
సాక్షి, హైదరాబాద్: బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్(Eatala Rajendar) కాళేశ్వరం కమిషన్ బహిరంగ విచారణ ముగిసింది. శుక్రవారం ఉదయం ఆర్కే భవన్‌లో జరిగిన ఓపెన్ కోర్టులో ఈటలను కమిషన్ క్రాస్ ఎగ్జామినేషన్ చేసింది. మొత్తం 40 నిమిషాల్లో 19 ప్రశ్నలను కమిషన్ చైర్మన్ పీసీ ఘోష్ ఈటలకు వేశారు. బీఆర్‌ఎస్ హయాంలో ప్రాజెక్టు నిర్మాణ సమయంలో ఆయన మంత్రి(ఆర్థిక శాఖ)గా పని చేసిన సంగతి తెలిసిందే. దీంతో గతంలో నిర్వర్తించిన బాధ్యతల ఆధారంగా ఈటలపై కమిషన్ ఈ ప్రశ్నలు వేసినట్లు తెలుస్తోంది.
కమిషన్ ముందు 113వ సాక్షిగా హాజరైన వ్యక్తి ఈటల రాజేందర్. తొలుత.. ఓపెన్ కోర్టులో ఈటల రాజేందర్‌తో అంతా నిజమే చెప్తానని కమిషన్ ప్రమాణం చేయించింది. బ్యారేజీ నిర్మాణం, కాళేశ్వరం కార్పొరేషన్, డీపీఆర్‌లపైనే కమిషన్ ఆయన్ని ప్రశ్నించినట్లు తెలుస్తోంది.
ఆర్థిక మంత్రిగా ఎంతకాలం పనిచేశారు?: కాళేశ్వరం కమిషన్
మేడిగడ్డ అన్నారం సుందిళ్ల బ్యారేజీల నిర్మాణం చేయాలని ఎవరు నిర్ణయం తీసుకున్నారు?: కాళేశ్వరం కమిషన్
టెక్నికల్ టీం రిపోర్టుల ఆధారంగా సబ్ కమిటీ నిర్ణయం మేరకు.. కేబినెట్ నిర్ణయం తీసుకుంది: ఈటల
కేబినెట్ నిర్ణయం తీసుకున్న తర్వాతే మూడు బ్యారేజీల నిర్మాణం మొదలుపెట్టాం: ఈటల
కేంద్ర జలసంఘం, మహారాష్ట్ర నుంచి అభ్యంతరాలతో తుమ్మిడిహెట్టి నుంచి మేడిగడ్డకు మార్చాం: ఈటల
మహారాష్ట్ర ఒప్పుకోకపోవడంతో 150 నుంచి 148 కుదించాం: ఈటల
మూడు బ్యారేజీలు ఎవరి ఆదేశాల మేరకు నిర్ణయం తీసుకున్నారు?: కాళేశ్వరం కమిషన్
కేబినెట్ నిర్ణయం తీసుకుంది.. తర్వాతే నిర్మాణం జరిగింది: ఈటల
రీ డిజైన్ చేయాలని ఎవరు ఆదేశించారు?: కాళేశ్వరం కమిషన్
మహారాష్ట్ర అభ్యంతరం చెప్పడంతో సీఎం కేసీఆర్ సబ్ కమిటీ వేశారు: ఈటల
హరీష్ రావు చైర్మన్‌గా.. సబ్ కమిటీలో నేను, తుమ్మల నాగేశ్వరరావు ఉన్నాం: ఈటల
ఎక్స్పర్ట్ కమిటీ, టెక్నికల్ కమిటీ, సబ్ కమిటీ నిర్ణయం మేరకు రీ డిజైన్ జరిగింది: ఈటల
రీ డిజైన్ చేయడానికి సబ్ కమిటీ సంతకం చేసిందా? : కాళేశ్వరం కమిషన్
రీ డిజైన్ కోసం సబ్ కమిటీ సంతకం చేసింది: : ఈటల
బ్యారేజీ నిర్మాణ ప్రదేశాలు ఎందుకు మార్చారు?: కాళేశ్వరం కమిషన్
టెక్నికల్ డిటైల్స్ మీద మాకు అవగాహన ఉండదు.. అంతా నిపుణులే చూసుకున్నారు: ఈటల
నిర్మాణ వ్యయం ఎంత అయ్యింది?: కాళేశ్వరం కమిషన్
తొలుత రూ. 63 వేల కోట్లతో అనుకున్నాం. తర్వాత అది రూ.83 వేల కోట్లకు పెరిగింది. ఇప్పుడు ఎంత ఖర్చు అయ్యిందో నాకు తెలియదు: ఈటల
బ్యారేజీ నిర్మాణంలో ఆర్థిక క్రమశిక్షణ లోపించిందా?: కాళేశ్వరం కమిషన్
ఫైన్సాన్స్ ఖాశాఖకు అన్ని వివరాలు తెలియవు. ఏం జరిగినా ఇరిగేషన్ శాఖకే తెలిసి ఉంటుంది. ఆ శాఖ ఆధ్వర్యంలోనే అన్నీ జరిగాయి: ఈటల
ఇలా మొత్తం 19 ప్రశ్నలు వేసింది. ‘‘నేనేం చేయలేదు. నాకేమీ తెలియదు. అంతా వాళ్లే చేశారు. వాళ్లకే అన్నీ తెలుసు’’ అని నాటి ఇరిగేషన్ శాఖను ప్రస్తావిస్తూ ఆయన వివరణ ఇచ్చుకున్నారు. ఈ క్రమంలో తన దగ్గర ఉన్న ఆధారాలను ఈటల కమిషన్‌కు చూపించినట్లు తెలుస్తోంది.
కాళేశ్వరం ప్రాజెక్టు కోసం పని చేసిన అధికారులను మాత్రమే ఇప్పటిదాకా విచారించింది జస్టిస్ పినాకి చంద్రఘోష్ నేతృత్వంలోని కమిషన్(kaleshwaram Commission). ఇక ఇప్పుడు రాజకీయ నేతల వంతు వచ్చింది. ఈ మేరకు.. ఈటలను తొలుత విచారించింది. మరోవైపు.. ఈ వ్యవహారంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావులకూ కమిషన్ నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. జూన్ 5వ తేదీన జరగాల్సిన కేసీఆర్ విచారణ ఆయన విజ్ఞప్తి మేరకు 11వ తేదీకి వాయిదా పడింది. జూన్ 9వ తేదీన హరీష్ రావు కమిషన్ ముందు హాజరు కానున్నారు.
