● మైనార్టీ రెసిడెన్షియల్స్‌లో అమలు
● విద్యార్థి సమగ్ర వికాసమే లక్ష్యం
● అభ్యసన లోపాలకు చెక్
డిచ్‌పల్లి(నిజామాబాద్‌రూరల్): పుస్తకంలోని పాఠాలను కంఠస్థం చేయడమే విద్య కాదని, జీవితాన్ని అర్థం చేసుకునే ఆలోచనా శక్తే నిజమైన అభ్యసనమనే భావనతో తెలంగాణ మైనార్టీస్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ సొసైటీ (టీఎంఆర్‌ఈఐఎస్) ‘ఇగ్నైట్’ కార్యక్రమానికి శ్రీకారం చు ట్టింది. ప్రకృతిని పాఠ్యాంశంగా, అనుభవాన్ని గు రువుగా, పరిశీలనను సాధనంగా మార్చే వినూత్న విద్యా విధానంగా దీనిని విద్యావేత్తలు అభివర్ణిస్తు న్నారు. ఐదో తరగతి విద్యార్థుల్లో ప్రాథమిక అభ్య సన సామర్థ్యాలను బలోపేతం చేసి, భవిష్యత్ విద్యాభ్యాసానికి దృఢమైన పునాది వేయడమే కా ర్యక్రమ ప్రధాన ఉద్దేశం. హావభావాలు, చేతి సంకేతాలు, ఆటలు, ప్రయోగాలు, చర్చలు, నిజజీవిత ఉదాహరణలతో బోధనను సజీవంగా మార్చాలని మార్గదర్శకాలు సూచిస్తున్నాయి. ప్రతి చిన్నారిని సమర్థుడిగా తీర్చిదిద్దే దిశగా ‘ఇగ్నైట్’ ఆశాజ్యోతిగా మారనుంది.
ప్రకృతిని ఆధారం చేసుకుని..
ప్రకృతిని ఆధారంగా చేసుకుని పరిశీలన, అన్వేషణ, శిక్షణ, విద్య ద్వారా విద్యార్థుల సమగ్ర వికా సాన్ని సాధించడమే ‘ఇగ్నైట్’ ప్రత్యేకత. ముందుగా భావనను అర్థమయ్యేలా చేసి, తరువాత భాషను పరిచయం చేయడం, పరిశీలన నుంచి నిర్ధారణకు తీసుకెళ్లడం, ముందుగా అనుభవాన్ని అందించి ఆ తరువాత రచన చేయించడం వంటి మూడు బోధ నా సూత్రాలను ఈ కార్యక్రమంలో అమలు చేయ నున్నారు. గత విద్యా సంవత్సరంలో ఆరు, ఏడో తరగతుల కోసం నిర్వహించిన కాన్సెప్ట్ ఎన్‌రిచ్‌మెంట్ ప్రోగ్రామ్ (సీఈపీ) విశేష ఫలితాలు ఇవ్వ డంతో అదే అనుభవాన్ని ఐదో తరగతి విద్యార్థులకు విస్తరించారు. పుస్తక జ్ఞానాన్ని అనుభవ జ్ఞా నంతో మేళవించి పిల్లలలో స్వతంత్ర ఆలోచనలను పెంపొందించడమే దీని అసలు ఉద్దేశ్యం.
ఇగ్నైట్ విధానంలో విద్యార్థుల సాధన
విద్యార్థులకు టీచింగ్ లర్నింగ్ మెథడ్‌లో బోధిస్తున్న ఉపాధ్యాయుడు రవికుమార్
ప్రతి చిన్నారికి ప్రత్యేక
అభ్యసన మార్గం
ప్రతి విద్యార్థి ఒకే స్థాయిలో ఉండడని గుర్తించిన టీఎంఆర్‌ఐఎస్ వారిని బిలో బేసిక్, ఫౌండేషన్, డెవలపింగ్, అడ్వాన్స్‌డ్ అనే నాలుగు వర్గాలుగా విభజించి బోధన చేపట్టనుంది. అభ్యసన లోపాలను గుర్తించి వాటిని అధిగమించే దిశగా ‘ఇగ్నైట్’ ఒక సమగ్ర విద్యావేదిక. చదవడం, రాయడం, భావాన్ని వ్యక్తీకరించడం, నేర్చుకున్న అంశాలను అన్వయించడంలో ఉన్న సామర్థ్యాన్ని బట్టి ప్రత్యేక శిక్షణ అందించనున్నారు. వారాంతపు రిమీడియల్ తరగతులు, మౌఖిక పునరుద్ఘాటన, చిత్రాల ఆధారిత బోధన, సహ విద్యార్థుల సహకారంతో అభ్యసనం, ముఖ్య నిర్వచనాల పునరావృతం వంటి ప్రత్యేక వ్యూహాలతో వెనుక బడిన విద్యార్థులను ప్రధాన స్రవంతిలోకి తీసుకు రావాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
వినూత్నం, స్ఫూర్తిదాయకం
ప్రభుత్వ గురుకుల విద్యా వ్యవస్థలో ఇది ఒక వినూత్నమైన, స్ఫూర్తిదాయకమైన విద్యా కార్యక్రమంగా నిలుస్తుంది. ప్రతి సబ్జెక్టు ఉపాధ్యాయులకు ఈనెల 13 నుంచి 18 వరకు హైదరాబాద్‌లో రాష్ట్ర స్థాయి రిసోర్స్ పర్సన్‌ల ద్వారా ప్రత్యేక శిక్షణ నిర్వహించడంతో పాటు ఇప్పటికే జూమ్ వేదికగా కూడా శిక్షణ అందించారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రతి విద్యార్థి అభ్యసనంలో కొత్త వెలుగులు నింపి, మైనార్టీ గురుకుల విద్యను మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్తుందనే నమ్మకం ఉంది. – రవికుమార్, తెలుగు ఉపాధ్యాయులు


