించుకునేందుకు ఏపీకి అవకాశం ఇచ్చామేగానీ.. కృష్ణా జలాల గురించి చెప్పలేదు. రాయలసీమ లిఫ్ట్ గురించి 2020 మే 5న జీఓ వచ్చింది. అంతకుముందే 2020 జనవరి 29నే మేం కేంద్రానికి ఫిర్యాదు చేశాం. ఆ ప్రాజెక్టును ఆపాలంటూ మే 12న లేఖ రాశాం. అపెక్స్ కమిటీ మీటింగ్‌లలో కూడా కోరాం. కాంగ్రెస్ సర్కారు అవాస్తవాలు చెప్తోంది. పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంచినప్పుడు మేం పేగులు తెగేదాకా కొట్లాడాం. అప్పుడు మీరెందుకు మాట్లాడలేదు?..’’ అని హరీశ్‌రావు నిలదీశారు.