దక్షిణాఫ్రికాలో జరగబోయే టీ20 సదస్సును అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బహిష్కరించారు. తాను మాత్రమే కాదు.. అమెరికా తరఫున ప్రతినిధులెవరూ ఆ సదస్సుకు హాజరు కాబోరని స్పష్టం చేశారాయన. ఈ నేపథ్యంలో భారత ప్రధాని మోదీని కాంగ్రెస్ పార్టీ లక్ష్యంగా చేసుకుని వ్యంగ్యాస్త్రాలు సంధించింది.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాను నవంబర్ 22-23 తేదీల్లో సౌతాఫ్రికాలో జరగబోయే జీ20 సదస్సును బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు. కాబట్టి తనను తాను విశ్వగురుగా ప్రకటించుకున్న వ్యక్తి కచ్చితంగా ఆ సదస్సుకు వెళ్లి తీరతారు అంటూ మోదీని ఉద్దేశించి కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ శనివారం ఓ ట్వీట్ చేశారు.
ఇక.. 2014లో మోదీ ప్రధానిగా తొలిసారి ఎన్నికైనప్పటి నుంచి ఇప్పటిదాకా జీ20 సదస్సులన్నింటికీ హాజరవుతూ వస్తున్నారు మోదీ. బ్రిస్బేన్, అంటాల్యా, హాంగ్‌జౌ, హాంబర్గ్, బ్యూనస్ ఎయిర్స్, ఓసాకా, రియాద్ (కరోనా కారణంగా వర్చువల్), రోమ్, బాలి, న్యూఢిల్లీల్లో జరిగిన జీ20 సదస్సుల్లో పాల్గొన్నారు. అయితే.. ట్రంప్ నేపథ్యంతో మోదీని ఇలా జైరాం టార్గెట్ చేయడం తొలిసారేం కాదు.
భారత్‌పై ట్రంప్ సుంకాల మోత మోగించాక.. ఈ ఇరు దేశాధినేతలు ఎదురుపడింది లేదు. మొన్నీమధ్యే కౌలాలంపూర్(మలేషియా)లో జరిగిన ఏషియన్ సదస్సు మోదీ గైర్హాజరు కావడాన్ని తీవ్రంగా తప్పుబట్టారాయన. రష్యా చమురు వాణిజ్యంపై ట్రంప్ అభ్యంతరాలు, అమెరికాతో వాణిజ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ.. ట్రంప్‌కు ఎదురు పడడం ఇష్టం లేకనే మోదీ హాజరు కాలేదంటూ కాంగ్రెస్ సీనియర్ నేత ఎద్దేవా చేశారు. అయితే..
అక్టోబర్ 26-28 తేదీల నడుమ కౌలాలంపూర్ వేదికగా ఏషియన్ సదస్సు జరిగింది. దీపావళి పండుగ నేపథ్యంతో ఈ సదస్సుకు మోదీ హాజరు కాలేకపోయారు. వర్చువల్‌గా హాజరై ప్రసంగించారు. ఈ సదస్సుకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రత్యక్షంగా హాజరయ్యారు. అయితే.. ఏషియన్ సదస్సుకు అనుబంధంగా జరిగిన ఈస్ట్ ఏషియా సదస్సుకు మాత్రం భారత్ తరఫున విదేశాంగ మంత్రి జైశంకర్ హాజరై ప్రసంగించారు. అంతకు ముందు..
అక్టోబర్ 13వ తేదీన ఈజిప్ట్ నగరం శర్మ ఎల్ షేక్‌లో జరిగిన గాజా శాంతి సదస్సుకు కూడా మోదీ గైర్హాజరయ్యారు. చివరి నిమిషంలో ఆహ్వానం అందినందువల్ల రాలేకపోతున్నాంటూ వివరణ ఇచ్చారు. అంతేకాదు.. తన తరపున ప్రత్యేక ప్రతినిధిగా విదేశాంగ శాఖ సహాయ మంత్రి కీర్తివర్దన్ సింగ్‌తో సందేశాన్ని పంపించారు. ఈ సదస్సు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఈజిప్ట్ అధ్యక్షుడు అబ్దెల్ ఫత్తా అల్-సిసీ ఆధ్వర్యంలో జరిగిందన్నది తెలిసే ఉంటుంది. ఇదే వేదికగా ట్రంప్‌పై పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ప్రశంసలు గుప్పిస్తూ.. భారత్-పాక్ యుద్ధాన్ని ఆపారంటూ ప్రకటించారు కూడా.
ట్రంప్ ఆరోపణలపై సౌతాఫ్రికా స్పందన
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దక్షిణాఫ్రికాపై చాలాకాలంగానే సంచలన ఆరోపణలు చేస్తున్నారు. రెండోసారి అధ్యక్షుడైన కొన్నిరోజులకు.. ఆ దేశ అధ్యక్షుడు సిరిల్ రామఫోసాను వైట్‌హౌజ్‌కు రప్పించుకుని మరీ శ్వేత జాతీయుల్ని ఊచకోత కోస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక ఇప్పుడేమో.. ఆ దేశంలో ఉన్న తెల్లజాతీయుల్ని నల్లజాతీయుల్ని హత్యలు చేస్తూ.. వాళ్ల భూములు, పొలాలు లాక్కుంటున్నారని మండిపడ్డారు. ఈ పరిస్థితుల్లో దక్షిణాఫ్రికాలో జీ20 సదస్సు నిర్వహించడం సిగ్గుచేటు అంటూ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చేశారు. ఈ తరుణంలో 2026లో ఫ్లోరిడాలోని మియామీలో జీ20 సదస్సుకు తాను ఆతిథ్యం ఇవ్వాలని భావిస్తున్నట్లు ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే..
ట్రంప్ ఆరోపణలను దక్షిణాఫ్రికా ప్రభుత్వం కొట్టిపారేసింది. తమ దేశంలో వర్ణవివక్ష పాలన ముగిసిన తర్వాత కూడా శ్వేత జాతీయులు ఆఫ్రికన్ల కంటే మెరుగైన పరిస్థితుల్లోనే జీవిస్తున్నారంటూ చెబుతోంది. దక్షిణాఫ్రికాలో 1948 నుంచి 1994 వరకు వర్ణవివక్ష విధానం కొనసాగింది. తెల్లవాళ్లకు (white minority) అధిక హక్కులు, అధికారం ఉండేది. నల్లజాతీయులు (Black majority) సొంతగడ్డపైనే వివక్షను ఎదుర్కొనేవారు. 1994లో నెల్సన్ మండేలా అధ్యక్షుడిగా ఎన్నికయ్యాక.. ఈ వివక్షకు ఫుల్‌స్టాప్ పడి సమానత్వం మొదలైంది.


