
సాక్షి, వైఎస్సార్ జిల్లా: జమ్మలమడుగు మాజీ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి పోలీసులు అరెస్ట్ చేశారు. యర్రగుంట్లలో ఆయన్ని అదుపులోకి తీసుకున్నారు. సుధీర్‌రెడ్డితో పాటు 30 మందిపై కేసులు నమోదు చేశారు. నిన్న(మంగళవారం) వైఎస్సార్‌సీపీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి అక్రమ అరెస్ట్‌ను సుధీర్‌రెడ్డి అడ్డుకున్నారు. కూటమి అరాచకాలకు వ్యతిరేకంగా నిన్న ఆయన ర్యాలీ నిర్వహించారు.
కాగా, పులివెందులలో నిన్న (మంగళవారం) సూర్యోదయానికి ముందే పచ్చ ఖాకీలు గూండాగిరీకి తెరతీసిన సంగతి తెలిసిందే. భారీగా పోలీసు అధికారులు, సిబ్బంది వేకువజామునే ఎంపీ వైఎస్ అవినాశ్‌రెడ్డి నివాసంపై దండెత్తారు. దురాక్రమణదారుల మాదిరిగా ఇంట్లోకి దూసుకెళ్లారు. ఎంపీని అక్రమంగా అరెస్టు చేశారు. ఎంపీగా తన నియోజకవర్గ పరిధిలోని జెడ్పీటీసీ ఉప ఎన్నికలను పర్యవేక్షించడం ఆయన హక్కు, బాధ్యత. కానీ, దీన్ని పోలీసులు కాలరాశారు. ఆయనను అక్రమంగా అరెస్టు చేస్తున్నట్టు తెలిపారు.
పోలీసుల దౌర్జన్యంపై వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలు తీవ్ర నిరసన తెలపగా వారిని ఈడ్చి పడేశారు. ఎంపీని తమ వాహనంలో బలవంతంగా ఎక్కించుకుని ముద్దనూరు వైపు తీసుకువెళ్లారు. నిడిజివ్వి గ్రామంలో మాజీ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి ఇంటి వద్ద దింపి ఇక్కడే ఉండాలని ఆదేశించారు. అక్కడికి వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు భారీగా తరలివచ్చారు.
పోలీసుల అరాచకాలకు వ్యతిరేకంగా ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు యర్రగుంట్ల వరకు శాంతియుతంగా ర్యాలీ నిర్వహించారు. నాలుగు రోడ్ల కూడలిలో బైఠాయించి నిరసన తెలిపారు.