భట్టికి డిప్యూటీ సీఎం+పీసీసీ పగ్గాలు?  | Congress high command offer to Bhatti Vikramarka | Sakshi
Sakshi News home page

భట్టికి డిప్యూటీ సీఎం+పీసీసీ పగ్గాలు? 

Dec 6 2023 1:17 AM | Updated on Dec 6 2023 1:17 AM

Congress high command offer to Bhatti Vikramarka - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ప్రస్తుతం టీపీసీసీ అధ్యక్షుడిగా ఉన్న రేవంత్‌రెడ్డిని కాంగ్రెస్‌ హైకమాండ్‌ సీఎల్పీ నాయకుడిగా ఎంపిక చేసిన నేపథ్యంలో కొత్త పీసీసీ అధ్యక్షుడు ఎవరన్నది ఆ పార్టీ వర్గాల్లో చర్చనీయాంశమవుతోంది. రేవంత్‌ సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత పీసీసీ అధ్యక్షుడిగా కొనసాగే అవకాశం లేకపోవడంతో ఆయన స్థానంలో కొత్త నేతను అధిష్టానం ఎంపిక చేయనుంది.

ఈ నేపథ్యంలో ప్రస్తుత సీఎల్పీ నేత భట్టి విక్రమార్కతో పాటు హుస్నాబాద్‌ ఎమ్మెల్యే, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, మాజీ ఎంపీ మధుయాష్కీగౌడ్, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, షబ్బీర్‌అలీ, మల్లురవిల పేర్లు కూడా వినిపిస్తున్నాయి. కాగా సీఎల్పీ నాయకుడి ఎంపిక కసరత్తు కోసం ఢిల్లీ వెళ్లిన భట్టి ముందు అధిష్టానం ఓ ప్రతిపాదన చేసినట్టు తెలిసింది.

కొత్త ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రి హోదాతో పాటు పీసీసీ అధ్యక్ష బాధ్యతలు కూడా తీసుకోవాలని కేసీ వేణుగోపాల్‌ కోరినట్టు సమాచారం. అయితే సీఎం పదవి కావాలని అధిష్టానం వద్ద పట్టుబట్టిన భట్టి, ఈ విషయంలో ఏమీ తేల్చి చెప్పలేదని చెబుతున్నారు.  

బీసీ కోటాలో పలువురి పేర్ల పరిశీలన! 
పీసీసీ చీఫ్‌ పదవిని భట్టి నిరాకరించిన పక్షంలో.. సీఎం రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడం, డిప్యూటీ సీఎం ఎస్సీ నేతకు ఇచ్చే పక్షంలో పీసీసీ అధ్యక్ష పదవి బీసీలకు ఇవ్వాలనే ఆలోచనలో హైకమాండ్‌ ఉన్నట్టు సమాచారం. ఈ కోటాలో వినిపిస్తున్న మొదటి పేరు పొన్నం ప్రభాకర్‌. విద్యార్థి దశ నుంచే కాంగ్రెస్‌ రాజకీయాల్లో చురుకుగా పాల్గొంటున్న ప్రభాకర్‌.. అటు పార్టీకి, ఇటు గాంధీ కుటుంబానికి విధేయుడిగా గుర్తింపు పొందారు.

ఎంపీగా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ఎంపీల ఫోరం కన్వీనర్‌గా పనిచేసిన పొన్నం ఇటీవల జరిగిన ఎన్నికల్లో హుస్నాబాద్‌ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఈ నేపథ్యంలో కొత్త ప్రభుత్వంలో ఆయనకు మంత్రి పదవి ఇవ్వడంతో పాటు పీసీసీ అధ్యక్ష పదవి ఇస్తారనే చర్చ జరుగుతోంది. గతంలో డి.శ్రీనివాస్‌ కూడా పీసీసీ అధ్యక్షుడిగా ఉండి మంత్రిపదవి నిర్వహించడాన్ని దృష్టిలో పెట్టుకుని అధిష్టానం ఈ ప్రతిపాదనపై చర్చ జరుపుతోందని తెలుస్తోంది.

అది సాధ్యం కాని పక్షంలో మరో ఇద్దరు బీసీ నేతలు మధుయాష్కీగౌడ్, మహేశ్‌కుమార్‌గౌడ్‌ల పేర్లు కూడా పరిగణనలోకి తీసుకునే అవకాశం లేకపోలేదని అంటున్నారు. అలాగే సామాజిక సమీకరణలను బట్టి సీనియర్‌ నేతలైన ప్రస్తుత ఎమ్మెల్సీ టి.జీవన్‌రెడ్డి, మైనార్టీ నేత షబ్బీర్‌అలీ, మాజీ ఎంపీ మల్లురవిల పేర్లను కూడా హైకమాండ్‌ పరిశీలించే అవకాశముందనే చర్చ జరుగుతోంది.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement