కరోనా కలకలం ● మంగళగిరిలో ఇరువురికి కరోనా పాజిటివ్ ● తాజాగా బాపట్ల జిల్లావాసికి నిర్ధారణ ● జాగ్రత్తలు తీసుకోవాలంటున్న వైద్యులు గుంటూరు మెడికల్: గతంలో లక్షలాది మంది ప్రాణాలను బలిగొన్న కరోనా మహమ్మారి మరోసారి కలకలం రేపుతోంది. ఇటీవల తొలుత కడపలో కరోనా పాజిటివ్ కేసుల నమోదు కాగా, గుంటూరు జిల్లాలో తాజాగా మంగళగిరిలో ఇరువురికి కరోనా ఉన్నట్లు నిర్ధారించారు. ఇప్పుడు ఆదివారం బాపట్ల జిల్లా కర్లపాలెంకు చెందిన ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్ ఉన్నట్లు వైద్యులు నిర్ధారణ చేశారు. బాధితుడు ప్రస్తుతం గుంటూరు జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్నాడు.
మాస్క్‌లతో రక్షణ
కరోనా కేసులు దేశ వ్యాప్తంగా గత కొన్ని రోజులుగా పెరుగుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. మాస్క్‌లతో కరోనా నుంచి రక్షణ పొందవచ్చు. ప్రతి ఒక్కరూ బహిరంగ ప్రదేశాల్లో తప్పనిసరిగా మాస్క్‌లు ధరించడం, తరచూ చేతులు శానిటైజర్‌తో శుభ్రం చేసుకోవడం ద్వారా కరోనా సోకకుండా జాగ్రత్త పడవచ్చు. ముఖ్యంగా
బహిరంగ ప్రదేశాల్లో సంచరించేవారు మాస్క్‌లు ధరించడం చాలా ఉత్తమం. జిల్లాలో కరోనా పాజిటివ్ కేసుల నమోదు వెలుగులోకి రావడంతో పలువురు మాస్క్‌లు ధరించారు.
● మంగళగిరిలో ఇరువురికి కరోనా పాజిటివ్ ● తాజాగా బాపట్ల జిల్లావాసికి నిర్ధారణ ● జాగ్రత్తలు తీసుకోవాలంటున్న వైద్యులు
జీజీహెచ్‌లో ప్రత్యేక వార్డు
గుంటూరు జీజీహెచ్‌లో కరోనా బాధితుల కోసం ప్రత్యేక వార్డును ఏర్పాటు చేశామని ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ గిరిజవోలు దుర్గాప్రసాద్ ఆదివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. గుంటూరు జీజీహెచ్‌లో ప్రత్యేకంగా కరోనా టెస్టింగ్ కేంద్రాన్ని, బాధితుల కోసం ప్రత్యేక వార్డులను ఏర్పాటు చేశారు. ఆసుపత్రి మొత్తం ప్రతి పడకకు ఆక్సిజన్ పైపులైను ఏర్పాటు చేయడంతోపాటు, సహజంగా ఆక్సిజన్ తయారు చేసే భారీ ఆక్సిజన్ ప్లాంట్లను సైతం ఆసుపత్రిలో ఏర్పాటు చేశారు. ఎమర్జన్సీ మెడిసిన్ వైద్య విభాగం వద్ద గతంలో స్టెప్‌డౌన్ ఐసీయూ వార్డుగా ఉన్న దానిని కరోనా వార్డుగా ఏర్పాటు చేశామని సూపరింటెండెంట్ వెల్లడించారు.