రిజర్వాయర్లు డెడ్‌ స్టోరేజీలో.. ప్రభుత్వం కోల్డ్‌ స్టోరేజీలో.. | BRS Leader KTR Fires On CM Revanth Reddy Govt | Sakshi
Sakshi News home page

రిజర్వాయర్లు డెడ్‌ స్టోరేజీలో.. ప్రభుత్వం కోల్డ్‌ స్టోరేజీలో..

Jul 21 2026 6:01 AM | Updated on Jul 21 2026 6:01 AM

BRS Leader KTR Fires On CM Revanth Reddy Govt

కాళేశ్వరం నీళ్లు సముద్రం పాలవుతున్నా సీఎం రేవంత్‌ స్పందించడం లేదు 

6 గ్యారంటీలు అభాసుపాలు.. రెండున్నరేళ్ల పాలనలో సాగు సంక్షోభం 

70వేల ఉద్యోగాలపై సవాలును స్వీకరించే దమ్ము రేవంత్‌రెడ్డికి ఉందా?  

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో ఎల్‌నినో మూలంగా కరువు పరిస్థితులు ఎదురవుతాయని ఆరు నెలల ముందే శాస్త్రవేత్తలు హెచ్చరించినా రాష్ట్ర ప్రభుత్వం స్పందించడం లేదని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ విమర్శించారు. ఓ వైపు రిజర్వాయర్లు డెడ్‌ స్టోరేజీకి చేరుకుంటే ప్రభుత్వం కోల్డ్‌ స్టోరేజీలో పడుకుందని ఎద్దేవా చేశారు. వ్యవసాయంపై అవగాహన లేని ప్రభుత్వానికి ఎల్‌నినో ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు ఎలాంటి ప్రణాళిక, దిశ లేదని మండిపడ్డారు. బాన్సువాడ నియోజకవర్గానికి చెందిన మోరిల్‌ శ్రీనివాస్‌ తెలంగాణ భవన్‌లో సోమవారం కేటీఆర్‌ సమక్షంలో బీఆర్‌ఎస్‌ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో కేటీఆర్‌ మాట్లాడారు. 

‘సీఎం హోదాలో ఉన్న రేవంత్‌ రెడ్డి ఒక చిచోరా. ఎప్పుడు ఎక్కడ ఏం మాట్లాడతారో తెలియని వ్యక్తి సీఎంగా ఉన్నాడు. తెలంగాణలో దోచుకున్న డబ్బును మూటలు కట్టి నెలకోమారు రాహుల్‌ గాంధీకి అప్పగించి తన పదవిని రెన్యూవల్‌ చేసుకోవడమే రేవంత్‌కు తెలుసు. తెల్లారితే కేసీఆర్‌ను దూషించడం, దేవుళ్లపై ఒట్లు వేయడం మినహా రేవంత్‌ ప్రభుత్వానికి మరో పని లేదు. రెండున్నరేళ్లలో వ్యవసాయం పూర్తిగా సంక్షోభంలో పడిపోయింది. కాంగ్రెస్‌ ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారెంటీలు సహా ఏ ఒక్క హామీ అమలు కాకపోవడంతో అన్ని వర్గాల ప్రజలు తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు’అని కేటీఆర్‌ విమర్శించారు.  

‘కాళేశ్వరం’పై కాంగ్రెస్‌ రాజకీయాలు 
‘కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్‌ ప్రభుత్వం రాజకీయాలు చేస్తోంది.మేడిగడ్డ బ్యారేజీలో రెండు పిల్లర్లు దెబ్బతిన్నాయనే సాకుతో మొత్తం ప్రాజెక్టును నిర్వీర్యం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. సాగునీరు విడుదల కోరితే రక్తం చల్లాలని సీఎం అంటున్నారు. తెలంగాణ కోసం రక్తంతో పాటు ప్రాణాలైనా ఇచ్చేందుకు సిద్దం’అని కేటీఆర్‌ ప్రకటించారు. ‘ఏటా రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామంటూ అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ రెండేళ్లలో 10వేల ఉద్యోగాలు కూడా ఇవ్వలేదు. 70వేల ఉద్యోగాలు ఇచ్చినట్లు రుజువు చేస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధం’అని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే ప్రశాంత్‌ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు బాజిరెడ్డి గోవర్ధన్, హనుమంత్‌ షిండే, జీవన్‌ రెడ్డి, ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాకు చెందిన ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement