మళ్లీ కరోనా కలవరం | - | Sakshi
Sakshi News home page

మళ్లీ కరోనా కలవరం

Jul 19 2026 2:02 AM | Updated on Jul 19 2026 2:02 AM

ఆదివారం శ్రీ 19 శ్రీ జూలై శ్రీ 2026 మళ్లీ కరోనా కలవరం పల్నాడులో ముందస్తు చర్యలు శూన్యం

న్యూస్‌రీల్‌

జాగ్రత్తే రక్షణ

ఆదివారం శ్రీ 19 శ్రీ జూలై శ్రీ 2026
పల్నాడులో ముందస్తు చర్యలు శూన్యం

నరసరావుపేట టౌన్‌: జిల్లాకు ప్రధాన వైద్య కేంద్రంగా ఉన్న నరసరావుపేట ప్రభుత్వ ఏరియా ఆస్పత్రి కరోనా పరిస్థితులను ఎదుర్కొనే స్థాయికి సిద్ధంగా లేకపోవటం ఆందోళన కలిగిస్తోంది. అవసరమైన అదనపు పడకలు, ఆక్సిజన్‌ సౌకర్యం, వెంటిలేటర్లు, అత్యవసర చికిత్సా పరికరాలు అందుబాటులో లేనట్లుగా తెలుస్తొంది. దీంతో పాటు వైద్యులు, సిబ్బందికి అవసరమైన రక్షణ పరికరాలు పీపీఈ కిట్లు, మాస్క్‌లు, గ్లౌజులు సరిపడినన్ని అందుబాటులో లేవు. కరోనా ప్రబలుతున్న నేపథ్యంలో అనుమానితుల కోసం ప్రత్యేక ఐసోలేషన్‌ వార్డు, ఆర్టీపీసీఆర్‌ పరీక్షల సౌకర్యం, తగినన్ని పరీక్షా కిట్లు, ఆక్సిజన్‌ పడకలు, అత్యవసర చికిత్స పరికరాలను ముందుగానే సిద్ధం చేయాల్సిన అవసరం ఉంది.

అయితే ఈ దిశగా ఇప్పటివరకు స్పష్టమైన ఏర్పాట్లు కనిపించకపోవడం ప్రజల్లో కలవరపాటుకు గురిచేస్తుంది. ముఖ్యంగా ప్రాణవాయువు అందించి ప్రజల ప్రాణాలను కాపాడేందుకు వైద్యశాల్లో ఏర్పాటు చేసిన ఆక్సిజన్‌ ప్లాంట్‌ నిర్వహణ లేక మూలకు చేరాయి. వాటిని వెంటనే వినియోగంలోకి తీసుకురాకుంటే అత్యవసర సమయంలో ఇబ్బందులు తప్పవు.

ప్రత్యేక వార్డు సిద్ధం చేయాలి

ఏరియా ఆస్పత్రిలో కరోనా అనుమానితుల కోసం ప్రత్యేక ఐసోలేషన్‌ వార్డును ఏర్పాటు చేసి, అదనపు పడకలు, ఆక్సిజన్‌ సిలిండర్లు, వెంటిలేటర్లు సిద్ధంగా ఉంచాలి. వైద్యులు, నర్సులు, సిబ్బందికి అవసరమైన పీపీఈ కిట్లు, ఎన్‌–95 మాస్కులు, గ్లౌజులు తగినంతగా అందుబాటులో ఉండాలి. కరోనా లక్షణాలతో వచ్చే వారి నుంచి వెంటనే స్వాబ్‌లు సేకరించి పరీక్షలు నిర్వహించేలా వీటీఎం కిట్లు, స్వాబ్‌ కిట్లు, ఆర్టీపీసీఆర్‌ పరీక్షా సామగ్రిని అందుబాటులో ఉంచాలి. వైరస్‌ను ప్రారంభ దశలోనే గుర్తిస్తే వ్యాప్తిని సమర్థంగా అరికట్టే అవకాశం ఉంటుంది.

జ్వరాలపై ప్రత్యేక నిఘా

ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో నమోదవుతున్న జ్వరాలపై ప్రత్యేక పర్యవేక్షణ అవసరం. ప్రతిరోజు నమోదవుతున్న జ్వరాల వివరాలను సమీక్షించి, కరోనా అనుమానితులను గుర్తించాలి. వారి నమూనాలను వెంటనే పరీక్షలకు పంపించి, అవసరమైతే కాంటాక్ట్‌ ట్రేసింగ్‌ చేపట్టాలి. గ్రామ, వార్డు స్థాయిలో ఆరోగ్య సిబ్బంది ప్రజలకు అవగాహన కల్పించాల్సి ఉంది.

తొలి కేసు గుర్తొస్తోంది...

కరోనా తొలి దశలో పల్నాడు జిల్లాలో నమోదైన మొదటి కేసు నరసరావుపేటలోనే వెలుగు చూసింది. వరవకట్ట ప్రాంతాన్ని రెడ్‌జోన్‌గా ప్రకటించి భారీ స్థాయిలో నియంత్రణ చర్యలు చేపట్టారు. ఆ తర్వాత జిల్లాలో వైరస్‌ వేగంగా వ్యాపించి అనేక కుటుంబాలను తీవ్ర ఇబ్బందులకు గురిచేసింది. ఆ చేదు జ్ఞాపకాలు ఇంకా ప్రజల మదిలో చెరిగిపోలేదు.

నరసరావుపేట ప్రభుత్వ ఏరియా వైద్యశాల

జ్వరం, దగ్గు, గొంతు నొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకుండా వెంటనే ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లి వైద్యుల సలహా తీసుకోవాలి. అవసరమైన సందర్భాల్లో మాస్కు ధరించడం, చేతుల పరిశుభ్రత పాటించడం, రద్దీ ప్రాంతాల్లో జాగ్రత్తలు తీసుకోవడం మంచిదని వైద్యులు సూచిస్తున్నారు. కరోనా మళ్లీ వ్యాప్తి చెందే అవకాశాల నేపథ్యంలో కేసులు వచ్చిన తర్వాత స్పందించడం కంటే ముందుగానే సిద్ధమైతేనే ప్రజల ఆరోగ్యాన్ని సమర్థంగా కాపాడగలమని నిపుణులు సూచిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement