నరసరావుపేట రూరల్: లింగంగుంట్ల శంకరభారతీపురం జెడ్పీ హైస్కూల్‌లో సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కార్పొరేట్ సామాజిక బాధ్యతలో భాగంగా విద్యార్థినులకు 101 సైకిళ్లను పంపిణీ చేశారు. పాఠశాలలో శనివారం నిర్వహించిన కార్యక్రమంలో బ్యాంక్ జోనల్ హెడ్ ఎం.పిచ్చయ్య, రీజినల్ హెడ్ జీవీ రమణారావు, నరసరావుపేట శాఖ మేనేజర్ పి.వెంకట రవికుమార్‌లు అతిథులుగా పాల్గొన్నారు. విద్యార్థినులను ప్రొత్సహించాలనే ఉద్దేశంతో సైకిళ్లు పంపిణీ చేసినట్టు పేర్కొన్నారు. హెచ్‌ఎం పార్వతి, ఉపాధ్యాయులు, బ్యాంక్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
నరసరావుపేట: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి భవనం వెంకటరామిరెడ్డి జయంతిని పురస్కరించుకొని శనివారం వెంకటరామ్ మెమోరియల్ జీబీఆర్ హాస్పిటల్‌లో సత్తెనపల్లి సమన్వయకర్త డాక్టర్ గజ్జల సుధీర్‌భార్గవరెడ్డి ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి భవనం చేసిన సేవలను కొనియాడారు. పలువురు నాయకులు పాల్గొన్నారు.
మంగళగిరి టౌన్: విజయవాడ కనకదుర్గ అమ్మవారికి మంగళగిరి పట్టణ ఆర్యవైశ్య మహిళా సంఘం ఆధ్వర్యంలో శనివారం సారె సమర్పించారు. ఈ మేరకు మంగళగిరి మెయిన్ బజారులోని ఆర్యవైశ్య కల్యాణ మండపం నుంచి విజయవాడ కనకదుర్గ అమ్మవారి దేవస్థానం వరకు పెద్ద ఎత్తున మహిళలు తరలివెళ్లారు. తొలుత మెయిన్ బజారులోని ఆరవైశ్య కల్యాణ మండపం నుంచి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం వరకు మహిళా సంఘం ప్రతినిధులు చీర, పూలు, పండ్లు, స్వీట్లతో ఊరేగింపుగా వెళ్లి స్వామివారిని దర్శించుకున్నారు. ధ్వజ స్తంభం వద్ద కొబ్బరికాయలు కొట్టారు. ఈ కార్యక్రమంలో పట్టణ ఆర్యవైశ్య మహిళ సంఘం ప్రధాన కార్యదర్శి త్రిపురమల్లు అపర్ణ పార్వతి, కోశాధికారి వెంకట కీర్తి, కమిటీ సభ్యులు, మహిళలు పాల్గొన్నారు. ప్రత్యేక ఆహ్వానితులుగా మంగళగిరి పట్టణ ఆర్యవైశ్య సంఘాల సమైఖ్య అధ్యక్షుడు సంకా బాలాజీ గుప్త హాజరయ్యారు.
మంగళగిరి టౌన్: ఆపరేషన్ క్లీన్ స్వీప్ పారిశుద్ధ్య కార్యక్రమంలో మూడు లక్షల జనాభాకు పైబడిన పట్టణ స్థానిక సంస్థల విభాగంలో మంగళగిరి – తాడేపల్లి నగరపాలక సంస్థ రాష్ట్రంలో ప్రథమ స్థానం సాధించింది. ఈ మేరకు గుడివాడలో జరిగిన రాష్ట్రస్థాయి వేడుకల్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా ఎంటీఎంసీ కమిషనర్ అలీంబాషా అవార్డును, ప్రశంసా పత్రాన్ని శనివారం అందుకున్నారు. స్వచ్ఛత, పారిశుద్ధ్య నిర్వహణలో ఎంటీఎంసీ కనబర్చిన విశిష్ట పని తీరుకు గుర్తింపుగా ఈ పురస్కారం లభించినట్లు అధికారులు తెలిపారు. నగర పరిశుభ్రత, వ్యర్థాల నిర్వహణ, పారిశుద్ధ్య కార్యక్రమాల అమలులో అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేయడం వల్లే ఈ విజయం సాధించినట్లు పేర్కొన్నారు.


