
న్యూఢిల్లీ: ఆర్‌ఎస్‌ఎస్‌పై(RSS) ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ప్రశంసల వర్షం కురిపించడం పట్ల కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి జైరామ్ రమేశ్(Jai Ram Ramesh) అభ్యంతరం వ్యక్తంచేశారు. సంఘ్ గురించి అప్పటి కేంద్ర హోంశాఖ మంత్రి సర్దార్ వల్లభ్‌భాయి పటేల్ ఏమన్నారో మోదీకి తెలుసా? అని ప్రశ్నించారు. 1948 జూలై 18న డాక్టర్ శ్యామ్‌ప్రసాద్ ముఖర్జీకి పటేల్ రాసిన లేఖను ప్రస్తావించారు. ఈ మేరకు బుధవారం ‘ఎక్స్’లో జైరామ్ రమేశ్ పోస్టుచేశారు.
ఈ సందర్భంగా జైరామ్ రమేశ్.. ఆర్‌ఎస్‌ఎస్ కార్యకలాపాల వల్ల దేశంలో భయానక వాతావరణం ఏర్పడిందని, అది అంతిమంగా మహాత్మాగాంధీ హత్యకు దారితీసినట్లు ఆ లేఖలో పటేల్ పేర్కొన్నారని గుర్తుచేశారు. సంఘ్‌తోపాటు హిందూ మహాసభ తీరును వ్యతిరేకిస్తూ పటేల్ ఆ లేఖలో రాశారని వెల్లడించారు. ముఖ్యంగా సంఘ్ కార్యకలాపాలు దేశ భద్రతకు, ప్రభుత్వానికి ముప్పుగా మారాయని పటేల్ తెలిపినట్లు గుర్తుచేశారు. 1948 డిసెంబర్ 19న జైపూర్ సభలో పటేల్ మాట్లాడుతూ సంఘ్ తీరుపై నిప్పులు చెరిగారని జైరామ్ రమేశ్ వెల్లడించారు. ఈ నిజాలను ప్రధాని మోదీ ఇకనైనా తెలుసుకోవాలని హితవు పలికారు.
ఇది కూడా చదవండి: ‘దేశ నిర్మాణమే సంఘ్ ధ్యేయం’