సాక్షి, విశాఖపట్నం: గాదె సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో ముఖ్యమంత్రి చంద్రబాబు కుల రాజకీయాలకు తెరలేపుతున్నారని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఆరోపించారు. దేశ చరిత్రలో ఇలాంటి ఘటనపై కులాలను ప్రస్తావిస్తూ మాట్లాడిన ముఖ్యమంత్రి మరొకరు లేరంటూ మండిపడ్డారు. సాయికృష్ణ మరణాన్ని కేవలం ఒక సీఐ చేసిన చర్యగా చూపించే ప్రయత్నం జరుగుతోందని విమర్శించారు. ఈ కేసుపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ విశాఖలో మీడియాతో మాట్లాడుతూ..‘సాయికృష్ణ హత్యకు సీఎం చంద్రబాబు కులాలను ఆపాదిస్తున్నారు. చనిపోయిన వాడు కాపు, చంపినవాడు కాపునే అని మాట్లాడుతున్నారు. కులాన్ని ఆపాదించి రాజకీయం చేయాలని చూస్తున్నారు. జరిగిన హత్య నుంచి చంద్రబాబు తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. దేశ చరిత్రలో సాయికృష్ణ లాంటి హత్య ఎక్కడ జరిగి ఉండదు. హెబియస్ కార్పస్ రిట్ వేస్తే సాయికృష చనిపోయారని చెబుతున్నారు. సాయికృష కుటుంబాన్ని వైఎస్ జగన్ పరామర్శిస్తే సాయికృష్ణ క్రిమినల్ అని విమర్శలు చేశారు. అదే సాయికృష్ణ కుటుంబాన్ని చంద్రబాబు పరామర్శిస్తే ఆ వ్యక్తి ఏమవుతారో బాబే సమాధానం చెప్పాలి.
సాయికృష్ణ హత్య ప్రభుత్వ హత్య. ఇది ఒక సీఐ చేసిన హత్య కాదు. డీజీపీ, డీజీ, ఏసీపీ అందరినీ అరెస్ట్ చేయాలి. సిట్ విచారణ ద్వారా వాస్తవాలు బయటకు రావు. సీబీఐతో విచారణ జరగాలి. పోలీసులు చట్టానికి లోబడి పని చేయండి. రేపటి రోజున మిమ్మల్ని కాపాడేందుకు చంద్రబాబు, లోకేష్ రారు. కూటమి రెండున్నర ఏళ్ళు సినిమాకు ఇంటర్వెల్ పడింది. మిగతా రెండున్నర ఏళ్ల సినిమా దద్దరిల్లిపోతుంది. ఇది ఈనాడు కాలం కాదు, ఇంటర్ నెట్ కాదు. వైఎస్సార్‌సీపీ ముందు చంద్రబాబు డ్రామాలు చెల్లవు.
ప్రభుత్వ తప్పులను ప్రశ్నిస్తే తల్లి, చెల్లి, గొడ్డలి, లడ్డు గుడ్డు అని మాట్లాడుతున్నారు. చంద్రబాబు మీ ప్రభుత్వం మెడలు వంచుతాం. కాపుల సమస్యలపై సమావేశం పెట్టుకుంటే పవన్ కల్యాణ్‌కు వ్యతిరేకంగా సమావేశమయ్యారు అని రాస్తున్నారు. హోంశాఖ సరిగా పనిచేయలేదని పవన్ చెప్పారు. సాయికృష్ణ హత్య నుంచి ప్రజల దృష్టి మార్చడానికి చంద్రబాబు ప్రయత్నం చేస్తున్నారు అంటూ ఆరోపణలు చేశారు.


