టీఎంసీని కాపాడే పనిలో బీజేపీ!? | Is BJP Keeping TMC Alive for a Bigger Political Game? | Sakshi
Sakshi News home page

టీఎంసీని కాపాడే పనిలో బీజేపీ!?

Jun 4 2026 1:57 PM | Updated on Jun 4 2026 2:10 PM

Is BJP Keeping TMC Alive for a Bigger Political Game?

రాజకీయాల్లో ప్రత్యర్థి పార్టీ బలహీనపడితే ఆనందపడటం సహజం. ఆ పార్టీ చీలిపోతే ఆ కిక్కే వేరేలా ఉంటుంది. కానీ పశ్చిమ బెంగాల్‌లో మాత్రం ఇందుకు పూర్తి భిన్నమైన పరిస్థితి కనిపిస్తోంది. మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్‌ కాంగ్రెస్‌ (టీఎంసీ) తన చరిత్రలోనే అతిపెద్ద అంతర్గత సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నప్పటికీ, బీజేపీ మాత్రం ఆ పార్టీ పూర్తిగా కూలిపోవాలని కోరుకోవడం లేదన్న చర్చ రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది.

1998లో మమతా బెనర్జీ స్థాపించిన తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ గత రెండు దశాబ్దాలుగా పశ్చిమ బెంగాల్‌ రాజకీయాల్లో ఆధిపత్యం చెలాయిస్తోంది. అయితే తాజా పరిణామాలు ఆ పార్టీ భవిష్యత్తుపై ప్రశ్నలు రేకెత్తిస్తున్నాయి. ఇటీవల జరిగిన ఎన్నికల అనంతరం టీఎంసీలో అంతర్గత అసంతృప్తి బహిర్గతమైంది. పార్టీకి చెందిన 80 మంది ఎమ్మెల్యేలలో దాదాపు 60 మంది తిరుగుబాటు బావుటా ఎగురవేయడం, మమతా ఎంపిక చేసిన నాయకత్వానికి వ్యతిరేకంగా రితబ్రత బెనర్జీని ప్రతిపక్ష నాయకుడిగా ఎన్నుకోవడం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది.

టీఎంసీ ఆవిర్భావం తర్వాత ఇదే అతిపెద్ద అంతర్గత సంక్షోభంగా రాజకీయ పరిశీలకులు అభివర్ణిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో సాధారణంగా ప్రత్యర్థి బీజేపీ దాడిని మరింత ఉధృతం చేయాలి. కానీ ఆశ్చర్యకరంగా అలా జరిగిన పరిస్థితి కనిపించడం లేదు. పైగా, టీఎంసీ పూర్తిగా కూలిపోవడం బీజేపీకి అంత మంచిది కాదన్న అభిప్రాయాలు కూడా వినిపిస్తున్నాయి.

టీఎంసీ కూలిపోతే బీజేపీకి నష్టమా?
ఇక్కడే అసలు రాజకీయ ట్విస్ట్‌ ఉంది. టీఎంసీ బలహీనపడితే రాజకీయంగా లాభపడాల్సింది బీజేపీ. కానీ బీజేపీలోని ఒక వర్గం మాత్రం టీఎంసీ పూర్తిగా కూలిపోవడం ప్రమాదకరమని భావిస్తున్నట్లు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. దానికి ప్రధాన కారణం వామపక్షాల పునరాగమనం.

ఒకప్పుడు 34 ఏళ్ల పాటు పశ్చిమ బెంగాల్‌ను ఏలిన సీపీఎం నేతృత్వంలోని లెఫ్ట్‌ ఫ్రంట్‌ గత కొన్నేళ్లుగా రాజకీయంగా దాదాపు కనుమరుగైంది. కానీ ఇప్పుడు మళ్లీ ఆ పార్టీలు పుంజుకుంటున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. డోమ్‌కల్‌ అసెంబ్లీ స్థానంలో విజయం, ఫాల్టా రీపోల్‌లో 40 వేలకుపైగా ఓట్లు సాధించడం, మూతపడిన పార్టీ కార్యాలయాలు మళ్లీ తెరుచుకోవడం, కార్మిక సంఘాలు తిరిగి చురుకుగా మారడం వంటి పరిణామాలు వామపక్షాల పునరుజ్జీవనానికి సంకేతాలుగా చెబుతున్నారు.

దీంతో ఇప్పుడు బీజేపీకి అసలు భయం మమతా బెనర్జీనా? లేక తిరిగి బలపడుతున్న లెఫ్ట్‌-కాంగ్రెస్‌ కూటమినా? అన్న చర్చ రాజకీయ వర్గాల్లో మొదలైంది.

ఓటు బ్యాంక్‌ మొత్తం..

గత రెండు ఎన్నికల్లో టీఎంసీకి ప్రధాన ప్రత్యర్థిగా బీజేపీ ఎదిగింది. అయితే టీఎంసీ ఒక ప్రాంతీయ పార్టీ మాత్రమే. దాని ప్రభావం ప్రధానంగా బెంగాల్‌కే పరిమితం. కానీ కాంగ్రెస్‌, సీపీఎం వంటి పార్టీలు జాతీయ స్థాయిలో ఉనికిని కలిగి ఉన్నాయి.

