
ఐటీ దిగ్గజ సంస్థల్లో 80 శాతానికిపైగా ఆఫ్ క్యాంపస్ నియామకాలే
క్యాంపస్‌కన్నా ఆఫ్ క్యాంపస్ సెలక్షన్స్ ద్వారా ఎంపికైన వారికే అధిక ప్యాకేజీలు
ఏఐ దూకుడు నేపథ్యంలో మారిన ఐటీ సంస్థల తీరు
నౌకరీ డాట్‌కామ్,డెలాయిట్ అధ్యయనాల్లో వెల్లడి
సాక్షి, హైదరాబాద్: ఐటీ ఉద్యోగ నియామకాల ట్రెండ్ మారింది. క్యాంపస్ నియామకాలకన్నా ఆఫ్ క్యాంపస్ నియామకాలే ఎక్కువగా జరుగుతున్నాయి. ఐటీ దిగ్గజాలన్నీ దీనికే ఎక్కువ ప్రాధాన్యమిస్తున్నాయి. కంపెనీల అవసరాలకు తగ్గట్టు మానవ వనరుల సమీకరణకు ఇదే సరైన మార్గమని భావిస్తున్నాయి. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మారడం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దూకుడుగా వెళ్తుండటంతో స్కిల్ ఉన్న వారికే కంపెనీలు అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నాయి. బెంగళూరు, ఢిల్లీ, హైదరాబాద్ వంటి నగరాల్లో గత మూడేళ్లుగా 78 శాతం ఏఐ, డేటాసైన్స్‌లో నైపుణ్యం ఉన్న వారినే కంపెనీలు ఎంపిక చేసుకున్నట్లు నౌకరీ డాట్ కామ్ అధ్యయనంలో తేలింది.
ఏఐ, క్లౌడ్ కంప్యూటింగ్‌లో 84 శాతం నియామకాలు ఆఫ్ క్యాంపస్ ద్వారానే చేపట్టినట్లు డెలాయిట్ సంస్థకు చెందిన సీనియర్ హెచ్‌ఆర్ ఒకరు తెలిపారు. వేతనాలు కూడా క్యాంపస్ నియామకాలకన్నా ఆఫ్ క్యాంపస్ ద్వారా నియమించుకున్న వారికే ఎక్కువ ఇస్తున్నారు. డెలాయిట్ ఇండియా నివేదిక ప్రకారం ఈ ఏడాది క్యాంపస్ నియామకాల్లో వేతనాలు 3.91 శాతం పెరిగితే ఆఫ్ క్యాంపస్ నియామకాల్లో 15 శాతం వార్షిక వేతన ప్యాకేజీ పెరిగింది. యాన్ ఇండియా క్యాంపస్ స్టడీ 2025–26 ప్రకారం 73 శాతం సాధారణ కంపెనీలే క్యాంపస్ నియామకాలు చేపట్టాయి. ఐటీ దిగ్గజ సంస్థల్లో 85 శాతం కంపెనీలు ఆఫ్ క్యాంపస్ ద్వారానే నియామకాలు చేశాయి.
కారణాలేంటి?
ఐటీ రంగంలో అనుభవం ఉంటే తప్ప ఉద్యోగులను తీసుకొనే పరిస్థితి లేదు. కానీ క్యాంపస్ నియామకాల్లో ఫ్రెషర్స్‌ను మాత్రమే ఎంపిక చేసుకొనే అవకాశం ఉన్నందున కాలేజీల్లో కాకుండా ఇతర సంస్థల్లో, ఆన్‌లైన్ విధానంలో కోడింగ్‌పై పట్టు సాధించిన వారిని నియమించుకోవడంపై కంపెనీలు దృష్టిపెడుతున్నాయి. ఇంకో ప్రధానాంశం ఏమిటంటే క్యాంపస్ నియామకాల్లో కేవలం కంపెనీ హెచ్‌ఆర్ విభాగం మాత్రమే ఇంటర్వ్యూ చేస్తోంది. అదే ఆఫ్ క్యాంపస్ ఇంటర్వ్యూల్లో అయితే ఆన్‌లైన్ ద్వారా వివిధ స్థాయిల నిపుణులు అభ్యర్థిని లోతుగా ప్రశ్నించే వీలుంది. దీనివల్ల నైపుణ్యం ఉన్న వారినే ఎంపిక చేసుకోవచ్చని కంపెనీలు భావిస్తున్నాయి.
