ఇసుక రీచ్ పునరుద్ధరించాలని స్థానికుల డిమాండ్ పనులు లేక పస్తులుంటున్న ఇసుక కార్మికులు నష్టాలపాలైన పడవ యజమానులు
కనీసం పట్టించుకోని టీడీపీ ప్రభుత్వం
రీచ్‌ను పునరుద్ధరించాలి
సర్కార్ తీరుతో రోడ్డున పడ్డాం
అచ్చంపేట: కస్తల రీచ్‌లోని ఇసుక అంటే ఓ బ్రాండ్. పెద్ద కట్టడాలు, వంతెనలు, అపార్టుమెంట్లు నిర్మించడానికి ఇక్కడి నుంచే ఇసుక తరలించేవారు. చంద్రబాబు ప్రభుత్వం వచ్చిననాటి నుంచి గత రెండేళ్లుగా ఈ రీచ్ మూతపడింది. దీనినే నమ్ముకున్న కార్మికులు పనులు లేక రోడ్డున పడ్డారు. రూ.లక్షల వ్యయంతో కొనుగోలు చేసిన పడవలు ఎండకు ఎండుతూ, వానకు తడుస్తూ పాడవుతున్నాయి. ఈ రీచ్ నుంచి హైదరాబాద్, చైన్నె వంటి మహా నగరాలకు ఇసుకను పెద్ద వాహనాల్లో తరలించేవారు. నది లోతుల్లో నుంచి ఇసుకను తోడుకుని వచ్చేందుకు గ్రామస్తులు ఒక్కో పడవను సుమారు రూ.10 లక్షల వ్యయంతో ప్రత్యేకంగా తయారు చేయించుకున్నారు. ఒక్కో పడవలో లారీకి సరిపడా ఇసుకను అంటే 25 నుంచి 30 టన్నుల వరకు నింపవచ్చు. ఇలా తీసుకొచ్చి లారీలకు నింపేవారు. ఈ రీచ్ కేవలం కూలీలలతో మాత్రమే నడిచేది.
నిబంధనలకు పాతర
ప్రభుత్వ నిబంధనల మేరకు ఇసుక రీచ్‌లలో యంత్రాలను ఉపయోగించకూడదు. కేవలం కూలీలతోనే ఇసుకను లోడ్ చేయాల్సి ఉంది. అందుకు కస్తల రీచ్‌లో వేల మంది కార్మికులు అడ్డుపడతారు కాబట్టి ఆ రీచ్‌ను పరిగణనలోకి తీసుకోకుండా అనధికార క్వారీలకు ఎలాంటి అనుమతులు లేకుండానే నిర్వహిస్తున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన మొదటి ఏడాది కోనూరు, అంబడిపూడి రీచ్‌లలో భారీ యంత్రాలు, గ్రిడ్జిస్ వినియోగించవచ్చన్న కారణంగా ఆ రీచ్‌లకు మాత్రమే బహిరంగవేలం నిర్వహించారు. అక్కడ అక్రమార్కుల ఆగడాలు ఎక్కువ కావడం, టీడీపీలోనే రెండు గ్రూపులు ఏర్పడి పరస్పరం ఫిర్యాదులు చేసుకోవడంతో ఇప్పుడవీ మూతపడ్డాయి. చింతపల్లి రీచ్ నుంచి ఇసుక అక్రమ తరలింపు జరుగుతోంది. బడా రాజకీయ నాయకుల అండదండలతో ఇసుక అక్రమ రవాణా సాగుతోంది. అధికారులు నామమాత్రపు దాడులకే పరిమితం అవుతున్నారు. ఇసుక రీచ్‌ను నమ్ముకుని కస్తల గ్రామంలో 200కుపైగా పడవలను గ్రామస్తులు కొనుగోలు చేసుకున్నారు. కూటమి ప్రభుత్వంలోకి రీచ్ పూర్తిగా మూతపడిపోవడంతో పడవలన్నీ ఒడ్డుకే పరిమితమయ్యాయి. రెండేళ్లుగా వీటిని వియోగించకపోవడంతో ఎండకు ఎండుతూ, వానకు తడుస్తూ, వరదలు వచ్చినప్పుడు మునిగిపోతూ, చెదలు పట్టి దాదాపు శిథిలావస్థకు చేరుకున్నాయి. వెయ్యి మందికిపైగా పనిచేసే కార్మికులు ఉపాధి లేక వీధులపాలయ్యారు.
రీచ్ వెలవెల
ఒకప్పుడు వేల మంది ఇసుక కార్మికులతో, నిత్యం వచ్చిపోయే లారీలు, ట్రాక్టర్లుతో కళకళలాడే కస్తల రీచ్ ఇప్పుడు వెలవెలబోతోంది. కస్తల గ్రామానికి చెందినవారే కాకుండా కోనూరు, రుద్రవరం, ఓర్వకల్లు, చిగురుపాడు, కోగంటివారిపలెం, కొండూరు, నిండుజర్ల, ఊటుకూరు తదితర గ్రామాలకు చెందిన వారు ఇక్కడ పనిచేశారు. వారంతా ఉపాధి లేక, ఏం చేయాలో తెలియక, కుటుంబ పోషణ కష్టమై కొట్టుమిట్టాడుతున్నారు. ఈ విషయాన్ని అనేకసార్లు ప్రజా ప్రతినిధులకు, అధికారులకు, ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినా మొర ఆలకించడంలేదని కార్మికులు వాపోతున్నారు.
కస్తల రీచ్‌లో
నిరుపయోగంగా పడవలు
కస్తల రీచ్‌ని పునరుద్ధరించకపోవడంతో దీనిపైనే ఆధారపడిన వేల మంది కార్మికులకు ఉపాధి లేక రోడ్డున పడ్డారు. రూ.లక్షల వ్యయంతో పడవలను కొనుగోలు చేసిన యజమానులు కూడా తీవ్రంగా నష్టపోతున్నారు. ఇకనైనా రీచ్ పునరుద్ధరించాలి.
– షేక్ మహబూబ్ సుభాని,
మాజీ సర్పంచ్, కస్తల
కూటమి ప్రభుత్వం పుణ్యమా అని కస్తల ఇసుక రీచ్ మూతపడటంతో దీనిని నమ్ముకున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ కులాలకు చెందిన వేల మంది కార్మికులు పనులు లేక రోడ్డున పడ్డారు. పక్క గ్రామాల నుంచి కూడా కార్మికులు వచ్చి ఈ రీచ్‌లో పనిచేసేవారు. వీరంతా కష్టాల పాలయ్యారు.
– గుడేటి సలోమాన్,
ఇసుక కార్మికుడు, కస్తల


