డీఎస్‌ఏ స్టేడియంలో వి‘ధ్వంస’రచన | - | Sakshi
Sakshi News home page

డీఎస్‌ఏ స్టేడియంలో వి‘ధ్వంస’రచన

Jul 17 2026 3:10 AM | Updated on Jul 17 2026 3:10 AM

ఒక్కరోజు సీఎం, కేంద్ర మంత్రి

పర్యటన కోసం పలు

క్రీడా కోర్టులు కూల్చివేత

ఆరుచోట్ల స్టేడియం ప్రహరీకి తూట్లు

డ్రైనేజీ కనిపించకుండా

రూ.లక్షల వ్యయంతో పరదాలు

మళ్లీ స్టేడియంలో సౌకర్యాల

కల్పనకు రూ.లక్షల్లో బిల్లులు

నరసరావుపేట: క్రీడాకారులు, క్రీడా ప్రేమికులు ఎంతో అనుబంధం పెంచుకున్న జిల్లా స్పోర్ట్స్‌ అకాడమీ క్రీడల (కోడెల) స్టేడియం.. సీఎం చంద్రబాబు రాకతో ధ్వంసం అవుతోంది. అరకొర సౌకర్యాలున్నా.. నెట్టుకొస్తున్న ఈ స్టేడియానికి చిక్కులు వచ్చి పడుతున్నాయి. శుక్రవారం ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌ పర్యటన కోసం ధ్వంసం చేసి మరీ ఏర్పాట్లు చేశారు. స్టేడియానికి ఎదురుగా ఉన్న ప్రహరీని ఆరుచోట్ల పగలగొట్టి వీఐపీ, పబ్లిక్‌ అంటూ రాకపోకలకు మార్గాలు ఏర్పాటు చేశారు. స్టేడియం లోపల ఉన్న క్రికెట్‌ ఆడే పిచ్‌లు, వాలీబాల్‌, బాల్‌ బ్యాడ్మింటన్‌ల కోర్టులను ధ్వంసం చేస్తూ ముఖ్య అతిథులు, కార్యక్రమం కోసం వచ్చే వారు కూర్చునేందుకు పెద్ద జర్మన్‌ గుడారాలను నిర్మించారు. అలాగే స్టేడియానికి ఎదురుగా రోడ్డు మార్జిన్‌లో చిరు వ్యాపారాలు ఏర్పాటు చేసుకున్న స్టాళ్లను తొలగించి వారి జీవనోపాధిని దెబ్బగొట్టారు. ఆ మార్గంలో పలు షాపుల ముందు నిర్మించుకున్న మెట్లు, ఇతర కట్టడాలను తొలగించారు. అలాగే స్టేడియానికి పట్టణంవైపున రాకపోకలు చేసే ముఖ్య అతిథులు, ప్రజలకు కత్తవ డ్రైనేజ్‌ కన్పించకుండా సుమారు రూ.లక్ష వ్యయంతో తెరలు ఏర్పాటు చేశారు. స్టేడియంలోకి సత్తెనపల్లి రోడ్డు నుంచి స్విమ్మింగ్‌పూల్‌ వైపున ప్రవేశించే మార్గంలో ఉన్న పెద్దగేటును పెకిలించి స్టేడియం ఆవరణలో పడేశారు. స్టేడియం ఏర్పాటై సుమారు 24ఏళ్లు గడుస్తోంది. ఈ కాలంలో స్టేడియం ఆవరణలో గతంలో ఎన్నో కార్యక్రమాలు జరిగాయి. వాటికి మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, కేంద్ర మంత్రులు, ప్రముఖ గాయకుడు బాలసుబ్రమణ్యం లాంటి వీవీఐపీలు ఎందరో పాల్గొన్నారు.. అయితే స్టేడియంలో సౌకర్యాలను మాత్రం ధ్వంసం చేస్తూ ఏర్పాట్లు చేయటం ఇదే తొలిసారని అధికారులు, ప్రజలు చర్చించుకుంటున్నారు. ఇప్పుడు ధ్వంసమైన సౌకర్యాలు మళ్లీ పునరుద్ధరించాలంటే లక్షల ప్రజాధనం ఖర్చు చేయాల్సిందే. ముఖ్యమంత్రి పాల్గొనే ప్రతి కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.5 నుంచి రూ. 6 కోట్లు ప్రజాధనం ఖర్చు చేస్తోందని అధికారులు చెబుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement