నల్లగొండలో సర్పంచుల సన్మాన సభలో మాట్లాడుతున్న కేటీఆర్
బీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
‘పాలమూరు’ ప్రాజెక్టునుకాంగ్రెస్ ప్రభుత్వం అడ్డుకుంటోంది
కేసీఆర్ ప్రశ్నలకు సమాధానం చెప్పే దమ్మే లేదు..
దమ్ముంటే పరిషత్, సహకార ఎన్నికలు నిర్వహించాలి
నల్లగొండ టూ టౌన్: పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతలు ప్రాజెక్టును కాంగ్రెస్ ప్రభుత్వం అడ్డుకుంటోందని బీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు ఆరోపించారు. దీనికి సంబంధించిన సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్)ను కేంద్రం తిప్పిపంపినా మాట్లాడలేని తెలివి తక్కువ సీఎం రేవంత్‌రెడ్డి అని విమర్శించారు. నదీ జలాలపై సీఎం రేవంత్‌రెడ్డికి అవగాహన శూన్యమని అన్నారు.
సాగునీటి మంత్రిది అంతులేని అజ్ఞానమని, కేసీఆర్ అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక కేసుల డ్రామాలు ఆడుతున్నారని ధ్వజమెత్తా రు. రాష్ట్రానికి నదీ జలాల విషయంలో జరుగుతున్న అన్యాయంపై నల్లగొండ నుంచే రణభేరి మోగిస్తామని ప్రకటించారు. మంగళవారం నల్లగొండలోని బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయంలో.. పార్టీ తరఫున గెలిచిన సర్పంచ్‌లు, ఉప సర్పంచ్‌లకు జరిగిన సన్మాన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.
‘పాలమూరు’ 90% మేమే పూర్తి చేశాం..
‘కృష్ణా జలాల్లో తెలంగాణ హక్కుల కోసం కేసీఆర్ గర్జిస్తుంటే సమాధానం చెప్పే దమ్ము కాంగ్రెస్ ప్రభుత్వానికి లేకుండాపోయిందని కేటీఆర్ ఎద్దేవా చేశారు. ‘కేసీఆర్ ప్రభుత్వ హయాంలో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు సంబంధించి 90% పనులు పూర్తి చేశాం. మిగతా 10% పనులు పూర్తి చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైంది. కాంగ్రెస్ ప్రభుత్వానికి ఆరు గ్యారంటీల భయం, 420 హామీల భయం పట్టుకుంది.
సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్ని అరాచకాలు, దాడులు, దౌర్జన్యాలు చేసినా గులాబీ సైన్యం ఎదురొడ్డి పోరాడి 45% సర్పంచ్ స్థానాలను గెలిచింది. ప్రభుత్వానికి దమ్ముంటే సహకార సంఘాలకు ఎన్నికలు నిర్వహించాలి. ఓటమి భయంతోనే అధికారం చేతిలో ఉందని నామినేటెడ్ కింద భర్తీ చేసుకునేందుకు ప్రయతి్నస్తున్నారు. ఎన్నికలు పెడితే రైతులు కర్రు కాల్చి వాత పెట్టేందుకు సిద్ధంగా ఉన్నారు.
రైతు బంధు రూ.15 వేలు, పెన్షన్లు రూ.4 వేలు, తులం బంగారం, విద్యార్థులకు స్కూ టీలు, మహిళలకు రూ.2,500, నిరుద్యోగులకు 2 లక్షల ఉద్యోగాలు అడిగినందుకు కేసులు పెడతామని బెదిరిస్తున్నారు. కేసు లు, బెదిరింపులకు భయపడేది లేదు. రెండేళ్లుగా ఏది ప్రశ్నించినా లీక్‌ల పేరిట కేసులని పత్రికల వారి కాళ్లు పట్టుకుని తాటి కాయంత అక్షరాలతో రాయిస్తున్నారు..’అని కేటీఆర్ అన్నారు.
రెండేళ్లలో 2.50 లక్షల కోట్ల అప్పు
2014లో కేసీఆర్ ముఖ్యమంత్రి పదవి చేపట్టే నాటికి రాష్ట్రానికి రూ.80 వేల కోట్లు అప్పు ఉంది. కేసీఆర్ పదేళ్లలో రూ.2.80 లక్షల కోట్ల అప్పు చేసినట్లు స్వయంగా పార్లమెంట్‌లోనే సంబంధిత శాఖ మంత్రి చెప్పారు. కానీ కనీస అవగాహన లేని రేవంత్‌రెడ్డి రూ.8 లక్షల కోట్లని, భట్టి విక్రమార్క రూ.7 లక్షల కోట్లని దుష్ప్రచారం చేశారు. మా ప్రభుత్వ హయాంలో అప్పు చేసి రైతులకు రైతుబంధు కింద రూ.73 వేల కోట్లు ఇచ్చాం.
రూ.90 వేల కోట్లతో కాళేశ్వరం ప్రాజెక్టు, రూ.40 వేల కోట్లతో మిషన్ భగీరథ నీరు, రూ.20 వేల కోట్లతో మిషన్ కాకతీయ, మెడికల్ కాలేజీల నిర్మాణం, వెయ్యికి పైగా గురుకులాలు, 15 లక్షల మందికి కేసీఆర్ కిట్లు ఇచ్చాం. రెండేళ్లలో రూ.2.50 లక్షల కోట్లు అప్పు చేసి రేవంత్‌రెడ్డి రాష్ట్రానికి ఏమి చేశాడో చెప్పమంటే ఒక్కదానికీ సమాధానం లేదు..’అని బీఆర్‌ఎస్ నేత ధ్వజమెత్తారు. ఈ సభలో మాజీ మంత్రి జి.జగదీశ్‌రెడ్డి, ఎమ్మెల్సీ కోటిరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతరనేతలు పాల్గొన్నారు.
నిజాయితీ ఉంటే వెంటనే ఎన్నికలు నిర్వహించాలి
‘సీఎంకు నిజాయితీ ఉంటే, రైతులకు మంచి చేశామన్న నమ్మ కం ఉంటే వెంటనే జెడ్పీటీసీ, ఎంపీటీసీ, సహకార సంఘం ఎన్నికలు నిర్వహించాలి. కాంగ్రెస్ ఎమ్మెల్యేలకే నిధులు ఇవ్వని రేవంత్‌రెడ్డి.. సర్పంచ్‌లకు ఏమి ఇస్తాడు? పార్టీ మారమని సర్పంచ్‌లను బెదిరిస్తున్నారు. రాష్ట్రానికి సీఎం ఎంతో.. గ్రామా నికి సర్పంచ్ అంత. ఎవరికీ బెదరాల్సిన పనే లేదు. రానున్న ఎన్నికల్లో కూడా గులాబీ సైన్యం కలిసికట్టుగా పని చేసి విజయ ఢంకా మోగించాలి..’అని కేటీఆర్ పిలుపునిచ్చారు.