ఆఫ్ క్యాంపస్‌లో రాణించాలంటే....
నైపుణ్యం ఉన్నప్పటికీ ఆఫ్ క్యాంపస్ ఇంటర్వ్యూల్లో చాలా మంది ఎంపిక కావడం లేదు. పెద్ద ఐటీ సంస్థలు దాదాపు ఆరు రౌండ్ల దాకా ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నాయి. అయితే చాలా మంది అభ్యర్థులు ధైర్యంగా మాట్లాడలేక, బెరుకుగా సమాధానాలు ఇస్తుండటం వల్ల తొలి రౌండ్‌లోనే ని్రష్కమిస్తున్నారని ఐబీఎం హెచ్‌ఆర్ సీనియర్ మేనేజర్ ఒకరు తెలిపారు.
రెజ్యూమ్ రూపకల్పనలోనూ తప్పులు చేస్తున్నారని.. అనుభవానికి మించి ఎక్కువ కేడర్ పోస్టులకు దరఖాస్తు చేస్తుండటం వల్ల తొలి దశలోనే దరఖాస్తు తిరస్కరణకు గురవుతోందని పేర్కొన్నారు. అలాగే నైపుణ్యం ఉన్నా సరైన కమ్యూనికేషన్ స్కిల్స్ లేకపోవడం వల్ల కూడా కొందరు అభ్యర్థులు విఫలమవుతున్నారని చెప్పుకొచ్చారు. అయితే ఈ నైపుణ్యాలను ఆన్‌లైన్ వేదికల ద్వారా నేర్చుకోవచ్చని.. తద్వారా ఆప్ క్యాంపస్ కొలువులు సాధించడం కష్టమేమీ కాదని నిపుణులు చెబుతున్నారు.
ఐటీ నియామకాల్లో ఎక్కువ భాగం ఆన్‌లైన్ ద్వారానే కనెక్ట్ అవుతున్నాం. ఇది తేలికగా ఉంటోంది. అభ్యర్థి సామర్థ్యాన్ని గుర్తించడానికి వివిధ కేటగిరీ నిపుణులూ ఆన్‌లైన్ ద్వారా అందుబాటులోకి వస్తారు. క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో ఇది సాధ్యం కాదు. అందుకే గత మూడేళ్లలో పెద్ద కంపెనీలు 70 శాతం మేర ఆఫ్ క్యాంపస్ సెలక్షన్స్ వైపు మళ్లాయి.
– అంబరీష్ నికోలన్ (ఓ ఎంఎన్‌సీ హెచ్‌ఆర్ మేనేజర్)
సమర్థతకు ఇదే వేదిక
ఫైనలియర్‌లో క్యాంపస్ నియామకాల కోసం పెద్ద కంపెనీలేవీ రాలేదు. ఆశించిన వేతన ప్యాకేజీ ఇవ్వలేదు. దీంతో కొన్ని కోర్సులు, కమ్యూనికేషన్ స్కిల్స్ ఆన్‌లైన్ ద్వారా నేర్చుకున్నా. ఆఫ్ క్యాంపస్ సెలక్షన్స్‌కు ప్రయత్నించి ఓ ఎంఎన్‌సీ కంపెనీలో మంచి వేతనంతో ఉద్యోగం సాధించా. మన సామర్థ్యం నిరూపించుకోవడానికి ఇదే సరైన మార్గం.
– సంజయ్ త్రిపూర్ (బాంబే ఐఐటీ గ్రాడ్యుయేట్)