
సాక్షి, సిద్దిపేట: కాళేశ్వరం కమిషన్ నివేదికపై బీఆర్‌ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు స్పందించారు. సోమవారం ఎర్రవల్లి ఫామ్ హౌస్‌లో బీఆర్‌ఎస్ కీలక నేతలతో భేటీ అయిన ఆయన.. కమిషన్ నివేదికను, కాంగ్రెస్ ప్రభుత్వంపైనా తీవ్ర వ్యాఖ్యలే చేశారు.
‘‘అది కాళేశ్వరం కమిషన్ కాదు కాంగ్రెస్ కమిషన్. ఆ కమిషన్ నివేదిక ఊహించిందే. ఎందరు ఆందోళన చెందాల్సిన పని లేదు. ఈ వ్యవహారంలో కొంతమంది BRS నేతలను అరెస్ట్ చేయవచ్చు.. అంతమాత్రాన భయపడవద్దు. కాళేశ్వరం ప్రాజెక్టు పనికిరాదు అన్నవాడు అజ్ఞాని..
.. కాళేశ్వరంపై జరుగుతున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలి. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రయోజనాలు ఏంటో తెలంగాణ ప్రజలకు వివరించాలి. కాళేశ్వరంపై క్యాబినెట్ లో ఏం నిర్ణయం తీసుకుంటారో వేచి చూద్దాం’’ అని ఆయన అన్నట్లు తెలుస్తోంది. ఈ భేటీలో హరీష్ రావు, కేటిఆర్, జగదీష్ రెడ్డి, నిరంజన్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి ఇతర ముఖ్య నేతలు పాల్గొన్నారు.
ఇదిలా ఉంటే.. జస్టిస్ పీసీ ఘోష్ నేతృత్వంలోని కమిషన్ కాళేశ్వరం అవకతవకలపై విచారణ జరిపిన ప్రభుత్వానికి నివేదిక అందించింది. అయితే ప్రభుత్వం ఆ నివేదికను బయటపెట్టడం కంటే ముందే మీడియాకు లీకు కావడం చర్చనీయాంశమైంది.
ఇదీ చదవండి: ‘కాళేశ్వరం అవకతవకలు.. ఆయనదే పూర్తి బాధ్యత’
