
సాక్షి, ఢిల్లీ: తెలంగాణలో బీజేపీ రాజకీయాలపై ఎంపీ ధర్మపురి అరవింద్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజాసింగ్ రాజీనామా అంశంతో పాటు ఈటల-బండి మధ్య జరుగుతున్న కోల్డ్‌వార్‌పైనా అరవింద్ స్పందించారు. పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో బుధవారం ఆయన పార్టీకి సంబంధించిన పలు అంశాలపై మాట్లాడుతూ..
‘‘బండి సంజయ్, ఈటల రాజేందర్ వివాదంపై న్యూట్రల్ ఎంక్వయిరీ కమిషన్ వేయాలి. బీజేపీ పాత అధ్యక్షుడు, కొత్త అధ్యక్షుడు కలిసి ఈ అంశంపై మాట్లాడాలి. అవసరమైతే అధిష్టానం పెద్దలు జోక్యం చేసుకోవాలి’’ అని ధర్మపురి హైకమాండ్‌ను కోరారు.
ఇక గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ వ్యవహారంపై మాట్లాడుతూ.. ‘‘రాజాసింగ్ ఐడియాలాజికల్ మ్యాప్. కొన్ని విషయాల్లో మనస్థాపం చెందారు. ఆయన పార్టీ నుంచి సస్పెండ్ కాలేదు రాజీనామా చేశారు. ఒకవేళ ఆయన మళ్లీ పార్టీ సభ్యత్వం కావాలనుకుంటే మిస్డ్ కాల్ ఇస్తే సరిపోతుంది. మళ్లీ మెంబర్‌షిప్ వస్తుంది.
తెలంగాణ బీజేపీ ఎంపీలకు ఒక్కొక్కరికి రెండు నియోజకవర్గాల బాధ్యతలు ఇవ్వాలి. పనిచేసేందుకు అవకాశం ఇవ్వాలి.. ఫలితం చూపించకపోతే పక్కకు పెట్టాలి. ఏ పార్టీకైనా కార్యకర్తలు కీలకం. ఆ కార్యకర్తలు నాయకులుగా ఎదిగేందుకు ఇదే మంచి సమయం. ఇందూర్ జిల్లాలో జిల్లా పరిషత్ చైర్మన్ పదవి మేం గెలుస్తున్నాం. ఇన్నేళ్లు కాంగ్రెస్ పార్టీ బీసీ రిజర్వేషన్ ఎందుకు ఇవ్వలేదు. బీసీ రిజర్వేషన్లపై ముందుగా సుప్రీం కోర్టులో కొట్లాడాలి అని ఎంపీ అరవింద్ అన్నారు.