
తెలంగాణ విజ్ఞప్తిపై సానుకూలంగా స్పందించిన కృష్ణా బోర్డు
రాష్ట్ర ఇంజనీర్లు, సిబ్బందిని అనుమతించాలని సీఆర్పీఎఫ్‌కు లేఖ
సాక్షి, హైదరాబాద్: నాగార్జునసాగర్ జలాశయానికి కుడి వైపున ఏపీ భూభాగం పరిధిలో సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేసేందుకు తెలంగాణ రాష్ట్రానికి కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్‌ఎంబీ) అనుమతిచి్చంది. ఇందుకోసం ఇంజనీర్లు, సిబ్బందిని డిసెంబర్ 31 వరకు ఏపీ వైపు ఉన్న డ్యామ్‌పైకి అనుమతించాలని సీఆర్పీఎఫ్ కమాండింగ్ అధికారికి మంగళవారం లేఖ రాసింది. రాష్ట్ర విభజన తర్వాత ఉమ్మడి జలాశయాలైన శ్రీశైలం నిర్వహణ ఏపీ పరిధిలోకి వెళ్లగా నాగార్జునసాగర్ తెలంగాణ నిర్వహణ కిందకు వచ్చింది.
గతంలో ఏపీ పోలీసులు సాగర్ డ్యామ్ కుడిభాగంలోని సీసీ కెమెరాలను ధ్వంసం చేసినట్లు తెలంగాణ ఆరోపించింది. ఆ ఘటన తర్వాత ఇరురాష్ట్రాల మధ్య ఏర్పడిన ఉద్రిక్తతలను చల్లార్చడానికి కేంద్రం సాగర్ కుడిభాగంలో సీఆర్పీఎఫ్ బలగాలను మోహరించింది. ప్రస్తుతం కుడి భాగంలో సీఆర్‌పీఎఫ్ బలగాలు ఎవరినీ అనుమతించడం లేదు. అక్కడ ఎలాంటి మరమ్మతులు చేయాల్సి వచి్చనా కృష్ణా బోర్డు అనుమతితోనే రాష్ట్ర ఇంజనీర్లకు అనుమతిస్తున్నాయి.
జలాశయం భద్రతా చర్యల్లో భాగంగా కుడి భాగంలో సీసీ కెమెరాలతోపాటు పిడుగుల నుంచి రక్షణ కోసం లైట్నింగ్ అరెస్టర్లు, సర్జ్ ప్రొటెక్షన్ పరికరాలను ఏర్పాటు చేసేందుకు తెలంగాణ చర్యలు చేపట్టింది. ఇందుకోసం తమ ఇంజనీర్లతోపాటు కాంట్రాక్టర్ల సిబ్బందిని అనుమతించాలని రాష్ట్రం విజ్ఞప్తి చేయడంతో బోర్డు అనుమతిచ్చింది.