కష్టాల ఖరీఫ్‌ | - | Sakshi
Sakshi News home page

కష్టాల ఖరీఫ్‌

Jul 21 2026 1:36 AM | Updated on Jul 21 2026 1:36 AM

● ముందుకు సాగని ఖరీఫ్‌ పంటల సాగు ● జిల్లాలో సాధారణ విస్తీర్ణం 1,60,138 హెక్టార్లు ● ఇప్పటివరకు 28,456 హెక్టార్లలోనే సాగు పనులు ● అందులోనూ 27,309 హెక్టార్లు కేవలం పత్తి పంటే ● పది శాతం వర్షపాతమూ నమోదు కాని దుస్థితి ● తీవ్ర ఆందోళనలో అన్నదాతలు ● కార్యాచరణ ప్రణాళికపై చంద్రబాబు సర్కార్‌ నిర్లక్ష్యం

పత్తి పంటను దున్నేశా

వర్షం కోసం ఎదురుచూపు

సాక్షి, నరసరావుపేట: వరుణుడి జాడ లేకపోవడంతో జిల్లా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే సేకరించిన విత్తనాలను కొందరు రైతులు వర్షాభావ పరిస్థితులు చూసి ఆయా వ్యాపారులకు తిరిగి ఇచ్చేసే ఆలోచనలో ఉన్నారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. జిల్లాలో ఈ ఏడాది ఖరీఫ్‌ సాధారణ సాగు 4,00,345 ఎకరాలు కాగా... ప్రస్తుతం 71,140 ఎకరాల్లో మాత్రమే సాగైంది. ఇది 17.7 శాతమే. ఇందులో 68,273 ఎకరాలు పత్తి పంట సాగే ఉంది. ముందు పత్తి సాగు చేసి తర్వాత రెండో పంటగా మొక్కజొన్న వేయవచ్చని రైతులు భావించారు. అయితే పత్తి కూడా ప్రస్తుతం ప్రమాదంలో పడింది. తొలకరి వర్షాలతోనే వరుణుడు సరిపెట్టడంతో పంట ఎండిపోతోంది. కొందరుపత్తి పంటను దున్నేస్తుండటం ఆందోళన ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. సాధారణంగా ఈపాటికి వరి నారుమళ్లు, కంది సాగు పుంజుకోవాలి. ప్రస్తుత వాతావరణ పరిస్థితులతో అది సాధ్యమయ్యేలా లేదు.

పది శాతమే వర్షపాతం...

ఎల్‌నినో ప్రభావం పల్నాడు జిల్లాపై అధికంగా కనిపిస్తోంది. జిల్లాలో ఈ నెల 20వ తేదీ నాటికి సాధారణ వర్షపాతం 236.50 సెం.మీ. నమోదు కావాలి. కానీ 24.4 సెం.మీ. మాత్రమే నమోదైంది. నాదెండ్ల, చిలకలూరిపేట, యడ్లపాడు, శావల్యాపురం, బొల్లాపల్లి మండలాల్లో వర్షాభావ పరిస్థితి మరింత ఆందోళనకరంగా ఉంది. ఇక్కడ 10 శాతానికి కూడా వర్షపాతం మించలేదు. ముఖ్యంగా కంది పంట సాగుకు రైతులు వెనుకడుగేస్తున్నారు. మరోవైపు గతేడాది ఇదే సమయంలో శ్రీశైలం, నాగార్జునసాగర్‌ జలాశయాలు నీటితో కళకళలాడుతూ క్లస్టర్‌ గేట్ల నుంచి నీరు ప్రవహించింది. ఈ ఏడాది సాగర్‌లోకి ఇప్పటి వరకు కనీసం ఒక్క టీఎంసీ కూడా రాకపోవడం ఆందోళనకరంగా మారింది. ఎగువనున్న ఆల్మట్టి, నారాయణపూర్‌ జలాశయాల్లోకే నీరు రాకపోవడంతో పరిస్థితి తీవ్రంగా మారనుంది. వరి, ఇతర వాణిజ్య పంటల సాగుకు రైతులు వెనుకడుగు వేస్తున్నారు.

ఖరీఫ్‌ సీజన్‌ రైతుల్లో కన్నీరే మిగులుస్తోంది. ఎల్‌నినో ప్రభావంతో తీవ్ర వర్షాభావం, జలాశయాల్లో నీరు చేరకపోవడంతో సీజన్‌ ప్రారంభమై 50 రోజులు పూర్తయినా సాధారణ సాగులో కనీసం 18 శాతం కూడా పూర్తి కాలేదు. తొలకరి చినుకులతో ఆశగా దుక్కులు దున్నిన రైతులు వారాలుగా వర్షం కోసం ఎదురుచూసి ఎక్కడి పనులు అక్కడే ఆపేశారు. జిల్లాలోని 28 మండలాల్లో లోటు వర్షపాతం నెలకొనడంతో ఈ ఏడాది సాగు సాధ్యమయ్యేనా అనే ఆందోళనలో వారిలో నెలకొంది.

జూన్‌ 16వ తేదీన వర్షం పడటంతో మూడెకరాల్లో పత్తి విత్తనాలు నాటించాను. అప్పటి నుంచి నెల రోజులకుపైగా సరైన వర్షం కురవకపోవడంతో పూర్తి స్థాయిలో విత్తనాలు మొలకెత్తలేదు. అరకొర మొలకెత్తినా వేడికి ఎండిపోతున్నాయి. చేసేదేమీ లేక పంటను ట్రాక్టర్‌తో దున్నేశా. మంచి వర్షాలు మొదలైతే మరోసారి సాగు చేయాల్సిందే. తీవ్ర ఆర్థిక భారం పడనుంది.

– జంపని సురేష్‌, రైతు, గణపవరం

ఈ ఏడాది ఖరీఫ్‌లో నాలుగు ఎకరాల్లో కంది సాగు చేయడానికి విత్తనాలు తీసుకొచ్చి దుక్కి దున్ని సిద్ధంగా ఉన్నా. నెల రోజులుగా మంచి వర్షాలు కురవడం లేదు. దీంతో ఎప్పుడు పడుతుందా, సాగు ఎప్పుడు చేస్తానన్న ఆందోళన నెలకొంది. ఇదే వాతావరణం మరో పది రోజులు కొనసాగితే ఖరీఫ్‌ సాగు చేయడానికి రైతులు ముందుకు వచ్చే పరిస్థితి ఉండదు.

– చెవల వెంకటేశ్వర్లు, రైతు, శావల్యాపురం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement