కేసీఆర్‌ చేసిన పాపాలు మాకు తగిలాయి: సీఎం రేవంత్‌

Cm Revanth Slmas KCR KTR And BRS Party - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కేసీఆర్‌ అధికారం కోల్పోయిన దుఃఖంలో ఉన్నారని విమర్శించారు సీఎం రేవంత్‌ రెడ్డి.  కేసీఆర్‌ చేసిన పాపం పిల్లలకు తగిలి జైలుకు వెళ్లారని అన్నారు. కవిత జైలుకు వెళ్లినందుకు తమకు సానుభూతి ఉందని తెలిపారు. కాంగ్రెస్‌ వచ్చింది.. కరువు తెచ్చిందని అంటున్నారని.. మేము వచ్చింది ఎప్పుడు.. కరువు తెచ్చింది ఎప్పుడని ప్రశ్నించారు. కేసీఆర్‌ చేసిన పాపాలు తమకు తగిలాయని అన్నారు.

కేసీఆర్‌ పొలం బాట పట్టడం సంతోషంగా ఉందన్నారు రేవంత్‌. పదేళ్ల తర్వాతైనా రైతులు ఉన్నారని కేసీఆర్‌కు గుర్తు వచ్చిందన్నారు. కేసీఆర్‌ వారసత్వంగా కరువు, అప్పు వచ్చిందన్నారు. బీఆర్‌ఎస్‌ పాపాలు తమకు అంటగట్టడం ఏంటని మండిపడ్డారు. బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థులు పారిపోతున్నారని, అందుకే డ్రామాలు ఆడుతున్నారని విమర్శించారు.

ఈ నెల 6న రంగారెడ్డి జిల్లా తుక్కుగూడలో కాంగ్రెస్ భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయనుంది. ఈ మేరకు సభా ప్రాంగణాన్ని సీఎం రేవంత్‌ రెడ్డి మంగళశారం పరిశీలించారు. సభ ఏర్పాట్లు, ఇతర అంశాలపై పార్టీ నేతలకు పలు సూచనలు చేశారు. అనంతరం రేవంత్‌ మాట్లాడుతూ.. తుక్కుగూడ సభకు ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ హాజరు కానున్నట్లు తెలిపారు. తుక్కుగూడ సభలో ఏఐసీసీ మ్యానిఫెస్టో విడుదల చేస్తామని పేర్కొన్నారు. 

సభలో మహిళలకు ప్రత్యేక సీట్లు ఏర్పాటు చేస్తామని రేవంత్‌ పేర్కొన్నారు. కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే.. రాష్ట్రానికి జరిగే మేలును ఈ సభ ద్వారా తెలియజేస్తామన్నారు. సోనియా గాంధీ దయ, ప్రేమ వల్ల రాష్ట్రం ఏర్పాటైందని, ప్రజలకు సూపర్‌ సిక్స్‌ గ్యారంటీలు ఇచ్చారని తెలిపారు. మిగిలిన హామీలు ఎన్నికల తరువాత అమలు చేస్తామని చెప్పారు. తొమ్మిదిన్నరేళ్లు కేసీఆర్‌ వందేళ్ల విధ్వంసం చేశారని ఆరోపించారు.  
చదవండి: ఫోన్ ట్యాపింగ్‌ ఆరోపణలపై కేటీఆర్ సీరియస్‌

‘జనరేటర్‌తో ప్రెస్ మీట్ పెట్టి, విద్యుత్ పోయిందని మా ప్రభుత్వంపై నిందలు వేశారు. బీఆర్ఎస్ పదేళ్ళ ప్రభుత్వంలో మేము ఏదైనా కార్యక్రమానికి పిలుపునిస్తే మమ్మల్ని అరెస్ట్‌ చేశారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వంలో కేసీఆర్ పర్యటనకు అన్ని ఏర్పాట్లు మేమే చేశాం. మేము అనుకుంటే మీరు ఇంటి నుంచి బయటకు వచ్చేశారా?  బీఆర్ఎస్ ఖాతాలో 1,500 కోట్లు ఉన్నాయి.. రైతులకు ఓ 100 కోట్లు సహాయం చేయోచ్చు కదా. ఎన్నికల కోసమే కేసీఆర్ యాత్ర. కేసీఆర్ సూచనలు ఇస్తే న్యాయమైనవి అమలు చేస్తాం. 

సూర్యపేటలో 30 సెకన్లు కూడా కరెంట్‌ పోలేదని అధికారులు చెప్పారు. మీ జనరేటర్‌లో ఎవరో పుల్ల పెట్టారు. మీ పార్టీలో పుల్ల పెడుతుంది ఎవరో తెలుసుకో. మేం ధర్నాలు చేస్తే మిమ్మల్ని బయటకు పోనివ్వలేదు. ప్రభుత్వం కూలిపోవాలని పాపపు మాటలెందుకు. రాష్ట్ర అభివృద్ధి కోసమే ఢిల్లీ వెళ్తున్నాం. పదేళ్లుగా మీరు చేసిన పాపాలను కడిగే ప్రయత్నం చేస్తున్నాం. మీరు పదేళ్లు అధికారం ఉంటే మేము అలాగే మాట్లాడమా. ఎన్నికలు లేకుంటే కేసీఆర్‌ బయటకు వచ్చేవారా? బీఆర్‌ఎస్‌, కేసీఆర్‌ రద్దైన వెయ్యి రూపాయల నోట్ల లాంటివారు.  మోదీ, కేసీఆర్‌ ఒక్కటే.. బీఆర్‌ఎస్‌కు ఓటు వేస్తే బీజేపీకి వేసినట్లే. మరి వెన్నుపూసలాంటి మేడిగడ్డ ఎందుకు కూలిపోయింది.’ అని రేవంత్‌ అన్నారు.

Election 2024

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram


 

Read also in:
Back to Top