సమావేశంలో మాట్లాడుతున్నకేటీఆర్. చిత్రంలో మల్లారెడ్డి, సునీత, హరీశ్‌రావు, తలసాని
జీహెచ్‌ఎంసీ ఎన్నికలకు ఇప్పటి నుంచే సిద్ధం కండి
‘జూబ్లీహిల్స్’సమీక్షలో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో పార్టీ గెలవలేదని, నిరాశ పడొద్దని, రాబోయే జీహెచ్‌ఎంసీ ఎన్నికలకు ఇప్పటి నుంచే గ్రౌండ్‌వర్క్ మొదలు పెట్టి విజయం సాధిద్దామని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఓడిన చోటే గెలిచి చూపిద్దామన్నారు. జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ఫలితాలు, పార్టీ బలోపేతం తదితర అంశాలపై చర్చించేందుకు బుధవారం తెలంగాణ భవన్‌లో కేటీఆర్ అధ్యక్షతన సమీక్ష సమావేశం జరిగింది. మాజీమంత్రులు హరీశ్‌రావు, తలసాని శ్రీనివాస్‌యాదవ్, పలువురు ఎమ్మె ల్యేలు, జూబ్లీహిల్స్ నియోజకవర్గ ముఖ్య నాయకులు, కార్యకర్తలు సమావేశానికి హాజరయ్యారు.
ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలే లక్ష్యంగా పనిచేయాలన్నారు. డిసెంబర్‌లోపు సర్పంచ్, జిల్లా పరిషత్ ఎన్నికలు పూర్తయ్యే అవకాశం ఉందని, ఆ వెంటనే పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపడతామని తెలిపారు. జూబ్లీహిల్స్‌లోని 407 బూత్‌ల్లో ఒక్కో బూత్‌కు 10 మంది చొప్పున, మొత్తం 4 వేల మందితో పటిష్టమైన సైన్యాన్ని నిర్మించుకోవాలని సూచించారు. గతంలో నష్టపోయిన చోటే తిరిగి బలాన్ని పుంజుకోవాలని కార్యకర్తల్లో ధైర్యాన్ని నింపారు.
గోపీనాథ్ మరణం తర్వాత పార్టీ ఆయన కుటుంబానికి అండగా నిలిచిందని గుర్తు చేశారు. గోపీనాథ్ సతీమణి సునీతమ్మ గెలుపు కోసం కేసీఆర్ నుంచి బూత్ స్థాయి కార్యకర్త వరకు ప్రతి ఒక్కరూ కుటుంబ సభ్యుల్లా పనిచేశారని ప్రశంసించారు. రేపు రాబోయే కార్పొరేటర్ ఎన్నికల్లో కార్యకర్తల గెలుపు కోసం, ఎమ్మెల్యే ఎన్నికల్లో వారుపడ్డ కష్టానికి మించి తాము పని చేస్తామని, కాలికి బలపం కట్టుకొని తిరుగుతామని భరోసా ఇచ్చారు. తెలంగాణభవన్, పార్టీ కార్యాలయాలు కార్యకర్తలకు ఎల్లప్పుడూ తెరిచే ఉంటాయని, ఏ కష్టం వచ్చినా పార్టీ నాయకత్వం అండగా ఉంటుందన్నారు.
– జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ఫలితాలపై బీఆర్‌ఎస్ నాయకులు అధైర్యపడాల్సిన అవసరం లేదని, పోరాట స్ఫూర్తితో పనిచేసిన కార్యకర్తలదే నైతిక విజయమని హరీశ్‌రావు అన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో కేవలం 18,000 ఓట్లు మాత్రమే వచ్చిన జూబ్లీహిల్స్‌లో, ఈ ఉపఎన్నికలో 75,000 ఓట్లు సాధించడం కార్యకర్తల కృషికి నిదర్శనమని చెప్పారు.
– రాజకీయాల్లో గెలుపోటములు సహజమని, ఉపఎన్నిక ఫలితాలపై అధైర్యపడొద్దని తలసాని శ్రీనివాస్‌యాదవ్ వ్యాఖ్యానించారు. అధికార పార్టీ దుర్వినియోగం, పోలీసుల జోక్యం, విచ్చలవిడి డబ్బు పంపిణీ ఫలితాన్ని ప్రభావితం చేశాయన్నారు.