ఒకవేళ టీఎంసీ పూర్తిగా కూలిపోతే, దాని ఓటు బ్యాంక్‌లో గణనీయమైన భాగం లెఫ్ట్‌-కాంగ్రెస్‌ కూటమి వైపు వెళ్లే అవకాశం ఉందని బీజేపీలోని కొందరు నేతలు భావిస్తున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు. 2019 లోక్‌సభ, 2021 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ లెఫ్ట్‌ ఓటర్లలో గణనీయమైన వర్గాన్ని తనవైపు తిప్పుకుంది. ఇప్పుడు అదే వ్యూహాన్ని లెఫ్ట్‌ టీఎంసీ ఓటర్లపై ప్రయోగిస్తే రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారిపోయే ప్రమాదం ఉందన్న అంచనాలు ఉన్నాయి.

అందుకే చేరికలకు విముఖత?

టీఎంసీలో అసంతృప్తి పెరుగుతున్నా, తిరుగుబాటు నేతలను పెద్దఎత్తున బీజేపీలో చేర్చుకునే ప్రయత్నం కనిపించడం లేదు. రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం, టీఎంసీ ఎమ్మెల్యేలను భారీ సంఖ్యలో చేర్చుకుంటే ఆ పార్టీ పూర్తిగా విచ్ఛిన్నమయ్యే అవకాశం ఉంది. కానీ బీజేపీ ఆ దిశగా అడుగులు వేయకుండా జాగ్రత్త పడుతోంది.

బీజేపీ ఎంపీ సౌమిత్ర ఖాన్‌ సైతం ఒక సందర్భంలో "కేంద్ర నాయకత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇస్తే 50 మంది టీఎంసీ ఎమ్మెల్యేలు, 20 మంది ఎంపీలు వెంటనే బీజేపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారు" అని వ్యాఖ్యానించారు. అయినప్పటికీ ఇప్పటివరకు అలాంటి చర్య జరగలేదు. టీఎంసీ నుంచి వచ్చే వారిని విచక్షణారహితంగా చేర్చుకోవద్దని బీజేపీ రాష్ట్ర నాయకత్వం కూడా బహిరంగంగానే చెబుతోంది.

ఈ పరిస్థితిని కొందరు రాజకీయ పరిశీలకులు "టీఎంసీని పూర్తిగా కూల్చకుండా నియంత్రిత బలహీనతలో ఉంచే వ్యూహం"గా అభివర్ణిస్తున్నారు.

ఒడిశా మోడల్‌ ఇప్పుడు బెంగాల్‌లోనా?

ఈ చర్చల్లో మరో ఉదాహరణ కూడా తరచూ వినిపిస్తోంది. ఒడిశాలో నవీన్‌ పట్నాయక్‌ నేతృత్వంలోని బీజేడీ ఎన్నికల్లో ఎదురుదెబ్బ తిన్న తర్వాత కూడా పూర్తిగా చీలిపోకుండా నిలబడగలిగింది. కాంగ్రెస్‌ పునరాగమనాన్ని అడ్డుకునేందుకు బీజేపీ పరోక్షంగా బీజేడీని నిలబెట్టిందన్న విశ్లేషణలు అప్పట్లో వచ్చాయి.

ఇప్పుడు అదే తరహా వ్యూహం బెంగాల్‌లోనూ అమలవుతోందా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. టీఎంసీ బలహీనపడాలి కానీ పూర్తిగా కూలిపోకూడదు. ఎందుకంటే ఆ ఖాళీని లెఫ్ట్‌-కాంగ్రెస్‌ కూటమి భర్తీ చేస్తే అది భవిష్యత్తులో బీజేపీకి మరింత పెద్ద రాజకీయ సవాలుగా మారవచ్చన్నది ఈ వ్యూహం వెనుక ఉన్న ప్రధాన ఆలోచనగా చెబుతున్నారు.

అసలు పోరాటం ఇప్పుడే మొదలైంది

ప్రస్తుతం బెంగాల్‌ రాజకీయాలను పరిశీలిస్తే, ఇది ఇక టీఎంసీ వర్సెస్‌ బీజేపీ పోరాటం మాత్రమే కాదు. టీఎంసీ బలహీనతతో ఏర్పడే రాజకీయ ఖాళీని ఎవరు భర్తీ చేస్తారు? అన్నదే అసలు ప్రశ్నగా మారింది. ఒకవైపు మమతా బెనర్జీ పార్టీని నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తుండగా, మరోవైపు లెఫ్ట్‌-కాంగ్రెస్‌ కూటమి అవకాశాల కోసం ఎదురుచూస్తోంది. బీజేపీ మాత్రం టీఎంసీని ఓడించాలని కోరుకుంటూనే, అది పూర్తిగా కనుమరుగవ్వకూడదని భావిస్తోందన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి.

అందుకే ఇప్పుడు బెంగాల్‌ రాజకీయాల్లో వినిపిస్తున్న అత్యంత ఆసక్తికరమైన ప్రశ్న ఒక్కటే.. "టీఎంసీని కూల్చేయగల శక్తి బీజేపీకి ఉన్నా... కాపాడే వ్యూహాన్నే ఎంచుకుందా?". రానున్న రోజుల్లో బెంగాల్‌ రాజకీయాల దిశను నిర్ణయించేది ఈ ప్రశ్నకు దొరికే సమాధానమే కావొచ్చు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement