
హైదరాబాద్, సాక్షి: తెలంగాణలో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. రేపటి నుంచి తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంతో ఇటు బీఆర్‌ఎస్, అటు బీజేపీలు కీలక సమావేశం నిర్వహిస్తున్నాయి.
కాళేశ్వరం నివేదికపై అసెంబ్లీలో చర్చించడమే ప్రధాన ఎజెండాగా కాంగ్రెస్ ప్రభుత్వం ఈ సెషన్‌ను నిర్వహిస్తోందన్న సంగతి తెలిసిందే. అయితే కాళేశ్వరం అభియోగాలు ఎదుర్కొంటున్న మాజీ సీఎం కేసీఆర్ ఈ చర్చకు దూరంగా ఉంటారనే సంకేతాలు అందుతున్నాయి. ఈ తరుణంలోనే ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో ఆయన కీలక నేతలతో భేటీ కాబోతున్నారు.
అసెంబ్లీలో కాళేశ్వరం కమిషన్ నివేదికపై చర్చ నేపథ్యంలో.. అనుసరించాల్సిన వ్యూహంపై ఆయన దిశానిర్దేశం చేయబోతున్నారు. మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్‌రావు సహా బీఆర్ఎస్ సీనియర్ నేతలు పాల్గొనబోతున్నారు. నివేదికపై చర్చించేందుకు తమకు తగినంత సమయం ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేయాలని ఇప్పటికే బీఆర్ఎస్ భావిస్తోంది.
ఇక.. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బీజేఎల్పీ సమావేశం నడుస్తోంది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు ఆధ్వర్యంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అసెంబ్లీ సమావేశాల్లో వ్యవహరించాల్సిన తీరుపై చర్చిస్తున్నారు. అయితే మీటింగ్ మధ్యలో ఎమ్మెల్యేల ప్రయారిటీ అంశాన్ని కొందరు చర్చకు తెచ్చినట్లు తెలుస్తోంది. కేడర్ తీవ్ర అసంతృప్తిలో ఉందని.. రాష్ట్ర కమిటీలో తాము ఇచ్చిన పేర్లను పరిశీలించాలని ఎమ్మెల్యేలు రాంచందర్ రావు దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం.
కాళేశ్వరం కమిటీ నివేదికతో పాటు బీసీ రిజర్వేషన్ల అంశంపై చర్చించేందుకు తెలంగాణ అసెంబ్లీ రేపటి నుంచి ప్రత్యేకంగా భేటీ కానుంది. శనివారం ఉదయం 10.30గం.లకు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతాయి. దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌కు నివాళులర్పించిన అనంతరం సభ వాయిదా పడే అవకాశం ఉంది. ఆపై బీఏసీ మీటింగ్ జరగనుంది. మధ్యాహ్నా సమయంలో సీఎం రేవంత్ అధ్యక్షతన తెలంగాణ కేబినెట్ భేటీ కానుంది. వీలును బట్టి.. నాలుగు లేదంటే ఐదు రోజులపాటు అసెంబ్లీ సమావేశాలు జరగనున్నట్లు తెలుస్తోంది.