కోనరావుపేట నుంచి రుక్మాపూర్ వరకు
జూలపల్లి(పెద్దపల్లి): పులి సంచారం తెలుసుకునేందుకు జిల్లా అటవీశాఖ అధికారులు పట్టువిడవకుండా గాలిస్తూనే ఉన్నారు. కోనరావుపేట గ్రామ శివారులోని నల్ల ప్రతాప్‌రెడ్డి మొక్కజొన్న చేనులో నుంచి తెలుకుంట, చొప్పదండి మండలం ఎదురుగట్ట, ఎలిగేడు మండలంలోని వివిధ గ్రామాల నుంచి ఎలబోతారం, రుక్మాపూర్ వరకు పులి వెళ్లినట్లు అటవీ అధికారులు సోమవారం గుర్తించారు. కోనరావుపేటలోని రైతు ప్రతాప్‌రెడ్డి తన మొక్కజొన్న పంటకు గతనెల 28 నీరు పారించారు. అదేనెల 30న చేనులో పులి పాదముద్రలు గుర్తించి అటవీ అధికారులకు సమాచారం ఇచ్చారు. రేంజ్ ఆఫీసర్ సతీశ్ కుమార్, నలుగురు డీఆర్వోలతోపాటు హైదరాబాద్ టైగర్ కన్జర్వేషన్ సొసైటీ కో ఆర్డినేటర్ మల్లేశ్ సంఘటన స్థలాన్ని పరిశీలించి పులి పాదముద్రలు ధ్రువీకరించారు. ఇక్కడి నుంచి ఎక్కడి వరకు వెళ్లిందనే విషయాన్ని గుర్తించాల్సి ఉందని ఎఫ్‌ఆర్‌వో సతీశ్‌బాబు వివరించారు. ఇందులో హైదరాబాద్ టైగర్ కన్జర్వేషన్ సొసైటీ కో ఆర్డినేటర్.. పులి ఉన్న ప్రాంతాన్ని వాసనతో గుర్తించే అవకాశం ఉందని వివరించారు. పులి సంచరించిన ప్రాంతాలను గుర్తిస్తూ నాలుగు టీంలుగా విడిపోయి గాలిస్తామని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో డీఆర్వోలు స్వాతి, దేవదాస్, కొమురయ్య, సెక్షన్ ఆఫీసర్ మంగీలాల్, రాజ్‌కుమార్, రాంమూర్తి తదితరులు పాల్గొన్నారు.


