కాళేశ్వరానికి బాస్‌ కేసీఆరే.. గొంతుపై తుపాకీ పెట్టినా నిజాలే మాట్లాడతా: ఈటల | Etela Rajender Speech After Kaleshwaram Commission Inquiry | Sakshi
Sakshi News home page

కాళేశ్వరానికి బాస్‌ కేసీఆరే.. గొంతుపై తుపాకీ పెట్టినా నిజాలే మాట్లాడతా: ఈటల

Jun 6 2025 1:53 PM | Updated on Jun 6 2025 4:07 PM

Etela Rajender Speech After Kaleshwaram Commission Inquiry

సాక్షి, హైదరాబాద్‌: కాళేశ్వరం కమిషన్‌ తన విచారణను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని, ఆ నివేదికతో అసలు దోషులెవరో బయటపెట్టాలని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్‌(Etela Rajender) కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేస్తున్నారు. శుక్రవారం కమిషన్‌ ఎదుట విచారణకు హాజరైన ఆయన.. అనంతరం మీడియాతో మాట్లాడారు.

‘‘తెలంగాణ సాధించుకుంది నీళ్లు, నిధులు, ఉద్యోగాల కోసం.  పాతికేళ్ల రాజకీయ జీవితంలో ఏ పార్టీలో ఉన్నా విలువలతో ఉన్నాను. తెలంగాణలో మొట్టమొదటి ఆర్థిక మంత్రిగా పని చేశా. రీ డిజైన్‌ కోసం కేసీఆర్‌ వేసిన సబ్‌ కమిటీలో మేం ఉన్నాం. 2016లో తుమ్మడిహట్టి అంచనా రూ.16,500 కోట్లు. ఆ తర్వాత 2015లో ఆ అంచనా రూ.38 వేల కోట్లకు పెరిగింది..

..తుమ్మడిహట్టిపై మహారాష్ట్ర అభ్యంతరం తెలిపింది. తుమ్మడిహట్టితో నీటి అవసరాలు తీరవని రిపోర్టులు వచ్చాయి. మూడు బ్యారేజి CWC రిపోర్ట్, టెక్నికల్ కమిటీ ఆధ్వర్యంలో బ్యారేజీలు కట్టారు. సబ్ కమిటీ, టెక్నికల్ కమిటీ రిపోర్టు ఆధారంగా కట్టారు. కాళేశ్వరం ప్రాజెక్టు మొదటి రూ.63వేల కోట్ల అంచనాతో ప్రారంభం అయ్యింది.  అయితే..రైతుల డిమాండ్ మేరకు రూ. 82వేల కోట్లకు పోయింది. కాళేశ్వరం కార్పొరేషన్ ఏ పర్పస్ కోసం పెట్టారని నన్ను అడిగారు. కాళేశ్వరం కార్పొరేషన్‌కి ఫైనాన్స్ శాఖకు సంబంధం లేదని చెప్పాను.

Etala: తలపై తుపాకీ పెట్టిన నేను చెప్పింది ఇదే..!

.. మా బతుకు నిబద్ధతో ఉంది. నేనేమీ చేయలేదు. నాకేమీ తెలియదు. అంతా వాళ్లే చేశారు. కేసీఆర్‌, హరీష్‌ రావు ఆ ఇద్దరి దగ్గరే సమాచారం అంతా ఉంది. ఏం జరిగినా ఇరిగేషన్‌ శాఖకే సంబంధం ఉంటుంది. ఫైనాన్స్‌ శాఖకు అన్ని వివరాలు తెలియవు. ప్రాజెక్ట్‌ రీ డిజైన్‌ కోసం కేసీఆర్‌ సబ్‌ కమిటీ వేశారు. అందులో మేం(హరీష్‌, తుమ్మల పేర్లు) ఉన్నాం. నా గొంతుపై తుపాకీ పెట్టినా నిజాలే మాట్లాడతా. ఎవరు పిలిచినా ఎక్కడైనా నిజాలే చెప్తా. కొందరు బట్టకాల్చి మీదేసినంత మాత్రాన నాకేమీ కాదు.

మూడు బ్యారేజీల వ్యయం రూ. 10వేల కోట్ల లూపే ఉండొచ్చు.  ప్రభుత్వం విచారణ కమిషన్ రిపోర్టులను బయటపెట్టాలి. కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ ను త్వరగా బయటపెట్టాలి. నిజమైన దోషులు ఎవరో ప్రభుత్వం బయటపెట్టాలి. ప్రాజెక్టు కట్టాలనే ఆలోచన ప్రభుత్వానిది. ఆ నిర్ణయం తీసుకుంది కేసీఆర్...ఆయనే బాస్. కొన్ని వందలసార్లు తన మానస పుత్రిక అని చెప్పారు ’’ అని ఈటల మీడియా చిట్‌చాట్‌లో అన్నారు.

ఇదీ చదవండి: 40 నిమిషాలు.. ఈటలకు 19 ప్రశ్నలు

Advertisement
 
Advertisement
Advertisement