సాక్షి, హైదరాబాద్: పీజేఆర్ కొడుక్కి సీటు ఇవ్వని కాంగ్రెస్ పార్టీకి, సీఎం రేవంత్‌రెడ్డికి నైతిక విలువల గురించి మాట్లాడే అర్హత లేదని బీఆర్‌ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి హరీష్‌రావు అన్నారు. తాజాగా సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్యలకు శనివారం హరీష్‌రావు కౌంటర్ ఇచ్చారు. ఈ క్రమంలో సంచలన ఆరోపణలే చేశారాయన.
సీఎం రేవంత్ రెడ్డి నోరు తెరిస్తే అన్నీ అబద్ధాలే. కేసీఆర్ కట్టిన భవనాల్లో వాళ్ల పాలన కొనసాగుతోంది. కాంగ్రెస్ సర్కార్ వచ్చాకే వృద్ధి రేటు పడిపోయింది. రేవంత్‌కు పరిపాలన చేత కావడం లేదు. తెలంగాణ సచివాలయానికి అంబేద్కర్ పేరు ఉండటం రేవంత్‌కు ఇష్టం లేదు. అందుకే కమాండ్ కంట్రోల్ సెంటర్‌లోకి వెళ్లి కూర్చుంటున్నారు. ఈ రెండేళ్లలో ఏం చేశారో రేవంత్ నిన్న చెప్పలేకపోయారు. 2004-2014 కాంగ్రెస్ పాలన చూసి ఓటేయాలని అడుగుతున్నారు. పీజేఆర్ కొడుక్కి టికెట్ ఇవ్వని రేవంత్‌కు.. ఆయన పేరు తీసే నైతికత లేదు. పీజేఆర్‌ను మానసికంగా వేధించి చనిపోయేలా చేసిందే కూడా కాంగ్రెస్ పార్టీనే అని హరీష్‌రావు ఆరోపించారు.
.. రేవంత్ రెడ్డి, బీజేపీది ఫెవికాల్ బంధం. ఢిల్లీలో భట్టి విక్రమార్క ఇంట్లో ఐటీ రైడ్స్ జరుగితే ఎందుకు బయటకు రాలేదు?. భట్టి ఢిల్లీ వెళితే తెలంగాణ భవన్ లో ఉండరు. గురుగ్రామ్‌లోని అత్తగారి ఇంట్లో ఉంటారు. బీజేపీతో ఒప్పందంలో భాగంగానే భట్టి ఇంట్లో జరిగిన ఐటీ రైడ్స్ బయటకు రాలేదు. భట్టి ఇంట్లో హార్డ్ డిస్క్ లు కూడా ఐటీ అధికారులు తీసుకెళ్ళారు. బీజేపీతో ఒప్పందంలో భాగంగానే మంత్రి పొంగులేటి బయట ఉన్నారు. రేవంత్ రెడ్డి, కిషన్ రెడ్డి మధ్య చీకటి ఒప్పందం ఉంది. రేవంత్ ఢిల్లీ పోతే ఎవర్ని కలిసేది.. ఎవరి కారులో తిరిగేది బయటకు వస్తున్నాయి అని హరీష్‌రావు వ్యాఖ్యానించారు.


