కేటీఆర్‌ అసలు పేరు అజయ్‌ రావు.. బండి సంజయ్‌ ఆసక్తికర కామెంట్స్‌

Bandi Sanjay Interesting Comments On KCR and KTR - Sakshi

సాక్షి, సిరిసిల్ల: తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్‌, కేటీఆర్‌పై బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్‌ సంచలన ఆరోపణలు చేశారు. కట్టె కాలేవరకు కేసీఆర్‌ తెలంగాణను దోచుకుంటూనే ఉంటారు. కేటీఆర్‌ బతుకేంటో నాకు తెలుసు అంటూ ఆసక్తికర కామెంట్స్‌ చేశారు. 

కాగా, బండి సంజయ్‌ సిరిసిల్లలో మీడియాతో మాట్లాడుతూ.. అయోధ్య రామ మందిరాన్ని వ్యతిరేకించిన వాళ్లు, అయోధ్య అక్షింతలపై రాజకీయం చేసే వాళ్లను బహిష్కరించండి అంటూ కామెంట్స్‌ చేశారు. ఇదే సమయంలో కేసీఆర్‌, కేటీఆర్‌పై విరుచుకుపడ్డారు. ఈ సందర్భంగా బండి సంజయ్‌.. ‘కేటీఆర్‌ అసలు పేరు అజయ్‌ రావు.. టిక్కెట్‌ కోసం ఎన్టీఆర్‌ వద్దకు పోయి కేటీఆర్‌ అని పేరు మార్చాడు. కేసీఆర్‌వి ఆలోచనలు అన్నీ కొంప ముంచేవే. కేటీఆర్ బతుకేందో నాకు తెలుసు.. ముడతల చొక్కా, రబ్బర్ చెప్పులేసుకుని తిరిగేటోడు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని వేల కోట్లు సంపాదించారు. తెలంగాణకు కేంద్రం పెద్ద ఎత్తున నిధులిచ్చింది.

ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు చేసే పరిస్థితి లేదు. ఎన్నికల కోడ్ సాకుతో హామీలను అమలు చేయకుండా దాటవేసే కుట్ర జరుగుతోంది. కాంగ్రెస్, బీఆర్ఎస్ దొందూ దొందే. అవగాహనతోనే ఒకరిపై ఒకరు తిట్టుకుంటున్నారు. కృష్ణా, కాళేశ్వరంపై విచారణ జరపాలి. దోషులను జైలుకు పంపాలి. సిరిసిల్ల జిల్లాకు కేవలం ఏడు పథకాల కోసమే రూ.1408 కోట్లకుపైగా నిధులిచ్చింది. ఈ జిల్లాలో మొక్కల పెంపకం కోసమే రూ.266 కోట్లకుపైగా నిధులిచ్చింది. మరి ఆ నిధులన్నీ ఏమైపోయాయి.. ఒక్క మొక్క కూడా కనిపించడం లేదు. 

పైసలిచ్చేది మోదీ.. మీ కోసం కొట్లాడేది బీజేపీ.. కానీ, కాంగ్రెస్‌కు ఓటేయడం ఎంత వరకు న్యాయం? అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ గుడిని మింగితే.. కాంగ్రెస్ గుడిలోని లింగాన్ని సైతం మింగేసే బాపతు అంటూ ఘాటు విమర్శలు చేశారు. మీరు ఎంపీగా గెలిపించారు. మీకోసం నిరంతరం పోరాడాను. నాపై 100కుపైగా కేసులు పెట్టినా భయపడలేదు. నేను మా తాత, తండ్రి పేరు చెప్పుకుని రాజకీయాల్లోకి రాలేదు. కార్యకర్తగా నుంచి ప్రజల నుంచి పోరాడి ఎంపీ అయ్యాను. కాంగ్రెస్‌ పార్టీ భస్మాసుర హస్తమే. బీజేపీకి ఓటు వేసి మోదీని మళ్లీ ప్రధానిని చేద్దాం’ అని వ్యాఖ్యలు చేశారు. 

whatsapp channel

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram


 

Read also in:
Back to Top