నెహ్రూనగర్: గుంటూరు నగరంలో ఆదివారం రాత్రి 7.30 గంటలకు భారీ వర్షం కురిసింది. కేవలం గంట వ్యవధిలోనే కురిసిన భారీ వర్షానికి నగరంలోని ప్రధాన రహదారులన్నీ జలమయమయ్యాయి. ముఖ్యంగా మూడు వంతెనలు, కొత్తపేట, విద్యానగర్, కొరిటెపాడు, పాతగుంటూరు, అమరావతి రోడ్డులోని ప్రధాన రహదారిపై వరద నీరు భారీగా చేరడంతో చెరువును తలపించింది. డ్రైనేజీలు పొంగిపొర్లడంతో మోకాలి లోతున నీరు చేరింది. దీంతో ఆయా మార్గాల్లో వెళ్లే వాహనదారులు, ప్రజలు తమ గమ్యస్థానాలకు చేరుకోవడానికి తీవ్ర ఇబ్బందులు పడ్డారు. నగరంలో డ్రైనేజీ వ్యవస్థ సక్రమంగా లేకపోవడం వల్లే స్వల్ప వ్యవధిలో కురిసిన వర్షానికే రోడ్లు జలమయం అవుతున్నాయని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


