హైదరాబాద్: ఖైరతాబాద్‌లో ఉప ఎన్నిక వస్తే తప్పకుండా గెలుస్తానని ఎమ్మెల్యే దానం నాగేందర్ ధీమా వ్యక్తం చేశారు. కార్యకర్తలే తన బలమని, వారి వల్లే ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచానని, ఈ స్థాయిలో ఉన్నానని అన్నారు. శనివారం హిమాయత్‌నగర్ డివిజన్‌లోని విఠల్‌వాడిలో ఉన్న మేల్కొటె పార్క్‌ను కార్పొరేటర్ మహాలక్ష్మి రామన్‌గౌడ్‌తో కలిసి సందర్శించారు.
అక్కడ జరుగుతున్న అభివృద్ధి పనుల గురించి హెచ్‌ఎండీఏ డీఈ విశ్వనాథ్‌ను అడిగి తెలుసుకున్నారు. అనంతరం జరిగిన కార్యకర్తల సమావేశంలో ఖైరతాబాద్ డీసీసీ నూతన అధ్యక్షుడు రోహిత్‌ను టీపీసీసీ ఉపాధ్యక్షుడు వినోద్‌రెడ్డితో కలిసి సన్మానించారు. ఈ సందర్భంగా దానం మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని గెలిపించడం, ఓడించడం అనేది ప్రజలు చూసుకుంటారన్నారు.
సీఎంను ఉద్దేశించి బీఆర్‌ఎస్ నాయకులే ఏకవచనంతో మాట్లాడారని, ముఖ్యమంత్రి పదవికి గౌరవం ఇవ్వాలని, అది మరిచి విమర్శలు చేస్తే ప్రతి విమర్శలు కూడా ఎదుర్కోవాల్సి వస్తుందని స్పష్టం చేశారు. కేటీఆర్ వ్యక్తిగత విమర్శలు మానుకొని, కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిపై చర్చకు రావాలన్నారు. ఇద్దరు రాష్ట్ర మంత్రులు అవినీతికి పాల్పడుతున్నారని కేంద్ర హోం శాఖ సహాయమంత్రి బండి సంజయ్ ఆరోపిస్తున్నారని, ఆయన పరిధిలోనే దర్యాప్తు సంస్థలు ఉన్నాయని, ఆధారాలు ఉంటే విచారణ చేపట్టాలని సవాల్ విసిరారు.


