తాగునీటి అవసరాలకే..!
ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 80.5 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 15 టీఎంసీల నీరు మా త్రమే నిల్వ ఉంది. ఇందులో 5 టీఎంసీలు డెడ్ స్టోరేజీ, 5 టీఎంసీలు తాగునీటి అవసరాలకు, మరో 5 టీఎంసీల నీరు ఆవిరిరూపంలో పో తుంది. అంటే ప్రస్తుతం ఉన్న నీటి నిల్వ తాగునీటి అసరరాలకు మాత్రమే సరిపోతుంది.
వేల్పూర్(బాల్కొండ): మన దగ్గర వర్షాలు కురవడం లేదు.. ఎగువ ప్రాంతం నుంచి వరద రావడం లేదు. ఫలితంగా శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ వెలవెలబోతోంది. గతేడాది జూలై రెండో వారం నాటికి ప్రాజెక్టులోకి భారీగా వరద చేరగా.. ఈ ఏడాది పరిస్థితి భిన్నంగా ఉంది. పంటల సాగుపై ఆయకట్టు రైతులు ఆశలు సన్నగిల్లుతున్నాయి. ఎస్సారెస్పీ నీటిపై ఆధారపడి సుమారు 18 లక్షల ఎకరాల ఆయకట్టు సాగవుతోంది. కాకతీయ, లక్ష్మి, సరస్వతి కాలువల ద్వారా నీటి విడుదల చేపడుతారు. అయితే ఈ ఏడాది ఆశించిన మేర నీరు లేకపోవడంతో ఆయకట్టు రైతులు ఆందోళన చెందుతున్నారు. ఖరీఫ్‌లో ఆయకట్టుకు నీరందించాలంటే ప్రాజెక్ట్‌లో కనీసం 56 టీఎంసీల నీరు నిల్వ ఉండాలి. ప్రస్తుతం 15 టీఎంసీల నీరు మాత్రమే ఉంది.
బోసిపోయిన వరదకాలువ
ఎస్సారెస్పీ వరదకాలువ సైతం బోసిపోయింది. శ్రీరాంసాగర్ మొదలుకొని బాల్కొండ, వేల్పూర్, మోర్తాడ్, కమ్మర్‌పల్లి మండలాల మీదుగా జగిత్యాల జిల్లాలోకి ఈ కాలువ ప్రవేశిస్తుంది. వరదకాలువలో గతంలో ఏడాదిపొడుగునా నీరు నిల్వ ఉండేది. దీంతో వరద కాలువకు ఇరువైపులా ఉన్న గ్రామాల పరిధిలో భూగర్భ జల మట్టం పెరిగి బోరుబావుల్లో పుష్కలంగా నీరుండేది. అలాగే చాలా గ్రామాల చెరువులు వరద కాలువ ద్వారా నింపేందుకు బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో వరదకాలువకు తూములు ఏర్పాటు చేశారు. ఇప్పుడు ఎస్సారెస్పీ నిండి వరదకాలువకు నీటిని వదిలితే తప్ప వరదకాలువ ద్వారా పరోక్షంగా బోరుబావులకు, ప్రత్యక్షంగా చెరువులకు నీరందే అవకాశం లేదు.
అడుగంటుతున్న బోరుబావులు
వివిధ మండలాల్లో బోరుబావుల కింద రైతులు వరి, మొక్కజొన్న, పసుపు, సోయాబీన్ సాగుచేస్తున్నారు. వర్షాలు లేకపోవడంతో బోరుబావుల ద్వారా పంటలకు వంతుల వారీగా నీటి తడి అందిస్తున్నారు. బోరుబావుల్లో భూగర్భజలాలు రోజు రోజుకూ తగ్గుతుండడంతో పంటల పరిస్థితి ఏమిటని రైతులు ఆందోళన చెందుతున్నారు.
వెలవెలబోతున్న శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్
మన దగ్గర వర్షాభావ పరిస్థితులు
జూలై మూడో వారానికొచ్చినా
ఎగువ నుంచి మొదలుకాని వరద
ఆందోళన చెందుతున్న
ఆయకట్టు రైతులు


