సొసైటీకి ‘ఏ’ గ్రేడ్ గుర్తింపు..
● పీఏసీఎస్ ఆదాయం రూ.కోటీ 20 లక్షలు
● ఎఫ్‌పీవోగా ఎంపిక
● ఫలించిన సీఈవో, పాలకవర్గ
సభ్యుల కృషి
మాధవనగర్
నిజామాబాద్ రూరల్ : రూరల్ మండలంలోని మాధవనగర్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (సొసైటీ) నష్టాల నుంచి గట్టెక్కి లాభాల బాటలో పయనిస్తోంది. 2021–22 సంవత్సరం వరకు సొసైటీ రూ. 6,40,000 నష్టాలతో నడిచింది. ప్రస్తుతం పాలకవర్గం సభ్యులు, అధికారులు సమన్వయంతో సమష్టి కృషి ఫలితంగా రూ.ఒక కోటి 20 లక్షలతో లాభాల బాటలో నడుస్తోంది. దీంతో సభ్యులతోపాటు రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఎరువులు, విత్తనాల అమ్మకంతో..
నష్టాల్లో ఉన్న సొసైటీని లాభాల బాటలోకి తీసుకురావడానికి సొసైటీ చైర్మన్ దాసరి నాగేశ్వరావు, వైస్ చైర్మన్ పోతారెడ్డి, పాలకవర్గం సభ్యులు చర్చించి ఎరువులు, విత్తనాలు, బియ్యం అమ్మకాల వ్యాపారం చేసేందుకు శ్రీకారం చుట్టారు. ఒక ఏడాదిలో ఎరువులు రూ.2 కోట్ల అమ్మకాలు, విత్తనాలు రూ.20 ల క్షలు, బియ్యం అమ్మకాల ద్వారా రూ.10 లక్షలు వ్యాపారం జరిగాయి. ఇలా మొత్తం రూ. 2.30 కోట్ల వ్యాపారం నిర్వహించగా సొసైటీకి రూ.7లక్షలు ఆదాయం సమకూరింది. అదేవిధంగా ఏడాదిలో రెండు సీజన్లలో 80 వేల క్వింటాళ్ల ధాన్యంను రైతుల నుంచి కొనుగోలు చేయడం వల్ల ప్రభుత్వం నుంచి రూ.25 లక్షల ఆదాయం కమీషన్ రూపంలో లభించింది. ఇలా వ్యాపారం నిర్వహిస్తున్న ఫలితంగా 2020– 22, 23 సంత్సరాల్లో రూ.11లక్షల ఆదాయం సమకూరింది.
నష్టాలను అధిగమించి..
సొసైటీ ప్రతి ఏడాది జరుపుతున్న వివిధ వ్యాపారా ల వల్ల లాభాలు రావడంతో నష్టాల్లో ఉన్న రూ. 6.46 లక్షలు పూడ్చారు. ఇటీవల సొసైటీ తరపున రూ.67 లక్షలు సహకార బ్యాంకులో ఫిక్స్ డిపాజిట్ చేసినందున వడ్డీ రూపంలో ఏడాదికి ఒక లక్ష 90 వే లు రూపాయలు ఆదాయం వస్తోంది. అలాగే రైతులకు ఒక కోటి 60 లక్షలు రూపాయలతో స్వల్పకాలిక రుణాలు బ్యాంకు నుంచి ఇప్పించినందుకు. వడ్డీ రూపంలో ఒక లక్ష 50 వేలు ఆదాయం వస్తోంది. అదేవిధంగా సొసైటీ సొంత నిధులు నుంచి రూ.40 లక్షల దీర్ఘకాలిక రుణాలను రైతులకు పంపి ణీ చేశారు. దీంతో ప్రస్తుతం ఈ సొసైటీ 1.20 కోట్ల ఆదాయంతో లాభాల బాటలో నడుస్తోంది.
సహకార శాఖ అధికారులు, పాలకవర్గం సభ్యులు, సిబ్బంది, రైతులందరి సహకారంతోనే సొసైటీ లాభాల్లో నడుస్తున్నది. ఐదేళ్ల క్రితం నష్టాన్ని పూడ్చి, ప్రస్తుతం రూ.ఒక కోటి 20 లక్షలతో లాభాల బాటలో నడవడాన్ని గర్విస్తున్నాం. ఎఫ్‌పీవోకు వచ్చిన రూ.6లక్షలతో కొత్తగా ఆర్గానిక్ ఫుడ్ స్టోర్, మీ సేవా కేంద్రం తదితర వ్యాపారాలు నిర్వహించాలని పాలకవర్గం సభ్యులు నిర్ణయించారు. త్వరలోనే ఈ ప్రక్రియ ప్రారంభం అవుతుంది.
– వంశీకృష్ణ, సీఈవో, మాధవనగర్ సొసైటీ
ప్రస్తుతం లాభాల బాటలో నడుస్తున్న ఈ సొసైటీకి ఏ గ్రేడ్ గుర్తింపు లభించించింది. దీంతో కేంద్ర ప్రభుత్వం ఫార్మర్స్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్(ఎఫ్‌పీవో) కింద సొసైటీని ఎంపిక చేసింది. సొసైటీ పరిధిలో మాధవ్‌నగర్, కేశాపూర్, పాంగ్రా గ్రామాలకు చెందిన 693 మంది రైతులు ఉన్నారు. ఇందులో నుంచి 225 మంది రైతులు ఎఫ్‌పీవోలో సభ్యులుగా చేరారు. దీంతో కేంద్ర ప్రభుత్వం నుంచి రూ. 6లక్షలు మ్యాచింగ్ నిధులు మంజూరు అయ్యాయి. ఈ నిధులతో వివిధ వ్యాపారాలు చేపట్టి తద్వారా ఆదాయం సంపాదించడానికి ఎఫ్‌పీవో సభ్యులకు అవకాశం ఉంటుంది. ఏదేమైనా నష్టాలను అధిగమించి ప్రస్తుతం లాభాల బాటలో సొసైటీ నిలవడాన్ని ఇతర సొసైటీలు ఆదర్శంగా తీసుకుంటున్నారు.


