ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మకు ఆషాఢ సారె సమర్పించేందుకు పెద్ద ఎత్తున భక్త బృందాలు తరలివస్తున్నాయి. శనివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు సుమారు 30కి పైగా బృందాలకు చెందిన పది వేల మందికి పైగా భక్తులు తరలివచ్చి అమ్మవారికి సారె సమర్పించారు. తెల్లవారుజాము నుంచి పెద్ద ఎత్తున భక్తులు అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. మధ్యాహ్నం మహా నివేదన నిమిత్తం అర్ధగంట పాటు అన్ని దర్శనాలు నిలిపివేయగా, తిరిగి 12.20 గంటలకు దర్శనాలు ప్రారంభమయ్యాయి. మధ్యాహ్నం 1.30 గంటల వరకు భక్తుల రద్దీ కొనసాగింది. సాయంత్రం ఆరు గంటలకు అమ్మవారి పంచహారతుల సేవ, పల్లకీ సేవలోనూ భక్తులు విశేషంగా పాల్గొన్నారు.


