గురుకుల విద్యార్థులు, తల్లిదండ్రులపై చంద్రబాబు సర్కారు అమానుషం చదువు కోసం వేడుకున్నా కనికరించని పాలకులు అడిగినందుకు దళిత తల్లిదండ్రులు, విద్యార్థి సంఘం నేతలపై దాడి పోలీసుల పైశాచికత్వంతో దిక్కుతోచని స్థితిలో పిల్లలను తీసుకెళ్లిన కన్నవారు ఇప్పటికిప్పుడు వెళ్లిపోమనడంతో పిల్లల భవిష్యత్తుపై కన్నీరు
తాడికొండ: స్థానిక డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురుకుల పాఠశాలలో పేద విద్యార్థులు, తల్లిదండ్రులపై చంద్రబాబు ప్రభుత్వం దాష్టీకానికి దిగింది. పోలీసులను ఉసిగొల్పి విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థి సంఘం నాయకులను బెంబేలెత్తించింది. తమకు చదువు కావాలని బతిమాలుతూ ‘అయ్యా మా పిల్లలను రోడ్డున పడేయకండి.. చదువుకుంటారు. పాఠశాల ఉంచండి..’ అని అడిగినందుకు దళిత తల్లిదండ్రులు, విద్యార్థి సంఘం నాయకులను పోలీసులు చితకబాదారు. అనంతరం అరెస్టు చేసి స్టేషన్‌లో బంధించారు. ఇప్పటికే ఈ విషయంపై మూడు సార్లు రోడ్డెక్కి నిరసనలు తెలియజేసిన విద్యార్థుల తల్లిదండ్రులకు ఇక కన్నీరే మిగిలింది.
పేద విద్యార్థులకు అన్యాయం
ఐఐటీ– జేఈఈ, నీట్ ఎక్స్‌లెన్స్ సెంటర్ల ఏర్పాటు పేరుతో ఇటీవల ప్రభుత్వం మంత్రివర్గ తీర్మానం ప్రవేశపెట్టింది. దీని ప్రకారం ప్రస్తుతం ఉన్న మూడు గురుకుల పాఠశాలలను ఖాళీ చేయించి వాటిలో ఎక్స్‌లెన్స్ సెంటర్‌లను ఏర్పాటు చేస్తామని ప్రచారం చేసింది. వీటిని ప్రభుత్వమే నిర్వహిస్తుందా.. అంటే అదీ కాదు. పీపీపీ పద్ధతిలో ప్రైవేటుకు అప్పగించేందుకు రంగం సిద్ధం చేసింది. అనుకున్నదే తడవుగా సోషల్ వెల్ఫేర్ డిపార్ట్‌మెంట్ అధికారులు తాడికొండతోపాటు తిరుపతి జిల్లా కోట, విశాఖ జిల్లా మేఘాద్రి గడ్డలోని గురుకుల పాఠశాలలకు చెందిన 1,500 మంది విద్యార్థులను బలవంతంగా బయటకు పంపేందుకు రంగం సిద్ధం చేశారు. విద్యార్థుల తల్లిదండ్రులకు సమావేశం ఏర్పాటు చేసి పేరుకు కూడా తెలియజేయలేదు. ఫోన్లు మాత్రమే చేసి ఇక్కడ గురుకుల పాఠశాల సెంటర్‌ను తీసివేస్తున్నారని, ఐఐటీ సెంటర్ వస్తున్నందున పిల్లలను తీసుకెళ్లాలని హుకుం జారీ చేశారు. రెక్కాడితే కానీ డొక్కాడని పేద విద్యార్థులు విషయం ఏమిటా అని సోమవారం పాఠశాలకు చేరుకొన్నారు. విషయం తెలిసిన తర్వాత ఆవేదనతో నిరసన వ్యక్తం చేశారు. దీంతోపాటు ఆర్డీఓ, జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. తర్వాత విద్యార్థుల సమావేశం ఏర్పాటు చేసి సమాచారం తెలియజేయాలని చెప్పినా నిబంధనలు ఉల్లంఘించి పిల్లలను తీసుకెళ్లాలని తల్లిదండ్రులకు చెప్పడంతో ఏం చేయాలో పాలుపోక రోడ్డెక్కారు.
అండగా నిలిచిన వైఎస్సార్‌సీపీ
బాధితులకు వైఎస్సార్‌సీపీ తాడికొండ నియోజకవర్గ ఇన్‌చార్జి వనమా బాల వజ్రబాబు అండగా నిలిచారు. గురువారం బాధితులతో కలసి పాఠశాలకు చేరుకొని పాఠశాలను తరలిస్తే సహించేది లేదని, ఐదు ఎకరాల విలువైన స్థలం ఉందని గుర్తుచేశారు. కావాలంటే భవనాలు నిర్మించుకోవాలని, కానీ పేదల ఉసురుపోసుకుంటే ఒప్పుకోబోమని హెచ్చరించారు. గురుకులాలను పూర్తిగా తొలగించి విద్యార్థులను రోడ్డుపాలు చేయడం తగదని ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. తల్లిదండ్రులను అమానుషంగా కొట్టి బెదిరించారన్నారు. విద్యార్థులను బయటకు పంపించేశారన్నారు.


