
రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ చేతుల మీదుగా శౌర్యచక్ర పతకాన్ని అందుకున్న శ్రీనివాసులు (ఫైల్)
శాంతిభద్రతలు కాపాడటంలో కానిస్టేబుళ్లదే కీలకపాత్ర
ఉత్త చేతులతోనే నేరస్తులు, ఉగ్రవాదులతోనూ పోరాడిన చరిత్ర వారిదే
ఫ్రెండ్లీ పోలీసింగ్ అమలుతో కానిస్టేబుళ్లకు దూరమైన ఆయుధాలు
తాజాగా నిజామాబాద్‌లో ఓ దొంగ చేతిలో కన్నుమూసిన కానిస్టేబుల్ ప్రమోద్
సాక్షి, హైదరాబాద్: సరిహద్దులో సైనికులంతా అస్త్రశస్త్రాలతో కదన రంగంలోకి దూకి శత్రువులపై పోరాడుతుంటే సమాజంలో శాంతిభద్రతలను కాపాడటంలో క్షేత్రస్థాయిలో కీలకపాత్ర పోషించే పోలీసు కానిస్టేబుళ్లు మాత్రం అసాంఘిక శక్తులు, ముష్కరులతో ఉత్త చేతులతోనే పోరాడాల్సి వస్తోంది. ఈ కారణంగానే తాజాగా నిజామాబాద్‌లో ఘరానా దొంగ రషీద్‌ను పట్టుకొని పోలీసు స్టేషన్‌కు తరలించే క్రమంలో కానిస్టేబుల్ ప్రమోద్‌ను నిందితుడు కత్తితో పొడవడంతో అమరుడయ్యాడు. గతంలోనూ పలువురు కానిస్టేబుళ్లు ఆయుధాలేవీ లేకుండానే నేరస్తులతోపాటు ఉగ్రవాదులకూ ఎదురెళ్లిన సందర్భాలు ఉన్నాయి.
నెత్తురోడుతున్నా ఉగ్రవాదిని వదల్లేదు...
రాష్ట్ర నిఘా విభాగంలో కానిస్టేబుల్‌గా పని చేసిన కుక్కుడపు శ్రీనివాసులు 2017లో ప్రతిష్టాత్మక శౌర్యచక్ర పతకాన్ని నాటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా అందుకున్నారు. దేశవ్యాప్తంగా 25 ఉగ్రవాద కేసుల్లో మోస్ట్ వాంటెడ్‌గా ఉన్న ఆలంజెబ్ అఫ్రిదీని శ్రీనివాసులు 2016 జనవరిలో పట్టుకున్నారు. సుదీర్ఘకాలం పరారీలో ఉన్న అఫ్రిదీ కదలికల్ని తెలంగాణ ఇంటెలిజెన్స్ అధికారులు బెంగళూరులోని పరప్పణ అగ్రహార ప్రాంతంలో గుర్తించారు.
దీంతో పట్టుకోవడానికి వెళ్లిన కానిస్టేబుల్ శ్రీనివాసులుపై అఫ్రిదీ, అతని భార్య కత్తితో దాడి చేశారు. పేగులు బయటకు వచ్చి నెత్తురోడుతున్నా లెక్కచేయకుండా శ్రీనివాసులు స్థానిక పోలీసులు వచ్చే వరకు అఫ్రిదీని ఒడిసిపట్టుకున్నారు. విధి నిర్వహణలో అసమాన ధైర్యసాహసాలు ప్రదర్శించినందుకు శౌర్యచక్ర అందుకున్నారు. ఉమ్మడి రాష్ట్రం సహా పోలీసు విభాగంలో పనిచేసే అధికారికి శౌర్యచక్ర పతకం లభించడం అదే తొలిసారి.
నేరగాళ్లతో పోరాడిన వాళ్లెందరో...
గత మూడేళ్లలో నేరస్తులను పట్టుకొనే క్రమంలో అనేక మంది కానిస్టేబుళ్లు గాయపడ్డారు. అయినా వెనక్కు తగ్గకుండా నిందితులను పట్టుకున్నారు. మాదాపూర్ ఎస్‌ఓటీలో కానిస్టేబుల్‌గా పనిచేసిన రాజు నాయక్‌కు శౌర్య పతకం లభించింది. నార్సింగి పోలీసుస్టేషన్ పరిధిలో భార్యాభర్తల్ని చంపి దోపిడీకి పాల్పడిన రౌడీషీటర్ కరణ్‌సింగ్‌ను పట్టుకునే క్రమంలో రాజు ఛాతీలో కత్తి దిగింది. అయినా రాజు తన సహచరులు వచ్చే వరకు కరణ్‌సింగ్‌ను విడిచిపెట్టలేదు. ఘరానా దొంగ బత్తుల ప్రభాకర్‌ను ఈ ఏడాది ఫిబ్రవరిలో మాదాపూర్ ప్రాంతంలో పోలీసులు పట్టుకున్నారు.
ఈ క్రమంలో నిందితుడు కాల్పులు జరపడంతో ఎస్‌ఓటీ కానిస్టేబుల్ వెంకట్‌రెడ్డి తొడలోకి తూటా దూసుకుపోయింది. అయినప్పటికీ ఆయన మిగిలిన కానిస్టేబుళ్లతో కలిసి ప్రభాకర్‌ను పట్టుకోవడంలో కీలకపాత్ర పోషించారు. మాదాపూర్ సీసీఎస్‌లో కానిస్టేబుళ్లుగా పనిచేసే యాదయ్య, దినేశ్.. స్నాచర్లు రాహుల్, కిషన్‌ల కోసం ముమ్మరంగా గాలించారు. బీహెచ్‌ఈఎల్ ప్రాంతంలో వీరిని గుర్తించి పట్టుకున్నారు. ఆ సందర్భంలో రాహుల్ కత్తితో దాడి చేయగా యాదయ్యకు ఏకంగా ఏడు కత్తిపోట్లు పడ్డాయి.
పోలీసు వద్ద ఆయుధాలు కనుమరుగు...
విధి నిర్వహణలో ఉన్న పోలీసు అధికారికి ఆయుధం అనేది శరీరంలో భాగం లాంటిది. ఈ నేపథ్యంలోనే కొన్నేళ్ల క్రితం వరకు అధికారులతోపాటు కీలక విభాగాల్లో పని చేసే కానిస్టేబుళ్లు తమ వద్ద తుపాకీ ఉంచుకునే వారు. అయితే కొన్నేళ్ల క్రితం అమలులోకి వచ్చిన ఫ్రెండ్లీ పోలీసింగ్ విధానంలో భాగంగా క్షేత్రస్థాయిలో విధులు చేపట్టే పోలీసులెవరూ తుపాకులు ఉంచుకోవద్దంటూ ఆదేశాలు జారీ అయ్యాయి. ప్రజలు ధైర్యంగా ముందుకొచ్చి పోలీసులతో స్నేహపూర్వకంగా మెలిగేందుకు, మానవ హక్కులకు భంగం కలగకూడదనే ఉద్దేశంతో ఆయుధాలను దూరంగా ఉంచుతున్నామని ఉన్నతాధికారులు చెబుతున్నారు.