తగ్గనున్న భూగర్భ జలమట్టం
● తగ్గనున్న వర్షపాతం, నీటి లభ్యత
● పంటల మార్పిడే ప్రత్యామ్నాయ మార్గం
● ఉన్నతస్థాయి సమావేశంలో సుదీర్ఘ చర్చ
నిజామాబాద్ అర్బన్ : జిల్లాపై ఎల్‌నినో ముప్పు తప్పేలా లేదు. ఇప్పటికే వాన జాడ కరువైంది. లోటు వర్షపాతం నమోదవుతోంది. ఎన్‌నినో ప్రభావంతోనే సరైన వర్షాలు కురవడం లేదని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. ఈ క్రమంలో అధికార యంత్రాంగం కరువు పరిస్థితులను ఎదుర్కొనేందుకు ప్రత్యామ్నాయ మార్గాలను అనుసరిస్తోంది. నిజామాబాద్ జిల్లా కలెక్టరేట్‌లో సోమవా రం జిల్లా ప్రత్యేకాధికారిణి, విద్యాశాఖ కార్యదర్శి యోగితారాణా ఆధ్వర్యంలో ప్రజాప్రతినిధులు, అధికారులతో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. జిల్లాలోని వాతావరణ పరిస్థితులు, పంటల సాగు, నేలల రకాలు, నీటి లభ్యత తదితర అంశా లపై సుదీర్ఘంగా చర్చించారు. కొందరు రైతుల అభిప్రాయాలను తీసుకున్నారు. ఈ క్రమంలో జిల్లా ఉన్నతాధికారులు ఎల్‌నినో ప్రభావం జిల్లాపై ఏ విధంగా ఉంటుంది.. వర్షపాతం నమోదు, నీటి ల భ్యత, భూగర్భజలాల, ప్రాజెక్టుల్లో నీటి లభ్యత, వ ర్షాభావ పరిస్థితులకు అనుకూలమైన పంటలు తదితర అంశాలతో కూడిన నివేదిక రూపొందించారు.
ఎల్‌నినో
పసిఫిక్ మహాసముద్రం మధ్య, తూర్పు భాగంలోని సముద్ర ఉపరితల నీటి ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా ఎక్కువ పెరుగుతాయి. దీంతో పసిఫిక్ మహాసముద్రంలోని నీరు అసాధారణంగా వేడెక్కుతుంది. ఈ వేడిగాలులు భారతదేశం వైపు వీస్తాయి. దీంతో నైరుతి రుతుపవనాలు బలహీనపడి వర్షాభావ పరిస్థితులు నెలకొంటాయి.
42 గ్రామాలపై తీవ్ర ప్రభావం
ఎల్‌నినోతో జిల్లాలో 42 గ్రామాలు తీవ్ర ప్రభావానికి లోనయ్యే అవకాశం ఉంది. 383 గ్రామాలు మధ్యస్థ, 35 గ్రామాలు తక్కువ ప్రభావమయ్యే అవకాశం ఉన్నట్లు నివేదికలో పేర్కొన్నారు.
జలాశయాలు వెలవెల
ఎల్‌నినో ప్రభావంతో జలాశయాలు నీరు లేక వెలవెలబోనున్నాయి. నిజాంసాగర్ ప్రాజెక్టుకు సంబంధించి ప్రస్తుత నీటిమట్టం 6.54 టీఎంసీలు ఉండగా వర్షభావ పరిస్థితులతో 0.63 టీఎంసీలకు చేరుకోనున్నది. శ్రీరాంసాగర్‌లో 15.05 టీఎంసీలు ఉండగా, ఎల్‌నినో ఎఫెక్ట్‌తో 0.28 టీఎంసీలకు పడిపోనున్నది. రామడుగు ప్రాజెక్టులో 0.164 టీఎంసీలు ఉండగా వర్షాభావ పరిస్థితులతో 0.10 టీఎంసీలు చేరుకుంటుందని నివేదికలో తెలిపారు.
ప్రత్యామ్నాయ పంటలే మేలు
వర్షాభావ పరిస్థితులతో జిల్లాలో ప్రత్యామ్నాయ పంటలు సాగుచేయడమే మంచిదని వ్యవసాయ శాఖ తన నివేదికలో పేర్కొంది. జిల్లాలోని నేలలు, వాటి రకాల మేరకు పంటలను వేయాలని సూచించింది. జూలై, ఆగస్టు నెలలో వేసే పంటల వివరాలను వెల్లడించింది.
8 మండలాల్లో అత్యధిక లోటు వర్షపాతం
జిల్లాలో 274.5 మి.మీటర్ల వర్షం కురవాల్సి ఉండగా, ఇప్పటి వరకు 144.0 వర్షపాతం నమోదైంది. 48 శాతం లోటువర్షపాతం నమోదైంది. ప్రస్తుతం ఒక్క మండలంలోనే అధిక వర్షపాతం నమోదు కా గా, మరొక్క మండలంలో సాధారణ వర్షపాతం, 23 మండలాల్లో లోటు వర్షపాతం, 8 మండలాల్లో అత్యధిక లోటు వర్షం కురిసింది. జిల్లా వ్యాప్తంగా లోటు వర్షపాతం నమోదవుతుంది. జూలై, ఆగస్టు నెలల్లో బలహీనం నుంచి మధ్యస్థ ఎల్‌నినో, సెప్టెంబర్‌లో బలమైన ఎల్‌నినోగా మారే అవకాశం ఉంది.
నేల రకం జూలై 31 వరకు ఆగస్టు 15 వరకు
వేసే పంటలు వేసే పంటలు
తేలికపాటి నేలలు పత్తి, కందులు కందులు
సజ్జలు+కందులు(2:1) కొర్రలు+ కందులు (4:1)
మధ్యస్థ నుంచి పత్తి, కందులు కందులు
భారీ నేలలు సజ్జలు+కందులు (4:1) కందులు+కొర్రలు(4:1)
జిల్లాలో వర్షాలు లేకపోవడంతో భూగర్భ జలమట్టం తగ్గే పడిపోనున్నది. 2025 జూన్‌లో నీటిమట్టం సగటు లోతు 11.49(ఎంబీజీల్) భూమి మట్టానికి దిగువన ఉంది. 2026 జూన్‌లో 12.61, లోటు వర్షపాతంతో జూలైలో 13.52, ఆగస్టులో 14.6 వరకు నీటిమట్టం పడిపోనుంది. ఈ ఏడాది జూన్‌లో –0.75 , జూలైలో –1.66, ఆగస్టులో –2.74 శాతం నీటి మట్టం పడిపోతుందని నివేదికలో పేర్కొన్నారు.


