విశాఖలో ప్రమాదం.. ఇనిమెళ్లలో విషాదం | - | Sakshi
Sakshi News home page

విశాఖలో ప్రమాదం.. ఇనిమెళ్లలో విషాదం

Jul 20 2026 1:38 AM | Updated on Jul 20 2026 1:38 AM

తెనాలిలో రక్తపుటేరులు

శుభకార్యానికి వెళుతుండగా

కబళించిన మృత్యువు

ఒకే గ్రామానికి చెందిన

ముగ్గురు దుర్మరణం

ఈపూరు: విశాఖపట్నం సమీపంలోని పెందుర్తి– ఆనందపురం జాతీయ రహదారిపై ఆదివారం తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంతో పల్నాడు జిల్లా ఈపూరు మండలం ఇనిమెళ్ల గ్రామంలో విషాదం అలముకుంది. ఈ ప్రమాదంలో గ్రామానికి చెందిన ముగ్గురు, నరసరావుపేటకు చెందిన డ్రైవర్‌ మృతి చెందారు. ఇనిమెళ్లకు చెందిన మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. నరసరావుపేటలో విధులు నిర్వహిస్తున్న ఓ పోలీస్‌ అధికారి శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో శుభకార్యం ఏర్పాటు చేశారు. ఇనిమెళ్ల గ్రామానికి చెందిన పాలగాని రామాంజనేయులు, షేక్‌ మీరావలి, మందపాటి చంద్రశేఖర్‌, అతని కుమారుడు మందపాటి భవాని శంకర్‌లు వాహనంలో శనివారం సాయంత్రం అక్కడికి బయలు దేరారు. తెల్లవారుజామున విశాఖ సమీపంలోని ఆనందపురం జాతీయ రహదారిపై వీరి వాహనం ముందు వెళ్తున్న లారీని వేగంగా ఢీకొంది. పాలగాని రామాంజనేయులు (51), షేక్‌ మీరావలి (55), మందపాటి భవాని శంకర్‌ (11) అక్కడికక్కడే మృతి చెందారు. మందపాటి చంద్రశేఖర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. ఆయనకు ఆసుపత్రిలో అత్యవసర చికిత్స అందిస్తున్నట్లు తెలిసింది. ఈ దుర్ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

పెద్ద దిక్కును కోల్పోయాం...

పాలగాని రామాంజనేయులుకు భార్య, ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. ప్రస్తుతం భార్య, వృద్ధురాలైన తల్లి, ఇద్దరు కుమారులతో కలసి ఆయన ఉంటున్నారు. తనకున్న కొద్దిపాటి పొలంతోపాటు మరికొంత కౌలుకు సాగు చేస్తుంటారు. కుటుంబానికి అండగా ఉండే ఆయన మృతి చెందడంతో పెద్ద దిక్కును కోల్పోయామని బాధితులు కన్నీరుమున్నీరు అయ్యారు.

బడికి సెలవు కావడంతో..

మందపాటి చంద్రశేఖర్‌కు భార్య, ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. వారిలో చిన్నవాడైన మందపాటి భవాని శంకర్‌ ఆరో తరగతి చదువుతున్నాడు. తండ్రి చంద్రశేఖర్‌ కారులో శుభకార్యానికి వెళుతుండగా ఆదివారం పాఠశాలకు సెలవు కావడంతో వస్తానని చెప్పి తండ్రితోపాటు వెళ్లి మృత్యువాత పడ్డాడు. కుమారుడు మరణించి, భర్త ప్రాణాపాయ స్థితిలో ఆసుపత్రిలో ఉండటంతో బాధిత కుటుంబం విలపిస్తున్న తీరు చూపరులను సైతం కంటతడి పెట్టించింది.

ఇక దిక్కెవరు...

షేక్‌ మీరావలికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. పెద్ద కుమారుడు కెనడాలో ఉద్యోగి. చిన్న కుమారుడు గతంలో రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. ప్రస్తుతం తండ్రికి తోడుగా ఇంటి వద్ద ఉంటున్నాడు. వ్యవసాయ పనులు చేసుకుంటున్నాడు. రోడ్డు ప్రమాదంలో ఇంటి పెద్దను కోల్పోవడంతో కుటుంబం విషాదంలో మునిగింది.

నిన్నటివరకు తమ కళ్లముందే తిరిగిన వారు ఇలా రోడ్డు ప్రమాదంలో మృతి చెందడాన్ని గ్రామస్తులు సైతం జీర్ణించుకోలేకపోతున్నారు. ప్రస్తుతం మృతదేహాల కోసం ఆయా కుటుంబాల వారు కన్నీటితో ఎదురుచూస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement